Share News

Garbage: కొండలా పేరుకున్న చెత్త

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:34 AM

అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో మరో కొండను తలపించేలా చెత్త పేరుకుపోయింది. ఇక్కడి పర్యావరణానికి నష్టం కలిగేలా తయారైంది. పచ్చని చెట్ల మధ్య సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.

Garbage: కొండలా పేరుకున్న చెత్త
డంప్‌యార్డ్‌లో పేరుకున్న చెత్త

సమస్యపై టీటీడీ చైర్మన్‌ ఫోకస్‌

మూడు నెలల్లో తొలగిస్తాం : ఈవో

తిరుమల, నవంబరు22(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో మరో కొండను తలపించేలా చెత్త పేరుకుపోయింది. ఇక్కడి పర్యావరణానికి నష్టం కలిగేలా తయారైంది. పచ్చని చెట్ల మధ్య సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. సాఽధారణంగా రోజూ తడిచెత్త 30 టన్నులు, పొడిచెత్త 40 టన్నులు సేకరిస్తున్నారు. దీనిని గోగర్భం డ్యాం సమీపంలోని డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నారు. అక్కడ తడిచెత్తను ప్రొసెస్‌ చేశాక కంపోస్టు తయారు చేసి, మిగిలిన వ్యర్థాలను సిమెంట్‌ ఫ్యాక్టరీ లేదా పవర్‌ప్రాజెక్ట్‌లు ఉండే ప్రాంతాలకు పంపాలి. కానీ ఐదారేళ్లుగా ఈ ప్రక్రియ సరైన రీతిలో జరగలేదు. పొడిచెత్తను కూడా వేరు చేసి పునర్వినియోగం చేయదగిన వాటిని తరలించాల్సి ఉంటుంది. గత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి తరలించడంలో కూడా విఫలమాయ్యారు. కంపోస్టు కేంద్రంలో సక్రమ నిర్వహణ జరగలేదు. వచ్చిన చెత్తంతా కుప్పగా పోస్తూ వచ్చారు. దీంతో కొండను తలపించేలా వ్యర్థాలు పోగుబడ్డాయి. ప్రాసెసింగ్‌ కాంట్రాక్ట్‌ ఎంపికలోనూ సిఫార్సులు, కమీషన్ల కక్కుర్తి కారణంగా ఈ పరిస్థితి ఎదురైందని సమాచారం. సాధారణంగా 70 టన్నుల చెత్త వచ్చే ప్రాంతం కనీసం మూడెకరాలైనా ఉండాలి. కానీ తిరుమలలోని డంప్‌యార్డ్‌ ప్రదేశం ఒకటిన్నర ఎకరా మాత్రమే. ఫలితంగా చెత్త గుట్టలుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తొలి ప్రాధాన్యతగా డంప్‌యార్డ్‌పైనే దృష్టిపెట్టారు.


పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమలలో పేరుకుపోయిన లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్తను మూడు నెలల్లో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గోగర్భం డ్యాంకు సమీపంలోని డంపింగ్‌యార్డ్‌ను అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. లోపాలను గుర్తించి సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. చెత్తను కుప్పగా వే సేందుకు కాంట్రాక్ట్‌ సంస్థలు ఎందుకంటూ ఆగ్రహించారు. చెత్త విభజనలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఇలా కొనసాగితే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామన్నారు. భవిష్యత్తులో శాస్ర్తీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:34 AM