Shakira Tax Fraud: పెద్ద చిక్కుల్లో పాప్-స్టార్ షకీరా.. దోషితే తేలితే ఎనిమిదేళ్ల జైలు శిక్ష
ABN , First Publish Date - 2023-11-20T21:25:18+05:30 IST
కొలంబియా పాప్-స్టార్ షకీరా ఊహించని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. పన్ను మోసం కేసులో ఆమెకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు అందాయి. ఒకవేళ ఈ ట్యాక్స్ ఫ్రాడ్ కేసులో ఈ 46 ఏళ్ల స్టార్ సింగర్ దోషిగా తేలితే..

కొలంబియా పాప్-స్టార్ షకీరా ఊహించని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. పన్ను మోసం కేసులో ఆమెకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు అందాయి. ఒకవేళ ఈ ట్యాక్స్ ఫ్రాడ్ కేసులో ఈ 46 ఏళ్ల స్టార్ సింగర్ దోషిగా తేలితే.. ఏకంగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదండోయ్.. 24 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.219 కోట్లు) జరిమానా విధించబడుతుంది. అయితే.. షకీరా మాత్రం తాను ట్యాక్స్ ఎగ్గొట్టలేదని, తన ఇమేజ్‌ని దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2011 - 2015 మధ్య కాలంలో స్పానిష్ నివాసిగా షకీరా ఆరు నెలల పైనే సమయం గడిపింది. అయితే.. ఈ టైంలో ఆమె పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. 2011లో స్పెయిన్‌కి వెళ్లిన షకీరా.. 2015 వరకూ బహామాస్‌లో అధికారిక పన్ను రెసిడెన్సీని కొనసాగించారని పన్ను అధికారులు చెప్పారు. అయితే.. షకీరా మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. అలాగే, తాను స్పానిష్ నివాసి అని నిరూపించుకోవడం కోసం 117 సాక్ష్యుల్ని పిలిచింది. వీరిలో.. హెయిర్ డ్రెసర్, స్టూడియో టెక్నీషియన్, డ్యాన్స్ టీచర్, డాక్టర్, బ్యూటీషియన్, గైనకాలజిస్ట్, డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. షకీరా పన్ను ఎగవేత కేసు మొదట 2018లో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది.
నిజానికి.. షకీరా అధికారిక నివాసం ఇప్పటికీ బహామాస్‌లో ఉంది. అయితే.. ఆ ఆరు నెలల సమయం ఎక్కడ గడిపిందనేదే ఇంకా మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే.. ఆమె పన్ను మోసానికి పాల్పడిందని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆమె స్పెయిన్‌లో గడిపి, అక్కడ పన్నులు చెల్లించలేదని వాదిస్తున్నారు. కానీ.. ఈ వాధనల్ని షకీరా తీవ్రంగా ఖండిస్తూనే ఉంది. తన ప్రతిష్టను దిగజార్చడానికి.. ఇతర స్పానిష్ పన్ను చెల్లింపుదారులకు తనను ఉదాహరణగా చూపేందుకు పన్ను అధికారులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ.. ట్యాక్స్ ఫ్రాడ్ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.
కాగా.. ఈ కేసు విచారణ బార్సిలోనా కోర్టులో జరుగుతుంది. ఈ విచారణ డిసెంబర్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కోర్టు మొత్తం 120 మంది సాక్షులను విచారించనుంది. ఈ విచారణలో షకీరా నిర్దోషిగా తేలితే పర్వాలేదు కానీ, దోషిగా తేలితే మాత్రం సుదీర్ఘకాలం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. పైగా.. భారీ జరినామా కూడా కట్టాల్సి ఉంటుంది. అంతే.. ఓవరాల్‌గా కెరీర్ సర్వనాశనం అయినట్టే. మరి, ఈ కేసులో తుది తీర్పు ఎలా వస్తుందో చూడాలి.