'Open Heart with RK' BY Katuri Narayana: అప్పట్లో ప్రధానులు వినేవాళ్లు

ABN , First Publish Date - 2023-07-24T03:52:26+05:30 IST

మా తొలి ప్రయోగం 1979లో ఎస్‌ఎల్వీ-3. అప్పటి వరకు ఇంత పెద్ద రాకెట్‌ ప్రయోగం జరగలేదు. తొలిదశ బాగానే వెళ్లింది. 20-50 సెకన్ల తర్వాత ముందుకు సాగలేదు.

 'Open Heart with RK' BY  Katuri Narayana:  అప్పట్లో ప్రధానులు వినేవాళ్లు

ఇప్పుడు ఆ సమయం లేదు.. ఎర్త్‌ ఆర్బిట్‌ వరకే గగనయాన్‌..

చంద్రుడిపైకి మనుషులను పంపే ప్రణాళిక ఇస్రోకి లేదు

జాబిల్లిపై ఇంధన ఉత్పత్తికి యత్నం

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ప్రముఖ శాస్త్రవేత్త కాటూరి నారాయణ

ఆర్కే : శాస్త్రవేత్తలు రియల్‌ హీరోలు. ప్రయోగ సమయాల్లో ఎలా ఉంటారు?

కాటూరి నారాయణ: మా తొలి ప్రయోగం 1979లో ఎస్‌ఎల్వీ-3. అప్పటి వరకు ఇంత పెద్ద రాకెట్‌ ప్రయోగం జరగలేదు. తొలిదశ బాగానే వెళ్లింది. 20-50 సెకన్ల తర్వాత ముందుకు సాగలేదు. రెండో దశలో ఏదో తేడా వచ్చింది. తొలిదశ తర్వాత ఉత్సాహం పోయింది. ఏడాది తర్వాత మళ్లీ అదే ప్రయోగం చేశాం. అప్పుడు సక్సెస్‌ అయింది. అందరి ముఖాల్లో వెలుగు. తర్వాత 1986-87లో ఏఎస్‌ఎల్వీ అనే మరో పెద్ద ప్రయోగం చేపట్టాం. తొలిదశ తర్వాత మళ్లీ ఇబ్బందులు వచ్చాయి. అయితే... ప్రతి వైఫల్యం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం. తర్వాత పీఎస్‌ఎల్వీ చేపట్టాం. తొలిదశలో ఇది విఫలమైనా.. తర్వాత సక్సెస్‌ అయ్యాం. ఏఎస్‌ఎల్వీ ప్రయోగంలో నేర్చుకున్న అనేక విషయాలు పీఎస్‌ఎల్వీలో ఎంతో ఉపయోగపడ్డాయి. ఎస్‌ఎల్వీ ప్రయోగాల సమయంలో ధావన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేవారు. అబ్దుల్‌ కలాం అప్పట్లో ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉండేవారు.

ఆర్కే : అలాంటి వారు ఆదర్శంగా ఉన్నారు మీకు!

కాటూరి నారాయణ: ఔను. 1967లో తుంబాలో చేరాను. అప్పట్లో విక్రమ్‌ సారాబాయి ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. అబ్దుల్‌ కలాం.. రాకెట్‌ లాంచర్స్‌ టీమ్‌లో ఉండేవారు. 1967 వరకు మనకు రాకెట్‌లు లేవు. దీంతో వారు అమెరికా రాకెట్ల పనిలో ఉండేవారు. సారాబాయిగారు ప్రోత్సహించేవారు. వైఫల్యాలు కొత్తకాదు.

9RK-sir.jpg


ఆర్కే : నిధుల కేటాయింపులో ప్రభుత్వాలు కొర్రీ పెట్టేవా?

కాటూరి నారాయణ: ఇతర విభాగాల మాదిరిగానే మేం కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపిస్తాం. ప్రభుత్వం ఏది ఉన్నా మాకు మద్దతు బాగానే ఉంది. ప్రయోగాల ఆలస్యానికి సాంకేతిక కారణాలే తప్ప.. నిధుల లేమి కాదు. గగన్‌యాన్‌ ప్రపోజల్‌ చాలా ఏళ్ల కిందటే ఉంది. మాధవన్‌ నాయర్‌గారు ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లోనే రూ.10 వేల కోట్ల వ్యయం చూపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఇదంత ప్రాధాన్యం కాదని భావించింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట దీనికి పచ్చజెండా ఊపారు. ధావన్‌గారు చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచి పదేళ్ల ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే అలవాటు ఏర్పడింది. మేం సర్వీసులో ఉండగా, ఏదైనా ప్రయోగం పూర్తయ్యాక ప్రతినిధి బృందంగా ఢిల్లీ వెళ్లి ప్రధానులను కలిసేవాళ్లం. పీవీ నరసింహారావుగారు, వాజపేయిగారు, గుజ్రాల్‌గారు అందరినీ కలిసేవారం. గంటకు పైగానే సమయం ఇచ్చేవారు. చర్చించేవాళ్లం. ప్రశంసించేవారు. వాళ్లతో ఫొటోలు కూడా దిగేవాళ్లం. ఇప్పుడు రొటీన్‌గా జరిగిపోతున్నాయి. ప్రధానితో ఫొటోలు దిగే సమయం లేదు.

ఆర్కే : ఇస్రోలో నంబి నారాయణన్‌ది పెద్ద మచ్చగా ఉండదా? సినిమా కూడా వచ్చింది!

కాటూరి నారాయణ: ఆ సినిమాలో చూపించినవన్నీ తప్పు. ఆయనేమీ ముఖ్యమైన వ్యక్తి కాదు. నంబి నారాయణన్‌కు బాస్‌ ముతునాయమ్‌గారు మలయాళ మనోరమలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనే చెప్పారు. నంబి నారాయణన్‌ పాత్ర ఏమీలేదని, ఇస్రో ఒక వ్యక్తిపై ఆధారపడదని పేర్కొన్నారు. ఇస్రో అనేది కలెక్టివ్‌ వర్క్‌. ఒక్కరు లేనంత మాత్రాన ఇస్రో వెనుకబడి పోయిందనేది అవాస్తవం. ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది నాకు ఫోన్‌ చేశారు. ఏది నిజం అని ప్రశ్నించారు.

ఆర్కే : చంద్రయాన్‌కు 45 రోజులు ఎందుకు?

కాటూరి నారాయణ: అపోలో వంటివి భూమి నుంచి ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి నేరుగా ప్రవేశ పెట్టారు. దీనికి చాలా శక్తివంతమైన రాకెట్‌ అవసరం. మనం చేసిన జీఎస్‌ఎల్వీకి నేరుగా ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి వెళ్లే శక్తి లేదు. అలా చేయాలంటే శాటిలైట్‌ బరువు తగ్గించాలి. మా వ్యూహం ఏంటంటే.. ముందు ఎర్త్‌ ఆర్బిట్‌లోకి పంపించి దశల వారీగా పంపిస్తాం. 2019లో చేసిన ప్రయోగాన్నే ఇప్పుడూ అనుసరిస్తున్నారు. ఇప్పటికైతే మనుషులను చంద్రుడిపైకి పంపించే ప్రణాళిక లేదు. గగనయాన్‌ కేవలం ఎర్త్‌ ఆర్బిట్‌లోకి వెళ్లే వరకే పరిమితం. ఇప్పటికైతే జీఎ్‌సఎల్వీ కన్నా శక్తివంతమైన రాకెట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆర్కే : చంద్రుడిపైకి మనుషులను పంపిస్తే ఉపయోగం ఉందా?

కాటూరి నారాయణ: ఒక్క చంద్రుడే కాదు.. మార్స్‌ వంటివాటిపైనా దృష్టి ఉంది. చంద్రుడిపై ఉన్న ఆసక్తి ఏంటంటే.. నేరుగా అక్కడకు చేరుకోవచ్చని. అక్కడ నుంచి ఇతర గ్రహాలపైకి చేరవచ్చు. బేసిక్‌గా చంద్రుడిపై వాటర్‌ ఐస్‌ ఉందని అంటున్నారు. దీని నుంచి ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ ఉత్పత్తి చేస్తే.. ఇంధన సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. ఒక ప్లాంటు అక్కడ పెట్టి.. ఉత్పత్తి పెంచే ప్రయత్నం. ఇక్కడ నుంచి మోసుకు వెళ్లకుండా చూస్తున్నారు.

9Naryan.jpg

ఆర్కే : ఏలియెన్స్‌ ఉన్నాయా?

కాటూరి నారాయణ: యూఎఫ్‌వో అనేవి చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇప్పటికీ కొన్నిచోట్ల అసాధారణ పరిణామాలు జరిగినట్టు వస్తూనే ఉన్నాయి.నిజానికి అవేంటి అనేది వివరించలేని పరిస్థితి. పీరియాడిక్‌ రేడియో వేవ్స్‌ వస్తున్నాయని ఇటీవల తెలిసింది. ఏలియెన్స్‌ వస్తున్నాయనే సంకేతాలు ఇవేనని ఒక శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఏలియెన్స్‌ ఖచ్చితంగా ఉన్నాయని కానీ, లేవని కానీ చెప్పలేం.

ఆర్కే : నాసా సూపర్‌ పవర్‌ కదా!

కాటూరి నారాయణ: అవును. అయితే నాసా కూడా ఎలాన్‌ మస్క్‌పై ఆధారపడే పరిస్థితి ఉంది. బోయింగ్‌ వారు కూడా రెడీ చేస్తున్నారు. నాసాకు 20 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ ఉంది. చైనా కూడా చాలా ముందుంది. వాళ్లకు సొంతగా స్పేస్‌ స్టేషన్‌ ఉంది. 2030కి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని చైనా వాళ్లు చెబుతున్నారు. నాసాతో పెద్దగా మనకు ఎలాంటి ఒప్పందాలు లేవు. నిసార్‌ అని శాటిలైట్‌ను లాంచ్‌ చేస్తున్నారు. యూర్‌పతో కలిసి ఎక్కువగా పనిచేస్తున్నాం.

ఆర్కే : ప్రయోగాలకు ముందు పూజలు చేస్తారు.. ఈ నమ్మకం ఎందుకు?

కాటూరి నారాయణ: సైన్స్‌ వేరు. విశ్వాసం వేరు. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టేప్పుడు దేవుడి ఆశీస్సులు తీసుకోవడం మన సంస్కృతి, సంప్రదాయం. అయితే ధావన్‌గారు చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇలా జరగలేదు. ఈ సంప్రదాయాలు యూఆర్‌ రావుగారి హయాంలో ప్రారంభించారు. శాస్త్రవేత్త అయినంత మాత్రాన దేవుడిని నమ్మరాదని ఏమీ లేదు. ప్రయోగాల్లో ఏ చిన్న తప్పు జరిగినా విఫలమైపోతుంది. అందుకే కొంత విశ్వాసాన్ని కూడా జోడిస్తాం. దీనిని విమర్శించడం సరికాదు. ఇస్రోలో పనిచేస్తున్నందుకు ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలకు లోటుండదు.

Updated Date - 2023-07-29T21:28:37+05:30 IST