Share News

Pregnancy tips : పండంటి బిడ్డ కోసం...

ABN , First Publish Date - 2023-11-20T23:10:21+05:30 IST

పండంటి బిడ్డను ప్రసవించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. మరీ ముఖ్యంగా బిడ్డ మెదడు, వెన్నులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే

Pregnancy tips : పండంటి బిడ్డ కోసం...

పండంటి బిడ్డను ప్రసవించాలంటే అందుకు తగ్గట్టుగా శరీరాన్ని సిద్ధం చేయాలి. మరీ ముఖ్యంగా బిడ్డ మెదడు, వెన్నులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గర్భం దాల్చక ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు వైద్యులు.

కడుపుతో ఉన్నప్పుడు కడుపు నిండా తింటే పండంటి బిడ్డ పుడతాడు అని మహిళల నమ్మకం. కానీ అందుకు ఆహారం ఒక్కటే సరిపోదు. ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి 12.. ఈ రెండూ, గర్భంలో పిండం నాటుకోడానికీ, పిండం ఎదుగుదలకూ ఎంతో కీలకం. మొదటి మూడు నెలల్లో ఇవి లోపిస్తే, కడుపులో పెరిగే బిడ్డలో ఎదుగుదల లోపాలు చోటు చేసుకుంటాయి. రెండవ ట్రైమెస్టర్‌ అంటే, మూడు నుంచి ఆరు నెలల సమయంలో మొదటి ట్రైమెస్టర్‌లో ఏర్పడిన నాడీ కణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మొదటి త్రైమాసికంలో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి 12 వాడకపోతే, పిండంలో కొన్ని నాడీ సంబంధ లోపాలు చోటు చేసుకుంటాయి. అవేంటంటే...

వెన్ను సమస్యలు: వెన్ను ఎదుగుదల సక్రమంగా జరగదు.

మెదడు సమస్యలు: మెదడు ఎదగకపోవచ్చు. తల ఏర్పడకపోవచ్చు. మెదడులో నీటి బుడగలు తలెత్తవచ్చు.

ఈ పరీక్షలు తప్పనిసరి

ఒకసారి పిండం మెదడు లేదా వెన్నుపాములో నాడీ నష్టం జరిగిపోయిన తర్వాత, దాన్ని సరిదిద్దడం కష్టం. అయితే మున్ముందు మరింత నష్టం జరగకుండా నివారించుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో వెన్నుకు జరిగిన నష్టాన్ని కొంతమేరకు సరిదిద్దే వీలు ఉంటుంది. కానీ మెదడులో జరిగిన నష్టాన్ని సరిదిద్దే వీలుండదు. సాధారణంగా ఈ సమస్యలన్నీ రెండవ త్రైమాసికంలో బయల్పడుతూ ఉంటాయి. కాబట్టి మొదటి త్రైమాసికం చివర్లో, రెండవ త్రైమాసికం ప్రారంభంలో ఫీటల్‌ స్కాన్‌, అనామలీ స్కాన్‌ చేయవలసి ఉంటుంది. ఈ స్కాన్‌లతో పాటు కొన్ని రక్త పరీక్షల ద్వారా కూడా పిండంలోని న్యూరల్‌ ట్యూబ్‌ లోపాలను కనిపెట్టవచ్చు. అలాగే లోపాలు లేవని నిర్థారించుకోవడం కోసం అవసరమైనప్పుడు ఉమ్మనీరును పరీక్షించుకోవలసి ఉంటుంది. కొంతమందిలో జన్యులోపాల మూలంగా పిండం మెదడు, వెన్ను ఎదుగుదలలో లోపాలు ఏర్పడవచ్చు. వాటిని రెండవ ట్రైమెస్టర్‌లో చేసే స్కానింగ్‌ ద్వారా కనిపెట్టవచ్చు.

మెదడులో నీటి బుడగలు

రెండు, మూడవ త్రైమాసికంలో కడుపులో పెరిగే పిండంలో ఈ లక్షణం సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితి మూడో త్రైమాసికంలో దానంతట అదే సర్దుకుంటుంది. ఒకవేళ సమస్య నియంత్రణలోకి రాకపోతే, పిండం తలలో ఎక్కువ నీరు చేరుకోవడం లేదా బ్లాక్‌ ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రసవమైన రెండు నుంచి మూడు రోజుల్లో బిడ్డ బరువు ఆధారంగా షంట్‌ పద్ధతి ద్వారా మెదడులోని నీటిని తొలగించవచ్చు.


dr-srikanth-reddy.jpg

డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి

కన్సల్టెంట్‌ స్పైన్‌ అండ్‌ న్యూరో సర్జన్‌,

మెడికవర్‌ హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2023-11-20T23:10:22+05:30 IST