గృహమే కదా ‘స్మార్ట్’ సీమ
ABN , First Publish Date - 2023-11-19T11:47:05+05:30 IST
గృహ నిర్వహణ అనేది అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అయితే ఇంటిని స్మార్ట్‌గా మార్చుకునేందుకు అనేక గ్యాడ్జెట్లు పుట్టుకొస్తున్నాయి.....

గృహ నిర్వహణ అనేది అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అయితే ఇంటిని స్మార్ట్‌గా మార్చుకునేందుకు అనేక గ్యాడ్జెట్లు పుట్టుకొస్తున్నాయి. అవి జీవన విధానాన్ని సులభతరంగా, సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. అలాంటి కొన్ని ఈజీ గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేద్దాం...
ఇల్లంతా చల్లదనమే...
ఏసీ ఉంటే ఆ హాయే వేరు. అలాగని గదికో ఏసీ పెట్టించుంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు డ్రోన్ ఏసీ వచ్చేసింది. దీన్ని ఆన్ చేయగానే గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని ప్రతీ గదిలోనూ తిరుగుతూ చల్లటి వాతావరణం అందిస్తుంది. అంతేకాదు... ఇందులో ఉండే అరోమా డిఫ్యూజర్‌లో నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే చల్లదనంతో పాటు, పరిమళాలను కూడా వెదజల్లుతుంది. ఏసీ ప్రియులకు ఇది శుభవార్తే కదా.
స్విచ్‌లు స్మార్ట్‌గా...
స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయడానికి ఇకపై పదేపదే స్విచ్‌బోర్డు దగ్గరకు వెళ్లక్కరలేదు. ఇందుకోసం స్మార్ట్ స్విచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించడం కూడా సులువే. స్మార్ట్ ఫోన్‌లో సంబంధిత యాప్‌ను డౌన్‌లోన్ చేసుకొని వాయిస్ కంట్రోలర్ ద్వారా కావాల్సినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడమే. ఇంట్లోనే కాదు, దూరంగా ఎక్కడ ఉన్నా... లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, కూలర్ వంటి వాటిని సులువుగా నియంత్రించొచ్చు.
చిటికెలో దొరుకుతుంది
చాలాసార్లు తాళాలు ఎక్కడోచోట పెట్టి మర్చిపోతుంటాం. అవసరం పడ్డప్పుడు వాటిని వెతకలేక తల ప్రాణం తోకకి వస్తుంది. అయితే ‘కీ ఫైండర్’తో తాళాలను చిటికెలో గుర్తించొచ్చు. కీ చైన్‌కి ఈ గ్యాడ్జెట్‌ను తగిలిస్తే సరి. దీనిని బ్లూటూత్ సాయంతో స్మార్ట్ ఫోన్‌లోని యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తాళాలకు మాత్రమే కాదు.. వాలెట్, ఫోన్‌లకు కూడా తగిలించొచ్చు. ఎప్పుడైనా అవసరమైన వస్తువులు కనిపించకపోతే.. యాప్‌లో ఉన్న ‘ఫౌండ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వెంటనే ఆ వస్తువున్న చోట నుంచి బీప్ సౌండ్ వస్తుంది.
భయం లేకుండా...
కాలింగ్ బెల్ మోగగానే ఎవరొచ్చారోనని పరుగెత్తుకెళ్లి మరీ తలుపు తీస్తాం. అయితే స్మార్ట్ వీడియో డోర్‌తో తలుపు తీయకుండానే ఇంటికి ఎవరొచ్చారో తెలుసుకోవచ్చు. దీనిలో ఉన్న మైక్రోఫోన్ సాయంతో ఎక్కడున్నా సరే సందర్శకుడితో కమ్యునికేట్ అవ్వొచ్చు. ఎవరైనా తలుపు దగ్గరకు రాగానే వెంటనే ఇది స్మార్ట్‌ఫోన్‌కు నోటిఫికేషన్ పంపుతుంది. సందర్శకులు బెల్ నొక్కగానే సెన్సార్ కెమెరాలు యాక్టివేట్ అవుతాయి. ఎవరైనా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే... మొబైల్‌కి ప్రమాద హెచ్చరికలు పంపిస్తూ అప్రమత్తం చేస్తుంది.
బ్యాటరీ కొవ్వొత్తి
పెళ్లిళ్లు, పండుగలకు ఇల్లంతా దీపాలతో మెరిపించాలనుకుంటున్నారా? అయితే ఈ ఎలక్ట్రిక్ క్యాండిల్ మీ కోసమే. అచ్చంగా కొవ్వొత్తిలాగ కనిపించే ఈ క్యాండిల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిలో నాలుగు బ్రైట్‌నెస్ లెవెల్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి రిమోట్ సాయంతో కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఇది సుమారు 200 గంటల పాటు వెలుగుతుంది. రిమోట్ సాయంతో టైమర్ సెట్ చేసుకుంటే... నిర్ణీత గడువు ముగిశాక ఈ ఎలక్ట్రిక్ క్యాండిల్ ఆటోమేటిక్‌గా ఆరిపోతుంది. డైనింగ్ ఏరియా, బాత్రూం, లాంజ్.. తదితర ప్రాంతాల్లో ఉపయోగించొచ్చు.