ఎదురీత?
ABN , First Publish Date - 2023-11-15T15:32:01+05:30 IST
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఎంఐఎం కంచుకోటకు బీటలు!
ఏడు స్థానాల్లో మూడుచోట్ల సునాయాసం
రెండింటిలో గట్టి పోటీ
నాంపల్లి, యాకుత్‌పురాల్లో అనుమానం
పాత బస్తీలో మారుతున్న రాజకీయం
హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్, నవంబర్ 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో 60 శాతానికిపైగా ముస్లిం జనాభా ఉండటంతో ప్రతీసారి పతంగి పార్టీ అభ్యర్థులే విజేతలుగా నిలుస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆ కంచుకోటకు బీటలు వారే పరిస్థితి నెలకొంది. రెండు స్థానాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్‌లతోపాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లలోనూ ఆ పార్టీ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లలో నామమాత్రపు పోటీయేనని, అక్కడ విజయం సాధించే దిశలో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు జరగలేదని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.
ఆ మూడుచోట్ల అధిక మెజారిటీ
సిట్టింగ్ స్థానాల్లో మూడుచోట్ల సునాయసంగా భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాంద్రాయణగుట్టలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కాస్త గట్టి పోటీ ఇచ్చినప్పటికీ. ఈ ఎన్నికల్లో ఆ స్థాయి నేతలెవరూ పోటీ చేయకపోవడం అక్బరుద్దీన్‌కు కలిసొచ్చే అంశం. దాంతో ఆయన విజయం లాంఛనమే అని తెలుస్తోంది. చార్మినార్‌లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా విజయం ఎంఐఎంను వరించింది. ఈసారి కాంగ్రెస్ నుంచి అంతగా బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడం.. బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఆ సీటు మజ్లిస్ ఖాతాలోకి చేరే అవకాశముంది. ఇక బహదూర్‌పురాలోనూ అభ్యర్థి కార్పొరేటర్ కావడం, బలమైన ప్రత్యర్థి కాకపోవడం, మజ్లి్‌సకు భారీ ఓటు బ్యాంకు ఉండటంతో విజయం సులభం కానుంది.
కార్వాన్, మలక్‌పేట్‌లో శ్రమించాల్సిందే
సిట్టింగ్ స్థానాలైన కార్వాన్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో మజ్లిస్ కష్టపడాల్సిందే. ఈ రెండుచోట్లా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండటం.. అన్ని పార్టీలకు ఓటు బ్యాంకు ఉండటంతో చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా మజ్లిస్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ఈ రెండు స్థానాల్లో గట్టెక్కే అవకాశముంది.
నాంపల్లి- యాకుత్‌పురాల్లో డౌటే
పతంగి పార్టీ ఆధీనంలో ఉన్న నాంపల్లి, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో మాత్రం ఈసారి హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. ఎంఐఎంకు నాంపల్లి అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో కొత్తగా ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఎంఐఎంకు సవాల్‌గా మారింది. అప్పట్లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ కేవలం 6,799 ఓట్ల మెజారిటీతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌పై విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఫిరోజ్ ఖాన్- ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్‌ల మధ్య జరిగిన పోరులో 17,296 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. అలాగే 2018లో ఎన్నికల్లో పార్టీ మారిన ఫిరోజ్‌ఖాన్ కాంగ్రెస్ నుంచి, ఎంఐఎం నుంచి జాఫర్ హుస్సేన్ మేరాజ్‌ల మధ్య జరిగిన పోరులో 9,675 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బరిలోకి దిగిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలరా అనేది ఆ పార్టీకి ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు ప్రచారంలో ఊపు మీదున్న కాంగ్రె్‌సకు గత ఎన్నికలకంటే బలం పెరిగిందని.. ఓటర్లు కాంగ్రెస్ పథకాల వైపు ఆకర్షితులైతే నాంపల్లిలో కాంగ్రెస్ పాగా వేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పోరు హోరాహోరీ..
యాకుత్‌పురా నుంచి మజ్లిస్ అభ్యర్థిగా జాఫర్‌హుస్సేన్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయం అంత ఈజీ కాదని పాతనగర ఓటర్లలో చర్చ జరగుతుండటం గమనార్హం. 2018 ఎన్నికల వేళ అంతకుముందున్న ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్‌కు యాకుత్‌పురాలో వ్యతిరేకత ఉందని ఆయనను చార్మినార్ స్థానానికి మార్చి చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రికి యాకుత్‌పురా అప్పగించారు. అక్కడ ఎంబీటీ పార్టీకి కూడా ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ పాషాఖాద్రి విజయం సాధించారు. 2018లో ఎంఐఎం అభ్యర్థికి 69వేలకు పైగా ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి 22వేలు, ఎంబీటీకి 21 వేలు, బీజేపీకి 16వేల ఓట్లు వచ్చాయి. ఈసారి మజ్లిస్ తరపున మరో కొత్త అభ్యర్థి ప్రస్తుత నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ మేరాజ్ రావడం, ఎంబీటీ తరపున స్థానికంగా క్రేజ్ ఉన్న నేత అంజదుల్లాఖాన్ పోటీ చేయడంతో యాకుత్‌పురాలో హోరాహోరీ తప్పదని స్పష్టమవుతోంది.