Share News

Minister Anitha : మీరా.. నీతులు చెప్పేది!

ABN , Publish Date - Nov 19 , 2024 | 04:32 AM

దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.

Minister Anitha : మీరా.. నీతులు చెప్పేది!

  • దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసిన వారూ మాట్లాడుతున్నారు

  • చట్టబద్ధత లేని ‘దిశ’తో కాలం గడిపారు

  • ఇంటి పక్కన అఘాయిత్యం జరిగినా సీఎంగా ఉన్న జగన్‌ కన్నెత్తి చూడలేదు

  • నిప్పులు చెరిగిన హోం మంత్రి అనిత

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సోమవారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్న.. అనంతరం విపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలను గణాంకాల సహితంగా వివరించారు. ‘‘దిశ చట్టాన్ని కొనసాగిస్తారా? లేదా?’’ అంటూ వైసీపీ సభ్యులడిన ప్రశ్నలపై మంత్రి అనిత స్పందిస్తూ.. దిశ చట్టం అసలు లేదని, నిర్భయ చట్టం మాత్రమే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్భయ చట్టం కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి మండిపడ్డారు. 2019-24 మధ్య జగన్‌ పాలనలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగినా కనీసం ఆయన చర్యలు తీసుకోలేదని హోం మంత్రి నిప్పులు చెరిగారు.

దిశ చట్టానికి చట్టబద్ధత లేకుండానే ‘దిశ’ పేరిట పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలో తెచ్చిన ఫోర్త్‌ లయన్‌ అనే యాప్‌నే దిశ యాప్‌గా మార్చారన్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్ల బోర్డులను మార్చి దిశ పోలీ్‌సస్టేషన్లుగా మార్చారన్నారు. నిర్భయ చట్టం ఉన్నా కూడా గత ప్రభుత్వం అమలు చేయకుండా, లేని దిశ చట్టాన్ని తెచ్చిందని దుయ్యబట్టారు.

అమరావతిపై కోపంతో అక్కడ మంజూరైన ఫోరెన్సిక్‌ లాబొరేటరీని జగన్‌ సర్కార్‌ నిలిపివేసిందని తెలిపారు. గత ఐదేళ్లలో గంజాయి, డ్రగ్స్‌ ఎక్కువగా సరఫరా అవ్వడం వల్లే అఘాయిత్యాలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. గత సీఎం ఒక్కసారి కూడా వీటిపై సమీక్షించలేదన్నారు.


మహిళల జోలికి వచ్చినా, సోషల్‌ మీడియాలో అసభ్యంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్‌ తల్లి, చెల్లికి ఆయన బాబాయి కుమార్తెకు అన్యాయం జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్ఘాటించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. గత 5 నెలల కాలంలో 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపామన్నారు. చిన్నారులు ఆడబిడ్డలపై జరిగిన అత్యాచార ఘటనలను వైసీపీ సభ్యులు రాజకీయం చేయడం తగదన్నారు. గత ప్రభుత్వంలో జగన్‌ ఇంటికి సమీపంలో గ్యాంగ్‌ రేప్‌ జరిగితే స్పందించలేదని, విజయవాడ నడిబొడ్డున దళిత దివ్యాంగురాలిపై 3 రోజులు అత్యాచారం చేసినా స్పందించలేదని.. బాధితురాలి పక్షాన పోరాటానికి వెళ్తున్న చంద్రబాబుపై కేసులు పెట్టలేదా అని ప్రశ్నించారు.

  • పోలీసు వ్యవస్థ దుర్వినియోగం

చెట్లు నరికించడానికి, పరదాలు కట్టడానికి, టీడీపీ నేతల కదలికలపై నిఘా పెట్టడానికి జగన్‌ పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారని అనిత తెలిపారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలోని మహిళా పోలీస్‌ స్టేషన్లనేకదా దిశ స్టేషన్లుగా మార్చింది’’ అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతులు ఇచ్చి, రూ.200 కోట్లు ఇచ్చినా రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ని కూడా ఏర్పాటు చేయలేని గత ప్రభుత్వ దుస్థితిని ఘన చరిత్రగా చెబుతున్నారని వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. వాస్తవాలు చెబుతుంటే సహించలేక పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ సభ్యుల ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారని బొత్స అన్నారు. శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా విమర్శించారని వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. వాద ప్రతివాదాల మధ్యే సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు.

Updated Date - Nov 19 , 2024 | 04:32 AM