Share News

మేం వస్తే బెల్ట్‌ షాపులు బంద్‌

ABN , First Publish Date - 2023-11-19T03:39:11+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను ఎత్తేస్తామని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.

మేం వస్తే బెల్ట్‌ షాపులు బంద్‌

మళ్లీ రచ్చబండ షురూ .. గ్రామాల్లోనే సమస్యలు పరిష్కరిస్తాం

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు

3 నెలల్లోపు ఆరు గ్యారెంటీల అమలు

ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 18: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను ఎత్తేస్తామని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. నియోజకవర్గంలోని సదాశివపేట మండలం నిజాంపూర్‌, కొల్కూర్‌, పొట్టిపల్లి తదితర గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో డప్పు కొడుతూ, డ్యాన్సు చేస్తూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్ట్‌షాపుల వల్ల గంటకోసారి మద్యం తాగి ప్రజలు ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని అధికారంలోకి రాగానే తిరిగి మొదలుపెడతామని వెల్లడించారు. ఎవరికి ఏ సమస్యలున్నా గ్రామాల్లో రచ్చబండలోనే పరిష్కరిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సర్కారు చేసినట్టు కాకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 చెల్లిస్తామని, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అందజేస్తామని చెప్పారు. వరి పంటకు రూ.500 బోనస్‌, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్లు లేనివారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూనే అదనంగా తులం బంగారం ఇస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-11-19T03:39:12+05:30 IST