Share News

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో హైదరాబాద్‌ హవా

ABN , First Publish Date - 2023-11-21T01:44:13+05:30 IST

ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం రియల్టీ రంగానికి బాగానే కలిసొచ్చింది. ఈ మూడు నెలల కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు...

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో హైదరాబాద్‌ హవా

నాలుగు రెట్లు పెరిగిన డిమాండ్‌

అట్టడుగున బెంగళూరు, ఢిల్లీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం రియల్టీ రంగానికి బాగానే కలిసొచ్చింది. ఈ మూడు నెలల కాలంలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 159 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువని వెస్టియన్‌ అనే రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో దేశంలో మరే ప్రధాన నగరాల్లో లేని విధంగా 37 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్‌ స్పేస్‌ విషయంలోనూ హైదరాబాద్‌ మిగతా నగరాలతో పోలిస్తే ముందుంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్‌లో కొత్తగా 55 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 175 శాతం ఎక్కువ.

మిగతా నగరాల పరిస్థితి అంతంతే: ఒక్క బెంగళూరు, ఢిల్లీ తప్ప మిగతా నాలుగు నగరాల్లోనూ సెప్టెంబరు త్రైమాసికంలో ఆఫీస్‌ లీజు ఒప్పందాల విషయంలో వృద్ధి రేటు కనిపించింది. బెంగళూరులో మాత్రం లీజు ఒప్పందాలు 28 శాతం తగ్గి 36 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్‌ స్పేస్‌ 25 శాతం తగ్గి 27 లక్షల ఎస్‌ఎ్‌ఫటీకి పడిపోయింది.

ఢిల్లీలోనూ 14 శాతం డౌన్‌ట్రెండ్‌ కనిపించింది. మరోవైపు ముంబై, చెన్నై, పుణె, కోల్‌కతా నగరాల్లో కార్యాలయ స్థలం లీజు ఒప్పందాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం నుంచి 83 శాతం పెరగగా, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్‌ స్పేస్‌ 71 నుంచి 125 శాతం పెరిగింది. కంపెనీలు ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రప్పిస్తున్నందున లీజు ఒప్పందాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్టు వెస్టియన్‌ కంపెనీ సీఈఓ శ్రీనివాస రావు చెప్పారు.

Updated Date - 2023-11-21T01:44:15+05:30 IST