Share News

NRI: ఫిన్‌లాండ్‌లో నిపుణుల కొరత..విదేశీయులవైపు మళ్లిన ప్రభుత్వం చూపు!

ABN , First Publish Date - 2023-11-18T22:43:41+05:30 IST

దేశజనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం తమ పౌరుల అవసరాలను తీర్చేందుకు విదేశీ నిపుణుల వైపు చూస్తోంది. ఫలితంగా.. ఐటీ, హెల్త్‌కేర్, క్లీన్‌టెక్ రంగాల్లో విదేశీయులకు ఆహ్వానం పలుకుతోంది.

NRI: ఫిన్‌లాండ్‌లో నిపుణుల కొరత..విదేశీయులవైపు మళ్లిన ప్రభుత్వం చూపు!

ఎన్నారై డెస్క్: ఇతర ఐరోపా దేశాలలాగా నిపుణులు, కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఫిన్‌లాండ్(Finland) ప్రభుత్వం సాయం కోసం విదేశీ నిపుణుల వైపు చూస్తోంది. విదేశీ నిపుణులను ఫిన్‌లాండ్ వైపు ఆకర్షించేందుకు తాము చేపడుతున్న పలు చర్యల గురించి ప్రభుత్వ రంగ ఏజెన్సీ బిజినెస్ ఫిన్‌లాండ్‌కు చెందిన సీనియర్ డైరెక్టర్ లారా లిండ్‌మన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘వర్క్ ఇన్ ఫిన్‌లాండ్’, ‘టాలెంట్ బూస్ట్’ కార్యక్రమాలతో అనేక మంది వృత్తినిపుణులు ఫిన్‌లాండ్ బాట పడుతున్నట్టు చెప్పారు.

ఫిన్‌లాండ్‌కు మిగిలిన ప్రపంచంతో సంబంధాలు బలోపేతం చేసేందుకు విదేశీ నిపుణులు చాలా కీలకమని లారా తెలిపారు. విదేశీ నిపుణుల సాయంతో దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.


2030 నాటికల్లా 15,000 మంది విదేశీ విద్యార్థులను ఫిన్‌లాండ్‌వైపు ఆకర్షించాలన్నదే తమ లక్ష్యమని లారా తెలిపారు(Finland looking for International talent). ఉద్యోగ ఆధారిత వలసలను ఏటా 30 వేలకు పెంచాలని చూస్తున్నట్టు చెప్పారు. ఫిన్‌లాండ్ సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున దేశానికి యువతరం అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఈ దిశగా తమ దృష్టిలో ఉన్న ముఖ్యమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని తెలిపారు. ఫిన్‌లాండ్‌లో భారత మూలాలున్న వ్యాపారలు ఎందరో ఉన్నారని చెప్పారు. స్థానిక సమాజంలో సులువుగా కలిసిపోయే భారతీయులు త్వరగా అభివృద్ధి సాధిస్తారని వ్యాఖ్యానించారు. ఐరోపాయేతర దేశాల నుంచి ఫిన్‌లాండ్‌కు వస్తున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారని ఆమె వివరించారు.

ఫిన్‌లాండ్‌లో ఐసీటీ, డిటిటలైజేషన్, క్లీన్‌టెక్, హెల్త్‌కేర్ రంగాల నిపుణుల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం విదేశీ నిపుణుల వైపు చూస్తోంది. ఫిన్‌లాండ్‌లో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న వీదేశీయులకు ‘వర్క్ ఇన్ ఫిన్‌లాండ్’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తగిన సమాచారం, అవకాశాలను కల్పిస్తోంది.

Updated Date - 2023-11-18T22:43:44+05:30 IST