Thefts: ఆహా.. మహానుభావుడు.. చోరీల్లో ‘సెంచరీ’ దాటేశాడు...
ABN , First Publish Date - 2023-11-18T12:25:20+05:30 IST
చోరీ వృత్తినే కులవృత్తిగా మార్చుకొని 35 ఏళ్లుగా సుమారు 100కు పైగా చోరీలకు పాల్పడిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన

- సహకరించిన వ్యక్తి కూడా...
పెరంబూర్(చెన్నై): చోరీ వృత్తినే కులవృత్తిగా మార్చుకొని 35 ఏళ్లుగా సుమారు 100కు పైగా చోరీలకు పాల్పడిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... మైలాడుదురై జిల్లా అక్కూరు సిరుపులినాయనార్ వీధిలో ఉంటున్న శంకర్ ఇంట్లో ఏడు రోజుల క్రితం ప్రవేశించిన ఆగంతకుడు 44 సవర్ల నగలు చోరీ చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు చోరీ సమయంలో ఎత్తుకెళ్లిన సెల్‌ఫోన్(Cell phone)కు పోలీసులు కాల్ చేయగా అది స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం ఆ సెల్‌ఫోన్‌లో కొత్త సిమ్ కార్డ్ వేయడాన్ని పోలీసులు గమనించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాగపట్టినం జిల్లా కొత్వాల్‌చావిడి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు చేరుకొని పాత నేరస్తుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శేఖర్ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతుండగా, అతనిపై నాగపట్టినం, కారైక్కాల్, మైలాడుదురై, కడలూరు, తిరువారూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో 100కు పైగా చోరీ కేసులున్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసుల్లో అరెస్ట్ కావడం, బెయిలుతో బయటకు వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడుతుంటాడు. పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతుంటాడు. శేఖర్ సమాచారంతో అతనికి సహకరించిన రామనాఽథపురంకు చెందిన పాండ్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దర్నీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.