కెనరా బ్యాంక్ నుంచి 3 కొత్త సర్వీసులు
ABN , First Publish Date - 2023-11-21T01:41:04+05:30 IST
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 కొత్త ఉత్పత్తులు, సర్వీ్‌సలను ప్రారంభించింది...

కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 3 కొత్త ఉత్పత్తులు, సర్వీ్‌సలను ప్రారంభించింది. కార్పొరేట్ ఏఐ1, వాట్సప్ బ్యాంకింగ్ చానల్, కెనరా యూపీఐ 123 పే పేరుతో వీటిని తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కలిసి కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు ఈ సేవలను ప్రారంభించారు. కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కెనరా ఏఐ1 కార్పొరేట్ యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించే కార్పొరేట్ ఖాతాదారులకు కార్పొరేట్ ఏఐ1 ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. అలాగే వాట్సప్ బ్యాంకింగ్ చానల్ ద్వారా ఖాతాదారులకు మొత్తం 18 రకాలైన సేవలను అందించనుంది. 9076030001 నెంబరుకు హాయ్ లేదా హలో అని మెసేజ్ చేస్తే బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్‌తో పాటు మినీ స్టేట్మెంట్ వంటి 18 రకాలైన సేవలను ఆఫర్ చేయనుంది.
ఇక ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఐవీఆర్ ఆధారిత యూపీఐ సేవలను కెనరా యూపీఐ 123 పే ద్వారా బ్యాంక్ అందించనుంది. ఇంగ్లీష్ సహా మొత్తం 10 భారతీయ భాషల్లో ఏ బ్యాంక్ ఖాతాదారులకైనా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని కెనరా బ్యాంక్ తెలిపింది.