Share News

Kishanreddy: టీటీడీ బోర్డు నిర్ణయాలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:54 PM

టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు భక్తుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishanreddy: టీటీడీ బోర్డు నిర్ణయాలపై కిషన్‌రెడ్డి  కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు ప్రకటన జారీ చేశారు. టీటీడీ బోర్డు నిర్ణయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.


టీటీడీ బోర్డు నిర్ణయాలను స్వాగతిస్తున్నాను.. కిషన్‌రెడ్డి

‘‘టీటీడీ బోర్డు నిర్ణయాలను స్వాగతిస్తున్నాను. సంస్కరణలు ఆహ్వానించదగ్గ పరిణామం. అన్యమత ఉద్యోగులను టీటీడీలో పనిచేయనీయకుండా ఇతర విభాగాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయం. ఇతర ఆలయాల్లో కూడా ఇదే మాదిరిగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ బోర్డు నిర్ణయాలివే..

తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని బి.ఆర్. నాయుడు నిర్ణయించారు. అలాగే తిరుమల పరిసర ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడటంపై నిషేదం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్‌లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. స్వామివారికి చెందిన నగదును ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్లు నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేసేలా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.


అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగ్‌ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టిక్కెట్లు రద్దు చేస్తూ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్

YS Sunitha: ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి

Real Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 02:06 PM