Share News

NRI: ది హాంగ్‌‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2023-11-20T21:20:01+05:30 IST

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు 2023 దీపావళి వేడుకలను సకుటుంబ సపరివార సమేతంగా ఇండియా క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.

NRI: ది హాంగ్‌‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వైభవంగా దీపావళి వేడుకలు

ఎన్నారై డెస్క్: హాంగ్‌కాంగ్‌లో కూడా తెలుగు వారున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వారు 2023 దీపావళి వేడుకలను సకుటుంబ సపరివార సమేతంగా ఇండియా క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తన ప్రారంభ ప్రసంగంలో విచ్చేసిన వారిని ఆహ్వానించారు. ప్రవాసులుగా కలిసి ఉండటంలో వున్న ఆనందం, ఒకరికి ఒకరం ఉన్నామన్న భద్రతాభావం, పిల్లలకు పెద్దలకు ఒక కళా వేదిక కల్పించడం సాధ్యమని, అందుకు అందరూ సమిష్టిగా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. తమ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేష్ రేనిగుంట్ల , ఇతరులకు వారి సేవలకు కృతఙ్ఞతలు తెలిపారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు.

చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళల ప్రాముఖ్యతను చాటి చెప్పింది. చిన్నారులు గుణ ఘట్టి, భేవిన్ ఘట్టి మధురమైన లలిత సంగీతం వినిపించారు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'భోళా శంకర్' పాట 'జాం జామ్ జజ్జనక' కి అదరగొట్టే స్టెప్స్‌తో చిన్నోడు రెడ్డి సాయి నేతి ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు. హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టిపొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దొచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు.

3.jpg


ఆ తరువాత, హాంగ్‌కాంగ్ తెలుగు భామలు హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య - గాన ప్రదర్శనలతో అందరినీ ఆనందపరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాన్ని చక్కటిచిక్కటి అచ్చ తెలుగులో రాధిక సంబతూర్, రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన, పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

2.jpg

Updated Date - 2023-11-21T15:08:25+05:30 IST