Share News

మరో రెండేళ్లు రోహిత్‌ కావాల్సిందే!

ABN , First Publish Date - 2023-11-21T02:42:29+05:30 IST

వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఎంతో నిర్వేదానికి గురి చేసింది. విషణ్ణ వదనంతో కనిపించిన అతడు.. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఒంటరిగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు...

మరో రెండేళ్లు రోహిత్‌ కావాల్సిందే!

అహ్మదాబాద్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఎంతో నిర్వేదానికి గురి చేసింది. విషణ్ణ వదనంతో కనిపించిన అతడు.. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఒంటరిగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఈ పరాజయంతో రోహిత్‌ అవసరం టీమిండియాకు ఉంటుందా? అనే ప్రశ్న వినవస్తోంది. కానీ, మరింత లోతుగా ఆలోచిస్తే మరో రెండేళ్ల వరకు వన్డేలు, టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ అవసరం భారత జట్టుకు ఎంతో ఉందనిపిస్తోంది.

అందుకొనే వారేరి..?: 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీ వీడే సమయానికి.. ఆ బాధ్యతలు అందుకొనేందుకు ధోనీ సిద్ధంగా ఉన్నాడు. ఇక, మహీ నిష్క్రమించే సమయానికి కోహ్లీ, రోహిత్‌ ఆ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఇప్పుడున్న కుర్రాళ్లు సారథ్య బాధ్యతలు అందుకోనే స్థాయికి చేరుకోవడానికి కొన్నేళ్లు పట్టనుంది. వరల్డ్‌కప్‌ టీమ్‌ను తయారు చేయడానికి హిట్‌మ్యాన్‌ ఎంత కష్టపడ్డాడో కోచ్‌ ద్రవిడ్‌ మాటల్లో అర్థమవుతోంది. ‘రోహిత్‌ అద్భుతమైన కెప్టెన్‌. జట్టును గొప్పగా నడిపించాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కుర్రాళ్లను ఎంతో ఉత్తేజపరుస్తాడు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాడ’ని ద్రవిడ్‌ చెప్పాడు. ఇక, మెగా ఈవెంట్‌లో రోహిత్‌ తన డాషింగ్‌ బ్యాటింగ్‌తో టీమ్‌కు శుభారంభాలను అందించగా.. బౌలర్లను చక్కగా వినియోగించుకొన్నాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్‌గా నిలబడ్డాడు. 36 ఏళ్ల రోహిత్‌.. 2027లో దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్‌ సమయానికి 40వ పడిలో పడతాడు. దీంతో అతడు మరో ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు స్వల్పమే. టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నె్‌సపై అనుమానాలున్నాయి. ఇక, కేఎల్‌ రాహుల్‌, బుమ్రాలకు టెస్టుల్లో టీమ్‌ను నడిపించేంత పరిణతి కనిపించడం లేదు. ఈపాటికే మొదలైన వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప సైకిల్‌ 2025లో ముగియనుండగా.. చాంపియన్స్‌ ట్రోఫీ కూడా అదే ఏడాది జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్‌ తప్ప టీమిండియాకు మరో ప్రత్యామ్నాయం లేదనిపిస్తోంది. అంతేకాకుండా తన వారసుడిని తయారు చేసుకోవడానికి అతడికి కొంత సమయం కూడా ఇచ్చినట్టవుతుంది.

ఐసీసీ టీమ్‌ సారథిగా రోహిత్‌

ఐసీసీ ప్రపంచకప్‌ డ్రీమ్‌ టీమ్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఎంపియ్యాడు. ఐసీసీ సోమవారం ప్రకటించిన డ్రీమ్‌ టీమ్‌లో రోహిత్‌, విరాట్‌ కోహ్లీతో కలిసి ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.

టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ రోహిత్‌ (కెప్టెన్‌), డికాక్‌, విరాట్‌ కోహ్లీ, డారిల్‌ మిచెల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌కీపర్‌), మ్యాక్స్‌వెల్‌, జడేజా, బుమ్రా, షమి, జంపా, మదుశంక; 12వ ఆటగాడు: గెరాల్డ్‌ కొట్జీ.

ఓదార్చిన ప్రధాని

దుఃఖంలో మునిగిపోయిన భారత జట్టు ఆటగాళ్లను ప్రధాని మోదీ ఓదార్చారు. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ను సందర్శించారు. ఈ సంద ర్భంగా కన్నీటి పర్యంతమైన పేసర్‌ మహ్మద్‌ షమిని ప్రధాని హత్తుకొని అనునయించారు. ‘దురదృష్టవశాత్తు ఆ రోజు మనది కాదు. టోర్నీలో మాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఓదార్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్‌. మేం మరింత బలంగా పుంజుకొని తిరిగొస్తాం’ అని షమి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావడం జట్టులో ప్రేరణ నింపిందని జడేజా అన్నాడు. ‘ప్రపంచ కప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశం గర్వించేలా ఆడారు. దేశం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది’ అని ప్రధాని సోషల్‌ మీడియాలో రోహిత్‌ సేనను ప్రశంసించారు.

డ్రెస్సింగ్‌ రూం..

ఉద్వేగ భరితం

ఒకే ఒక్క ఓటమితో జట్టు గుండె బద్దలైంది. డ్రెస్సింగ్‌ రూమంతా ఉద్వేగభరింతా మారిపోయింది. మ్యాచ్‌ ముగిశాక..సంప్రదాయం ప్రకారం ప్రత్యర్థి జట్టు, అంపైర్లు, ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ కన్నీటి సుడుల మధ్య వేగంగా మెట్లెక్కి డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. రాహుల్‌ మోకాళ్లపై కూర్చొని విషాదంలో మునిగాడు. బోరున ఏడ్చిన సిరాజ్‌ను బుమ్రా అనునయించాడు. విరాట్‌ను హత్తుకోవడం ద్వారా బాధనుంచి అతడికి అనుష్క శర్మ ఉపశమనం కలిగించేందుకు యత్నించింది. బహుమతి ప్రదానోత్సవానికి ముందు టీమిండియా సభ్యుడు ప్రతి ఒక్కరినీ సచిన్‌ అనునయించడం కనిపించింది. జట్టు సభ్యుల పరిస్థితి చూసి కోచ్‌ ద్రవిడ్‌ తీవ్ర వేదనకు లోనయ్యాడు. ‘ప్రపంచ కప్‌కోసం వారెంత శ్రమించారో కోచ్‌గా నాకు తెలుసు. దాంతో వారి బాధను చూసి తట్టుకోలేక పోయా’ అని ద్రవిడ్‌ చెప్పాడు.

Updated Date - 2023-11-21T02:42:31+05:30 IST