Share News

‘రుషికొండ’పై మాటల మంటలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:16 AM

విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు.

‘రుషికొండ’పై మాటల మంటలు

  • మండలిలో మంత్రులు X బొత్స.. అబద్ధాల పునాదులపైనే ప్యాలెస్‌ నిర్మాణం

  • రిసార్ట్స్‌ మళ్లీ కడతామన్నారు.. సీఎం క్యాంపు అని జీవో తెచ్చారు.. చివరికి ప్యాలెస్‌ కట్టేశారు

  • ప్యాలెస్‌ కట్టిన రూ.480 కోట్లతో 26 వేల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చు

  • బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రులు దుర్గేశ్‌, అచ్చెన్న సవాల్‌.. అదేమన్నా ప్రైవేటు భవనమా?: బొత్స

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండపై కట్టిన విలాసమైన ప్యాలె్‌సకు పెట్టిన ఖర్చుతో 26 వేలమంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రుషికొండలో ఏర్పాటుచేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. రుషికొండ ప్యాలెస్‌ వ్యవహారంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. జగన్‌ చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి, ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారంటూ.. శాసనమండలిలోని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌ తీవ్ర స్వరం వినిపించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అనురాధ....రుషికొండ ప్యాలె్‌సపై ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ సమాధానమిచ్చే క్రమంలో.. వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దీనిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం సాగింది. అనంతరం వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.


అంతకుముందు... మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ.. ‘‘రుషికొండపై 58 గదులతో ఉన్న హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి గత ముఖ్యమంత్రి జగన్‌ కోసం విలాసవంతమైన ప్యాలె్‌సను నిర్మించారు. ఈ ప్యాలెస్‌ నిర్మాణం పూర్తిగా అబద్ధాల పునాదిపైనే జరిగింది. ఉన్న దానికంటే అద్భుతమైన రిసార్ట్‌ కడతామని చెప్పి..దానికి భిన్నంగా భూమి వినియోగ మార్పిడి చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం అంటూ జీవో ఇచ్చారు. చివరకు.. ప్యాలె్‌సను రూ.480 కోట్లు పెట్టి కట్టారు. అందులో ఒక బాత్‌ టబ్‌ ఖరీదే రూ. 12 లక్షలుంది. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేల్‌ వాయించిన రాజు తీరును జగన్‌ చేష్టలు గుర్తుకు తెస్తున్నాయి. ప్యాలెస్‌ నిర్మాణం అవుతుండగానే దీనిపై కోర్టులో కేసులు దాఖలయ్యాయి. పరిశీలనకు కోర్టు.. ఒక కమిటీ వేసింది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నాం’’ అని దుర్గేశ్‌ తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చే క్రమంలో.. సవాళ్లు, మాటల యుద్ధంతో గందరగోళం నెలకొంది. జీవోలు సహా పత్రాలన్నింటినీ సభ లో పెడతామని, మండలే దీనిపై తేల్చాలని మంత్రి దుర్గేశ్‌ అన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ‘‘పర్యావరణాన్ని ధ్వంసం చేసి మరీ రుషికొండ భవనాలను నిర్మించారని విచారణ కమిటీలు తేల్చాయి. వైసీపీ సభ్యులందరినీ అక్కడికి తీసుకెళ్తామని, డబ్చులను ఏవిధంగా నొక్కేశారో చెబుతామని వ్యాఖ్యానించారు.


  • ఎస్‌ఎఫ్‌టీ రూ.28 వేలుచొప్పున ఖర్చు పెట్టారు: అచ్చెన్న

చదరపు అడుగు రూ.28వేలు చొప్పున ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్‌ కట్టారని, ప్రపంచంలో ఎక్కడా ఇంత వ్యయంచేసి ఉండరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ‘‘ప్యాలెస్‌ నిర్మాణం అయినన్ని రోజులూ ఎవరినీ ఆ దరిదాపులకు కూడా పోనీయలేదు. అక్కడ నిర్మాణాలు ఎవరికీ తెలియకుండా చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పటికీ బొత్స నారాయణ కూడా ప్యాలె్‌సను చూడలేదు. వైసీపీ సభ్యులందరినీ బస్సులో అక్కడకు తీసుకెళ్లి చూపిస్తాం. ఆ తర్వాత వారూ ఏమీ మాట్లాడలేరు. రుషికొండ నిర్మాణాలకు పెట్టిన రూ.480 కోట్లతో 26 వేల మంది పేదవారికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చు. టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ, సచివాలయాలను ఎస్‌ఎ్‌పటీ రూ. 6 వేలు పెట్టి కడితే విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు నానా యాగీ చేసేశారు. ఇప్పుడేమో జగన్‌ చేసిన తప్పును చూసి సిగ్గుపడకుండా సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు’’ అని అచ్చెన్న మండిపడ్డారు.

  • అదేమన్నా ప్రైవేటు భవనమా?: బొత్స

రుషికొండపై కట్టింది ప్రైవేటు భవనం కాదని, ప్రభుత్వ భవనాలే నిర్మించారని వైసీపీ శాసనమండలి పక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘అన్ని అనుమతులు తీసుకునే రుణికొండపై భవనాలు నిర్మించాం. ఒకవేళ భవనాల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్టు చంద్రబాబు ప్రభుత్వం భావిస్తే, విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు. రుణికొండ ప్యాలె్‌సను ఎస్‌ఎ్‌ఫటీ 2 వేలకు కట్టామంటున్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ భవనాన్ని చదరపు అడుగు 14వేలకు కట్టింది. రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. దుమ్ముంటే రండి...చూసుకుందాం రండి... అని మంత్రులు మాట్లాడటం సరికాదు’’ అని బొత్స అన్నారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి దుర్గేశ్‌ స్పందిస్తూ... సీఎం కార్యాలయం ఇచ్చిన జీవోను చూపిస్తాం రమ్మని చెప్పాను....కానీ చూసుకుందాం అని అనలేదన్నారు. చూసుకోవడానికి తానేమీ వస్తాదును కాదని మంత్రి గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.


  • అధికారంలో ఉండీ.. ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారు

  • రాజకీయ లబ్ధి కోసమే రుషికొండపై విమర్శలు: వైసీపీ

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రులు చెప్తున్న సమాధానాలు సరిగా లేవని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు అధికారంలో ఉండీ.. ప్రతిపక్ష నేతల్లా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ... ‘రుషికొండ భవనాలన్నీ ప్రభుత్వ సొమ్ముతో కట్టారని మంత్రులే చెప్తున్నారు. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయకుండా, అవన్నీ జగన్‌ కోసమే కట్టినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు. రుషికొండ భవనాల విషయంలో టీడీపీ రాజకీయ విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సూచించారు. కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల కోసం బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరగలేదని రవీంద్రనాథ్‌ విమర్శించారు.

Updated Date - Nov 20 , 2024 | 03:16 AM