Share News

కేసుల ఆరాటంలో హోదా ఆవిరి!

ABN , First Publish Date - 2023-11-21T05:30:51+05:30 IST

వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌, తనే మెడ వంచి, కేసులు కొట్టివేయించుకోవడం కోసం ఢిల్లీలో సాగిలపడ్డారని రాజకీయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసుల ఆరాటంలో హోదా ఆవిరి!

విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందంట!

మరి నాలుగున్నరేళ్లుగా ఢిల్లీ మెడలు వంచలేదేం?

రాష్టానికి అసలు నష్టం జగన్‌ వైఖరి వల్లే..

నేడు ఢిల్లీలో విభజన సమస్యలపై కేంద్ర హోంసెక్రటరీ అధ్యక్షతన సమావేశం

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌, తనే మెడ వంచి, కేసులు కొట్టివేయించుకోవడం కోసం ఢిల్లీలో సాగిలపడ్డారని రాజకీయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు హయాంలో విభజన చట్టంలోని అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. కానీ, జగన్‌ అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద పోర్టులు, సహజ వనరులను అదానీకి రాసివ్వడం వల్ల బయటవారి చేతుల్లోకి అవన్నీ పోయాయి. ఒక్కమాటలో.. తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు కోర్టుల్లో విచారణకు రాకుండా, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ఎప్పటికప్పుడు ఢిల్లీస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవడం కోసమే అధికారంలోకి వచ్చినట్టు జగన్‌ వ్యవహారశైలి ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాని కి కొత్తగా ఆస్తులు సమకూర్చడం ఎలాగూ చేతగాదు, ఉన్న ఆస్తులను కూడా స్వప్రయోజనాల కోసం బయటవ్యక్తుల చేతుల్లో పెట్టారు. అయితే, ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జగన్‌ తిరిగి విభజన హామీలంటూ కొత్తడ్రామా షురూ చేశారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందంటూ మళ్లీ సరిగ్గా ఎన్నికల ముందు జగన్‌ కొత్త రాగం అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎ్‌సలు, ఇతర అధికారులు విభజన సమస్యలపై సమావేశమవుతున్నారు. అయితే, ఎన్నిక ల్లో లబ్ధి కోసమే ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి.

మాట మాట్లాడితే ఒట్టు..

గత నాలుగున్నరేళ్లుగా తన కుటుంబ సపరివార సమస్యల నుంచి ఉపశమనం కోసం మాత్రమే జగన్‌ పని చేశారు. ఒక్కసారి కూడా రాష్ట్ర విభజన సమస్య ల ఊసెత్తలేదు. ఆంధ్రాకు జరిగిన అన్యాయం గురిం చి ఎక్కడా మాట్లాడలేదు. మంగళవారం ఢిల్లీలో విభజన సమస్యలపై సమావేశం సందర్భంగా కూడా ఐ అండ్‌ పీఆర్‌ తరపున వాట్సాప్‌ గ్రూప్‌లో ఒక ప్రెస్‌నోట్‌ పంపారు. విభజన సమస్యలు రెండు రాష్ట్రా లూ... పరస్పర సహాయ సహకారాలతో పరిష్కారించుకోవాలని పార్లమెంటు వేదికగా కేంద్రం చెప్పింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మొదటి నుంచి స్నేహం గా మెలుగుతున్న సీఎం జగన్‌, విభజన సమస్యల పై ఎందుకు చొరవ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.

విభజన హామీలకు సంబంధించి జగన్‌ ఏపీకి రావాల్సిన సంస్థల్లో ఏ ఒక్కదాన్ని కూడా తేలేకపోయారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌ సమస్యలు నాలుగున్నరేళ్ల క్రితం ఎక్కడ ఆగిపోయాయో ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. సీఎం జగన్‌కి కూడా వీటిపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.

టీడీపీ తెచ్చింది 21,154 కోట్లు..

విభజన హామీల ప్రకారం టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్‌, ఐఐటీ, గిరిజన, వ్యవసాయ యూనివర్సిటీ సహా మొత్తం 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెచ్చింది. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం కోసం రూ.21,154 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలను ఏపీ లో భాగం చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిం ది. విభజన సమస్యలపై జగన్‌ నిర్లక్ష్య వైఖరితో పోలవరాన్ని బ్యారేజీ లాగా మార్చారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 సంస్థల ఆస్తులు, నిధుల పంపిణీ, ఉద్యోగుల విభజన వంటి సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. షెడ్యూల్‌ 9లో పేర్కొన్న 91 సంస్థలకుగానూ 44 సంస్థల విభజన మాత్రమే పూర్తయింది. విభజన చట్టంలోని పార్ట్‌ 9లో సెక్షన్‌ 84 నుంచి 91 వరకు నదీ జలాల నిర్వహణకు సంబంధించిన సమస్యలు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయినా, జగన్‌ ఏ ఒక్క విభజన సమస్య పరిష్కారం కోసమూ చొరవ చూపలేదు. దీంతో టీడీపీ హయాంలో చాలావరకు కొలిక్కి వచ్చిన అనేక సమస్యలు కూడా మళ్లీ మొదటకొచ్చాయి.

Updated Date - 2023-11-21T06:25:34+05:30 IST