Tirumala: తిరుమల గర్భగుడిలో నేటికీ నెయ్యి దీపాలే!
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:37 AM
తరాలుగా నెయ్యి దీపాల వెలుగులోనే గర్భగుడిలోని వెంకటేశ్వరుని దర్శనం భక్తులకు కలుగుతోంది.
ఆంధ్రజ్యోతి, తిరుమల: మనసు నిండా భక్తి నింపుకొని ఆనంద నిలయంలో అడుగు పెట్టగానే భక్తులంతా దివ్యానుభూతికి లోనవుతారు. మరికొన్ని అడుగులు వేయగానే కాంతులీనే శ్రీనివాసుడు కనిపించేసరికి భక్తితో తన్మయత్వం చెందుతారు. జయవిజయుల దగ్గరకు చేరగానే తేజోవంతమైన శ్రీవారి మనోహర రూప దర్శనం చూసి ఆధ్యాత్మికానందంతో పరవశించిపోతారు. అంతా క్షణకాలమే! ఆ కాస్త సమయంలోనే శ్రీనివాసుడి మూలవిరాట్ స్వరూపం భక్తుల మదిలో ముద్రపడిపోతుంది. తిరుమలేశుడి రూపం అంత స్పష్టంగా కపించేలా చేస్తున్నది ఆధునిక విద్యుత్ వెలుగులు కాదు. కేవలం నెయ్యి దీపాలు. తరాలుగా ఈ నెయ్యి దీపాల వెలుగులోనే గర్భగుడిలోని వెంకటేశ్వరుని దర్శనం భక్తులకు కలుగుతోంది. తిరుమల ఆలయం (గర్భాలయం మినహా)లో ఒకప్పుడు వెలుగులు ప్రసరించేలా 24 దీపాలను వెలిగించేవారు. కాలానుగుణంగా ఆ నేతి దీపాల స్థానంలో కిరోసిన్, నూనె, తర్వాత విద్యుత్ వెలుగులు వచ్చాయి. గర్భాలయంలోకి మాత్రం వీటికి ప్రవేశం లేదు. ఇప్పటికీ అఖండ దీపాలే వెలుగుతూ ఉన్నాయి. మూలభాగాల్లో రెండు అఖండ దీపాలుంటాయి. మరో రెండు దీపాలు వేలాడుతూ ఉంటాయి. రోజూ ఈ దీపాలకు దాదాపు 30 కిలోల నెయ్యి వినియోగిస్తారు. గర్భాలయ దీపాల పర్యవేక్షణను ఇద్దరు ఏకాంగులు నిర్వర్తిస్తారు. సుప్రభాతసేవలోనూ, మొదటిగంట నిర్వహించే సమయంలోనూ, కల్యాణోత్సవం తర్వాత 1.30 గంటలకు, రాత్రి నైవేద్యం గంట సమయంలో ఈ దీప కుండీల్లో నెయ్యిని నింపుతారు. వత్తులు ఎగదోయడం, మసిని తుడవటం వంటివి చేస్తారు. జయవిజయుల నుంచి గర్భాలయంలోని శ్రీనివాసుడు వృద్ధులకు సైతం స్పష్టంగా కనిపించేలా కాంతి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. క్షణకాల దర్శనంలో స్వామి రూపం మదిలో నిలిచిపోవడంలో ఈ దీప కాంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బ్రహ్మ వెలిగించిన దీపాలు
వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలోకి ప్రవేశించిన శుభ సమయంలో బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలను వెలిగించాడనేది ఐతిహ్యం. ఈ దీపాలను ‘బ్రహ్మ అఖండం’ అని కూడా వ్యవహరిస్తారు. శ్రీనివాస ప్రభూ.. నేను వెలగించిన అఖండ దీపాలు కలియుగాంతం వరకు నిరాటంకంగా ప్రకాశించాలి. అంతవరకు కొంగుబంగారమై భక్తులకు వరాలను గుప్పించాలని బ్రహ్మ కోరారట. ‘కలియుగాంతమయ్యాకే ఆ దీపాలు రెండు శాంతిస్తాయి. అంతవరకు భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాను. తర్వాతే వైకుంఠానికి వెళ్తాను. అప్పుడే ఆనంద నిలయం కూడా అదృశ్యమవుతుందని శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలకు తెలియజేశారట. ఈ క్రమంలోనే వేల ఏళ్ల క్రితం వెలిగించిన దీపాలు నేటికీ దివ్య కాంతులను ప్రసరిస్తున్నాయి అని నమ్మకం.
శాసనాల్లో దీపాల నిర్వహణ
శ్రీవారి ఆలయం గర్భాలయ ప్రాకారంపై క్రీ.శ 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఏర్పాటు చేసిన అనేక శాసనాల్లో ఈ దీపాల ప్రస్తావన ఉంది. వాటికి వినియోగించాల్సిన స్వచ్ఛమైన నెయ్యి గురించి స్పష్టంగా పేర్కొన్నారు. 1019 చోళరాజు రాజేంద్ర-1 కాలానికి చెందిన ఓ శాసనంలోనూ అఖండ దీపాల గురించి ఉంది. దీపాలకు వినియోగించే నెయ్యి, నిర్వహణ కోసం చేసిన దానాల గురించి ఈ శాసనాల్లో ఉంది.