Be careful in F&O trading! : ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో జాగ్రత్త!
ABN , First Publish Date - 2023-11-21T01:46:58+05:30 IST
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో 90 శాతం మంది నష్టపోతున్నప్పటికీ, వీటిలో ట్రేడింగ్‌పై రిటైల్ మదుపరుల ఆసక్తి కలవర పెడుతుండటంతో పాటు విస్మయానికి గురి చేస్తోందని...

ఈ సెగ్మెంట్లో 90 శాతం నష్టపోతున్నవారే..
అయినా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటం కలవరం, విస్మయానికి గురి చేస్తోంది..
దీర్ఘకాలిక వ్యూహంతోనే మెరుగైన రిటర్నులు
సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో 90 శాతం మంది నష్టపోతున్నప్పటికీ, వీటిలో ట్రేడింగ్‌పై రిటైల్ మదుపరుల ఆసక్తి కలవర పెడుతుండటంతో పాటు విస్మయానికి గురి చేస్తోందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, అప్పుడే మంచి రిటర్నులు అందుకోగలరని బీఎ్‌సఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సె్‌స (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫామ్ ప్రారంభం సందర్భంగా బుచ్ సూచించారు. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో రోజు వారీగా సొమ్ము నష్టపోయే బదులు దీర్ఘకాలిక, రక్షణాత్మక విధానంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపద పెంచుకోవాలని ఆమె ఇన్వెస్టర్లను కోరారు. బ్రోకింగ్ సంస్థ ట్రేడింగ్ వేదికలో అంతరాయం ఏర్పడిన సందర్భంలో ఇన్వెస్టర్లు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్‌ఆఫ్, క్లోజ్ చేసుకోవడం లేదా ఎగ్జిట్ అయ్యేందుకు ప్రత్యామ్నాయ వేదికగా ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.
సగటు నష్టం రూ.1.1 లక్షలు: ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లోని 45.24 లక్షల మంది వ్యక్తిగత ట్రేడర్లలో కేవలం 11 శాతమే లాభాలు గడించినట్లు సెబీ అధ్యయనంలో తేలింది. ఈ రీసెర్చ్ నోట్ ప్రకారం.. కొవిడ్ సంక్షోభ కాలంలో ఈ సెగ్మెంట్లో రిటైల్ మదుపరుల ట్రేడింగ్ అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.1 లక్షలుగా ఉన్న ఎఫ్ అండ్ ఓ రిటైల్ మదుపరులు.. గడిచిన కొన్నేళ్లలో 500 శాతానికి పైగా పెరిగారు. ప్రస్తుతం ఈ విభాగంలో ట్రేడింగ్ జరుపుతున్న రిటైల్ మదుపరులలో 35 శాతానికి పైగా 20-30 ఏళ్లలోపు వారే. 2018-19లో ఈ వాటా 11 శాతమే. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకున్న 89 శాతం మంది సగటున రూ.1.1 లక్షలు నష్టపోయారు. మిగిలిన 11 శాతం మంది మాత్రం సగటున రూ.1.5 లక్షలు లాభపడ్డారు.