Linen and sarees : అక్కడ ఏ నారైనా చీరైపోతుంది!
ABN , First Publish Date - 2023-11-19T23:54:11+05:30 IST
అక్కడ అరటి, అనాస, గోంగూర, వెదురు, గంజాయి... ఇలా అన్ని నారలనూ చీరలుగా నేసేస్తారు. పాతిక రకాల ఫల, పుష్పాలు నారలుగా మారి చీరలు అయిపోతాయి, ..

అక్కడ అరటి, అనాస, గోంగూర, వెదురు, గంజాయి... ఇలా అన్ని నారలనూ చీరలుగా నేసేస్తారు. పాతిక రకాల ఫల, పుష్పాలు నారలుగా మారి చీరలు అయిపోతాయి, కొన్ని తరాల క్రితం తమిళనేల మీద స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన పోదలూరు చెంచయ్య శేఖర్ ‘కాదేదీ చీరకి అనర్హం’ అని నిరూపిస్తున్నారు. అలాంటి కొన్ని పూల, ఫల చీరల గురించి తెలుసుకుందామా..
‘‘నా పూర్తి పేరు పోదలూరు చెంచయ్య శేఖర్. మేము తమిళగడ్డ మీద స్థిరపడిన దేవాంగులం. ఇక్కడ తమిళ సంప్రదాయం ప్రకారం మా నాన్న పేరే నా ఇంటి పేరుగా రికారుల్లో నమోదయింది. కాబట్టిఅందరికీ సి.శేఖర్‌గానే నేను పరిచయం. దాంతో మా ఇంటిపేరు కూడా మరచిపోయే పరిస్థితి. మా ముత్తాతలది (ప్రస్తుత తిరుపతి జిల్లాలోని) సత్యవేడు ప్రాంతం. వారు తమిళనాడు వచ్చేశాక... మా తాత హయాంలో చెన్నై చాకలిపేటలో ఉండేవాళ్ళం. ఆ తరువాత చెన్నై శివార్లలోని అనకాపుత్తూరుకు చేరుకున్నాం. ఈ ప్రాంతంలో 50 శాతం తెలుగువాళ్లే. నేను, మా అన్నయ్య తెలుగే చదువుకున్నాం. నేను ఎస్ఎస్ఎల్సీ వరకూ చదివి, మా కులవృత్తిలోకి దిగాను. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నా చిన్నతనంలో మా తాతయ్య, నాన్న ‘బ్లీడింగ్ మెడ్రాస్’ చెక్క్డ్ డిజైన్ చీరలు నేసేవారు. ఆ చీరను ఉతికితే ఒక్కోసారి ఒక్కో రంగు కనిపిస్తుంది. అప్పట్లో ఆ చీరలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని విదేశాలకు ఎగుమతి చేసేవారట. తరువాత ‘రియల్ మెడ్రాస్ అండ్ కర్చీఫ్’ అనే డిజైన్ వచ్చింది. దాన్ని నైజీరియాకు ఎగుమతి చేసేవారు. ‘జక్కాడ్’ డిజైన్ చీరలకు చెన్నై వాషర్‌మెన్‌పేట ప్రసిద్ధి. అయితే మిలటరీ రూల్ రావడంతో ఆ ఎగుమతులు ఆగిపోయాయి. దాంతో ఆ డిజైన్ మరుగున పడిపోయింది. ఆ తరువాత పాలికాటన్, సిల్క్ కాటన్ లాంటివి వచ్చాయి.
ఆంజనేయ స్వామే స్ఫూర్తి...
30 ఏళ్ల క్రితం ఒక రోజు మగ్గం నేస్తూ, భోజన విరామ సమయంలో ఆలయం దగ్గర కూర్చున్నాను. అప్పుడు ఒక చిన్న కాగితం ముక్క కనిపించింది. ‘ఏమిటా?’ అని చూస్తే.. అందులో ఒక కథ ఉంది. సీతమ్మవారిని రావణుడు అపహరించి, లంకకు తీసుకువెళ్లినప్పుడు... అతను ఇచ్చిన వస్త్రాలను ధరించడానికి ఆమె ఇష్టపడలేదట. దాంతో ఆంజనేయస్వామి అరటి నారతో చీరను తయారు చేసి సీతమ్మకు ఇచ్చాడట. అరటి నారతో కూడా చీర తయారు చేయవచ్చని అప్పుడే తెలుసుకున్నాను. కానీ ఆ సంగతి అంతటితో వదిలేశాను. కొన్నేళ్ల తరువాత తిరునల్వేలిలోని ‘జీడీ నాయుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ’ విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు. తమ ప్రాజెక్టు కోసం అరటి నారతో ఓ చిన్న వస్త్రం కావాలని అడిగారు. అప్పుడు నాకు ఆంజనేయస్వామి గురించి చదువుకున్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే సరేనని చెప్పాను. ఆ తరువాత ‘ఎలా చేయాలా?’ అని ఆలోచించాను. మా ఇంటి దగ్గర ఉన్న అరటి చెట్టు బెరడును గోటితో గీస్తూ సన్నటి నార తీశాను. ఆ నార ముక్కల్ని కలిపి వైండింగ్ చేశాను. నూలుతో దాన్ని కలిపి వస్త్రం తయారు చేశాను. అయితే వాళ్ళు వంద శాతం అరటి నారతోనే వస్త్రం కావాలన్నారు. అప్పుడు అరటి నారను వరుస ఉంచి పెట్టి, గమ్ ప్రాసెస్ చేసి, కర్చీఫ్ తయారు చేశాను. అది సక్సెస్ అయింది. ఆ కర్చీఫ్ తయారు చేసినందుకు బహుశా వెయ్యి రూపాయలు ఇచ్చారనుకుంటా. ఇది జరిగి ఇరవయ్యేళ్లవుతోంది. ఆ తరువాత అరటి నారతో రకరకాల వస్త్రాలు రూపొందించడం మొదలుపెట్టాను.
గంజాయి నారతో...
నా గురించి మీడియాలో ద్వారా తెలుసుకున్న ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ ఒకరు నన్ను సంప్రతించారు. ఆయన కోరిక మేరకు కలబంద నారతో ఒక వస్త్రం తయారు చేశాను. కలబందలో చాలా రకాలున్నాయి. ఒక రకంలో జిగురు ఉంటుంది. మరో రకంలో అస్సలు ఉండదు. అందులో నార వుంటుంది. నేను దాన్ని ఎంచుకున్నాను. పది మీటర్ల వస్త్రం తయారు చేసి ఇచ్చాను. ‘‘కలబంద నారతో చీర నేస్తే వాసన వస్తుందా?’’ అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ రాదు. మేం ఆ నారను చల్లటి నీటిలో కడుగుతాం. ఎలాంటి రసాయనాలూ కలపం. వాటిని మా సంప్రదాయ విధానంలోనే కడిగి, తగిన ప్రక్రియ ద్వారా సరిచేసి, నూలు, జనపనారతో కలిపి వస్త్రం తయారు చేస్తాం. మా బృందంలోనే కొంతమంది కలబంద నుంచి నార తీస్తుంటారు. ఇక ఆ తరువాత ఫైనాపిల్ నారతో వస్త్రం చేయాలనుకున్నాను. నాగాల్యాండ్, మిజోరం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఫైనాపిల్ పంట అధికం. అక్కడ పండ్లను వినియోగిస్తారు. కానీ పండు పైన ఉండే ఆకును పారేస్తారు. ఆ ఆకును తీసుకుంటే కావలసినంత నార వస్తుంది. ఆ రాష్ట్రాల్లో ఫైనాపిల్ ఆకు చాలా పొడవుగా ఉంటుంది. వాటి నుంచి తీసే నారతో మేం చీరలు నేస్తాం. ఆ నార కూడా చేత్తోనే తీస్తాం. అయితే మేము నేసే చీరల్లో నార కొంత శాతమే ఉంటుంది. మిగిలినదంతా నూలునే ఉపయోగిస్తాం. ఇక గంజాయి నారతోనూ చీరలు నేస్తున్నాం. దీని కోసం గంజాయి మొక్క కాండం నుంచి నార తీస్తారు. ఉత్తరాఖండ్‌లో ఇది బాగా దొరుకుతుంది. గంజాయి నార తీసేందుకు ప్రభుత్వ అనుమతి కూడా ఉంది. చాలామంది ఆ చీరలను ప్రత్యేకంగా అడిగి మరీ కొనుగోలు చేస్తారు. నెలకు పదికి పైగా అవి అమ్ముడవుతాయి. మరో విషయమేమింటంటే... మిజోరాంలో తామర తూడు నారతో ఒక శాలువా నేశారట.
దాంతో మేం చీరలు నేయబోతున్నాం. గోంగూరు, వెదురు, కొబ్బరి, దర్భ నారతోనూ గతంలో చీరలు తయారు చేశాను. సహజసిద్ధంగా ఉత్పత్తి అయిన 25 రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మొక్కల నారతో 2011లో చీర నేశాను. తద్వారా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం లభించింది. సహజమైన పీచు పదార్థాల్లో ఓషధీ గుణాలు అధికం. అందుకే ఈ చీరలకు ఎనలేని డిమాండ్ ఉంది. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి నారతో పసుపు, తులసి, వేప లాంటివి కలిపి, ‘గ్రీన్ సిల్వర్ నానో టెక్నాలజీ’ని ఉపయోగించి చీరలు నేస్తుంటాం. రంగుల కోసం పసుపు, తులసి, వేప పొడులు ఉపయోగిస్తాం. వాటి వాసనలేవీ చీరలో ఉండవు. ఈ చీరలు తేలిగ్గా ఉంటాయి. ఇతర చీరల కంటే నారతో నేసిన చీరలే ఎక్కువ కాలం మన్నుతాయి.
నార శాతాన్ని బట్టి ధర...
మేము నేసే చీరల ధరలు రూ. రెండు వేల నుంచి రూ.50 వేల వరకూ ఉంటాయి. ఒక్కో చీరలో 10 నుంచి 20 శాతం వరకూ నారను ఉపయోగిస్తాం. చీరకు ఉపయోగించే నారను బట్టి ధర ఉంటుంది. మా చీరల ఫొటోలు, వాటి ధరలను ప్రతి శనివారం సోషల్ మీడియాలో పెడతాం. వాటిని చూసిన వారు కొనుగోలు చేస్తుంటారు. చాలామంది విదేశీయులు కూడా మా ఖాతాదారులుగా ఉన్నారు. . ‘అన్నాఫిట్ శేఖర్’ పేరిట ఉన్న మా ఈ-మెయిల్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటాం. నెలకు 20-25 చీరలు ఎగుమతి చేస్తున్నాం. మాకు అనుబంధంగా 60 మంది మహిళల స్వయం సహాయక బృందం ఉంది. నార తీయడం నుంచి అన్ని పనుల్లోనూ వారు పాల్గొని, ఉపాధి పొందుతున్నారు. నారతో కొన్ని వస్తువులు కూడా తయారు చేస్తుంటాం. తమిళనాడుతో పాటు పలుచోట్ల నారలతో తయారు చేసే చీరలు, ఇతర వస్తువులను ప్రదర్శిస్తున్నాం. వాటిని చూసినవారు అభినందిస్తున్నారు. నేను ఇటీవలే తమిళనాడు గవర్నర్ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎక్స్‌పోర్టర్ నేచురల్ ఫైబర్’ పురస్కారం అందుకున్నాను.
మా అబ్బాయి టెక్స్‌టైల్స్‌లో స్పెషల్ కోర్సు చేశాడు. నాకు సాయంగా ఉన్నాడు. మా దగ్గర నేర్చుకోడానికి చాలామంది వస్తూ ఉంటారు. నార చీరల తయారీపై గతంలో అసోం చేనేత కార్మికులకు కూడా శిక్షణ ఇచ్చాను పలు ప్రైవేటు సంస్థలు తమతో పని చేయాలని నన్ను అడిగాయి. కానీ వారి వైఖరి ఏకపక్షంగా ఉండడంతో ఒప్పుకోలేదు. ప్రభుత్వాల నుంచి చేయూత లభిస్తే మేం మరెన్నో అద్భుతాలు చేయగలం. మరెంతోమందికి ఉపాధి కల్పించగలం. తద్వారా మాలాంటి నేతన్నలు, రైతులు.. ఇలా ఎంతోమంది లబ్ధి పొందుతారు. అలాగే అరటి చెట్లు, ఫైనాపిల్ ఆకుల నుంచి నార తీసే యంత్రాలు అందుబాటులో ఉంటే మాకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. ‘‘ఇదంతా చేస్తున్నది మీ ప్రత్యేకత చాటుకోడానికా? రైతులను ప్రోత్సహించడానికా? డిమాండ్ ఉంది కాబట్టా?’’ అనే ప్రశ్న నాకు ఎదురవుతూ ఉంటుంది. ‘‘వాటన్నిటితో పాటు నా సంతృప్తి కోసం కూడా’’ అనేదే నా సమాధానం.’’
డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్