Viral News: అమ్మో.. ఆ ఊరికా..? మేం రాలేమన్న అంబులెన్స్ సిబ్బంది.. మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకెళ్తోంటే..!
ABN , First Publish Date - 2023-11-20T15:59:12+05:30 IST
పాపం.. మంచం మీద మోసుకుని మరీ ఆసుపత్రికి తీసుకెళ్తుంటే జరగకూడదు అనుకున్నదే జరిగింది.

పాపం ఆ యువతి వయసు 25 ఏళ్లే.. బోలెడు జీవితాన్ని సంతోషంగా గడపాల్సిన ఆమెకు అనారోగ్యం చేసింది. అంబులెన్స్ కు కాల్ చేస్తే మేము ఆ ఊరికి రామంటూ పెద్ద షాకే ఇచ్చారు. ఎన్నో వాహనాల కోసం ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. చివరకు దుఃఖాన్ని దిగమింగుకుంటూ గ్రామస్తులు మంచం మీద ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా జరగకూడదు అనుకున్నదే జరిగింది. గ్రామాన్ని విషాదంలో నెట్టేస్తూ ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హృదయాన్ని బరువెక్కించే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
అనారోగ్యం చేసిందంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చూపించుకుని తిరిగి మళ్లీ ఆరోగ్యవంతులుగా మారిపోతుంటారు. నిజానికి ఇలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం పెద్ద వరమే అని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాలకు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉండవు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి చోట్ల విషాదాలు చోటు చేసుకుంటాయి. వెస్ట్ బెంగాల్(West Bengal) లో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, జమంగోలా పోలిస్ స్టేషన్ పరిధిలో మల్దంగా అనే గ్రామముంది. ఈ గ్రామంలో నివసించే మామణి అనే 25 ఏళ్ల మహిళకు జ్వరం వచ్చింది. జ్వరానికి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను 5 కి.మీ దూరంలో ఉన్న గ్రామీణ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మామణి భర్త కార్తీక్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది మహిళ కోసం వెళ్లడానికి సిద్దమవుతూ ఆ గ్రామం పేరు తెలుసుకని షాకైంది. మేము అక్కడికి రాలేం బాబోయ్ అంటూ ఆగిపోయింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఫుట్‌పాత్‌పై పెట్టుకున్న టీషాపును తీసేస్తున్న పోలీసులపై.. మరుగుతున్న పాలను కుమ్మరించిన మహిళ..!
మల్ధంగా గ్రామానికి వెళ్లే రహదారి మొత్తం గతుకుల మయమే. దీని కారణంగా ఆ ప్రాంతానికి వాహనాలు వెళ్లడానికి అస్సలు వీలు పడటం లేదు. ఈ విషయం తెలిసి అంబులెన్స్ సిబ్బంది రాలేమని చేతులెత్తేసింది. ఆ తరువాత మామణి భర్త కార్తీక్ ఆటోలు, రిక్షాలు మొదలైనవాటికి కూడా ఫోన్ చేసి విఫలమయ్యాడు. భార్య పరిస్థితి క్షీణిస్తుండంటంతో ఆమెను వెదురు మంచం మీద పడుకోబెట్టి గ్రామస్తుల సహాయంతో ఆమెను మోస్తూ గ్రామీణ ఆసుపత్రికి ప్రయాణమయ్యాడు. చివరికి ఆసుపత్రికి చేరుకోగా మామణిని పరిశీలించిన వైద్యులు ఆమె దారి మధ్యలోనే మరణించినట్టు ధృవీకరించారు. స్థానిక పంచాయితీ అధికారులు రహదారిని సరిగ్గా నిర్మించానికి ఎందుకు ఆసక్తి చూపించడంలేదో అర్థం కావడం లేదంటూ మల్దం గ్రామస్తుడు బాధను వ్యక్తం చేశారు. వైద్య సౌకర్యం లేకపోవడం వల్ల ఎంతో మంది మహిళలు గతుకుల రోడ్ల మీదనే ప్రసవిస్తున్నారని వాపోయారు. వెంటనే గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామస్తులు నలగోల-మాల్దా రాష్ట్ర రహదారిని దిగ్భందించారు. మూడు నెలలలోపు మరమ్మత్తు పనులు చేపడతామనే లిఖిత పూర్వక హామీ వచ్చే దాకా వారి ఆందోళన విరమించలేదు.