అడ్డొస్తే నరుకుతా..!
ABN , First Publish Date - 2023-11-21T05:31:34+05:30 IST
నాది ఏ ఊరనుకున్నావు.. మనుషులను నరికి జైలుకు పోయివచ్చినా.. నాకు ఎవడైనా అడ్డొస్తే అందరినీ నరుకుతా.. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి..

ఎమ్మెల్యే కాటసాని పీఏ బెదిరింపులు
ఇంటి స్థలం విషయంలో వివాదం
ఇదేమిటని అడిగిన బాధితులపై దౌర్జన్యం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
టీడీపీ నాయకులకు అంటగట్టే యత్నం
నంద్యాల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘నాది ఏ ఊరనుకున్నావు.. మనుషులను నరికి జైలుకు పోయివచ్చినా.. నాకు ఎవడైనా అడ్డొస్తే అందరినీ నరుకుతా.. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ఎవనికీ భయపడేది లేదు’ అంటూ బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పీఏ శివ పేదలపై శివాలెత్తాడు. పేదల భూమిని కాజేసేందుకు ప్రయత్నించడమే కాకుండా.. ఇదేమిటని అడిగినందుకు వారిపై దౌర్జన్యానికి దిగి భయభ్రాంతులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. బనగానపల్లెలోని పెండేకంటి నగర్ సర్వే నంబరు 137/1లో మూడు సెంట్ల స్థలాన్ని దూళ్ల లక్ష్మీదేవి అనే మహిళకు ప్రభుత్వం 20 ఏళ్ల కిందట ఇచ్చింది. ఆ తర్వాత ఈ స్థలం పక్కనే మరో 3 సెంట్ల ఖాళీ స్థలాన్ని కూడా లక్ష్మీదేవి కుటుంబం కొనుగోలు చేసింది. ఈ స్థలంపై ఎమ్మెల్యే పీఏ శివ కన్నుపడింది. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న దురుద్దేశంతో ప్రభుత్వ భూమిని ఎలా కొనుగోలు చేస్తారంటూ లక్ష్మీదేవి కుటుంబం కొన్న స్థలానికి కంచె వేసే ప్ర యత్నం చేశాడు. తమ స్థలంలో కంచె ఎలా వేస్తావంటూ బాధితులు నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన శివ తనకు అడ్డం వస్తే నరికేస్తానని, గతంలోనే హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చానని బాధితులను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. శివను కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ గొడవంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ నాయకులు దీన్ని టీడీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీదేవి కుటుంబీకులతో మళ్లీ వీడియో తీయించి.. ఎమ్మెల్యే కాటసాని పీఏ శివకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, తామే దురుసుగా ప్రవర్తించామని, పైగా టీడీపీ నాయకులు వీడియోని ఎడిట్ చేసి, శివ దౌర్జన్యానికి దిగాడన్నట్లు సృష్టించారని చెప్పించారు.