అవినీతిమయం ఆన్‌లైన్ పట్టాదార్ల చిట్టా!
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:00 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,800 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 679 మండలాల్లో, కొత్త జిల్లాల ఏర్పాటుతో, 26 జిల్లాలలో ఇవి ఉన్నాయి. ఏదైనా ఒక గ్రామంలో సాగులో ఉన్న వ్యవసాయ భూమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,800 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. 679 మండలాల్లో, కొత్త జిల్లాల ఏర్పాటుతో, 26 జిల్లాలలో ఇవి ఉన్నాయి. ఏదైనా ఒక గ్రామంలో సాగులో ఉన్న వ్యవసాయ భూమి ఎవరిదని అడిగితే ఒక ఆసామి పేరు వినిపిస్తుంది. మరి ఆ వ్యక్తినే మీరు ‘‘ఈ భూమి నీది అని ఎలా చెపుతున్నావు’’ అని అడిగితే నేను పట్టాదారునని ఆయన చెప్పగలడు. గ్రామీణ సమాజంలో ‘భూమి పట్టా’ అనే మాట సుపరిచతం. పట్టా అంటే ఒక అధికారి సంతకం పెట్టి, ముద్ర వేసి ఇచ్చిన ఒక కాగితం లేదా పుస్తకం.
ఒక గ్రామంలో ఉన్న పట్టాదార్ల వివరాలు ఎక్కడ వుంటాయి? ఏ రూపంలో, ఏ పేరుతో వుంటాయి? రైతు లేదా యజమాని వద్ద వున్న పత్రాలు ఏమిటి? ఆంధ్ర ప్రాంతంలో ఒక రెవిన్యూ గ్రామంలోని పట్టాదార్ల సమాచారం నమోదు చేసిన రికార్డు 10(1) ఎకౌంట్/ పద్దు. ఇది పట్టాదారులను ఖాతా నెంబర్ల వారీగా చూపిస్తుంది. ఈ ఖాతా నెంబరునే పట్టా నెంబర్ అంటారు. ఇక అండగల్ (ఆంధ్ర)/ ఫహాని (తెలంగాణ)– ఒక వ్యవసాయిక సంవత్సరంలో భూమిపై జరుగుతున్న వ్యవసాయాన్ని రికార్డు చేసి చూపిస్తుంది.
స్థూలంగా భూమికి సంబంధించిన అన్ని లౌకిక వ్యవహారాలకు ఈ రెండు రికార్డులు అవసరం. వాటికోసం ప్రతిసారీ రైతులు కరణం ఇచ్చే నకలు కోసం ఆయన చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇలా తిప్పలు పడకుండా రైతు చేతిలో శాశ్వత పట్టా రికార్డు ఉంచాలనుకున్నారు. ఇందుకోసం పట్టాదారు పాసు పుస్తకాల చట్టం తెచ్చారు. దీనిని రికార్డు ఆఫ్ రైట్స్ ఏక్ట్ అని, పొట్టి రూపంలో ఆర్‌ఓఆర్ (ROR) అనీ రెవిన్యూ వారు పిలుస్తారు. 1971లో ఈ చట్టం వచ్చినా 1989కి గాని అమలు చేసే నియమాలు రాలేదు. వ్యవసాయక రుణాలు వగైరా అవసరాలకు ఒక పుస్తకం, భూమి హక్కుల లావాదేవీలకు మరో పుస్తకం. మొదటిదాన్ని పాసు పుస్తకం (పీబీ), అని రెండదాన్ని టైటిల్ డీడ్ (టీడీ) అని అన్నారు. మొదటిదాని మీద తాశీల్దార్ సంతకం వుంటే, రెండవ దాని మీద రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా సబ్- కలెక్టర్ సంతకం, రాజముద్ర (సీల్) ఉంటాయి. పట్టాదారు పాస్ పుస్తకం రైతులందరికీ సుపరిచితమయ్యింది. అది వరకు పట్టాదారుల చిట్టాగా ఉన్న 10(1) ఎకౌంట్ స్థానంలో ఆర్‌ఓఆర్ చట్టం 1బి అనే రికార్డును ప్రవేశపట్టింది. ఆర్‌ఓఆర్ ప్రక్రియలో ముందు 1బి తయారవుతుంది. అందులో ఉన్న సమాచారమే రైతు చేతిలోని పీబీ/ టీడీ పుస్తకాలలో ఉంటుంది లేదా ఉండాలి. ఇప్పుడు పట్టాదారుల చిట్టా అంటే 1బీనే.
దాచేపల్లి సుబ్బారావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. సుబ్బారావు వద్ద పీబీ/ టీడీలు ఉన్నాయి. అందులో రెండు ఎకరాలు అమ్మేశాడు. కొన్నవాడికి ఆ ప్రాప్తికి పాసు పుస్తకాలు రావాలి. అమ్మిన వాడి ఖాతాలో అది తగ్గాలి. అంటే ముందు 1బీ రికార్డ్‌లో, తదుపరి రైతు పాస్ పుస్తకంలో మార్పు చేసి కొన్నవాడికి పాస్ పుస్తకం ఇవ్వాలి. ఇందుకు అనుసరించ వలసిన పద్ధతిని ఆర్‌ఓఆర్ నియమాల్లో చెప్పారు. అంటే 1బీ రికార్డు నిరంతరంగా మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ రెవిన్యూ శాఖలో వారికి ఒక ప్రధాన సంపాదన వనరు. భూమి మార్కెట్ విలువను బట్టి, 1బీ మార్పులకు రేటు వుంటుంది. 10(1) నుంచి 1బీకి రికార్డు రూపం మారింది గాని ‘ముడుపుల చెల్లింపు’ మారలేదు సరికదా వ్యవస్థీకృతమై బలపడింది. నెమ్మదిగా 1బీతో సంబంధం లేకుండా పాస్ పుస్తకాలలో మార్పిడి మొదలయ్యింది. ఆనక కొత్త పాస్ పుస్తకాలతో పాటు భూమి సాగడం కూడా మొదలయ్యింది. దొంగ పాస్ పుస్తకాలు అరికట్టాలని, కోనేరు రంగారావు కమిటీ చెప్పిందని, ప్రతి పాస్ పుస్తకంపైన యూనిక్ కోడ్ నెంబర్ వేయాలని అన్నారు. కోనేరు రంగారావు సిఫార్సులన్ని కోనేటిలో కలసిపోయాయి.
ఇది ఇలా సాగుతుండగా, భూమి రికార్డును డిజిటలైజ్ చేస్తే అది సర్వరోగనివారిణిగా పని చేస్తుందన్న కొత్త ఆలోచనలు మొదలైనాయి. కేంద్ర ప్రభుత్వం 1987 అప్‌డేషన్ ఆఫ్ లెండ్ రికార్డ్స్ (SRA&ULR) పేరుతో ఒకటి, 1988 కంప్యూటరైజేషన్ ఆఫ్ లెండ్ రికార్డ్స్ (CLR) పేరుతో మరొకటి రెండు ప్రోగ్రామ్స్ మొదలు పెట్టి, 2008కి వచ్చేసరికి రెండింటిని కలిపి నేషనల్ లెండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్‌గా (NLRMP) పేరు మార్చింది. కాగితం మీద ఉన్న భూమి రికార్డును డిజిటల్ రికార్డుగా మార్చటం దీని లక్ష్యం. రైతుల చేతిలో వున్న భూమి రికార్డు, అప్పటికే 1బీ రికార్డును సరిచూసే పని ముందుగా చేయకుండానే ఆంధ్ర ప్రదేశ్‌లో 1బీ రికార్డును కంప్యూటర్‌లోకి ఎక్కించారు. అలా నమోదు చేసే సమయంలో లక్షన్నర తప్పులు. 2015 జూన్ నుండి ఈ డిజిటల్ లాండ్‌కు రికార్డుకు సాధికారిత కల్పించారు. వాటిని బ్యాంకులకు, రిజిస్ట్రేషన్ వంటి శాఖలకు అనుసంధానం చేశారు. 1బీ రికార్డు నిర్వహణ డిజిటల్ రూపంలోకి మారడంతో ఇప్పుడు రెప్పపాటులో ‘రికార్డ్ టేంపరింగ్’ సులువు అయ్యింది.
రొచ్చుపనుకు గ్రామానికి చెందిన 17 కొండ దొర ఆదివాసీ రైతు కుటుంబాల వద్ద పీబీ, టీడీ ఉన్నాయి. ఈ గ్రామం అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కళ్యాణ లోవకు శివారు గ్రామం. వారికి ఈ నెల మొదటి వారంలో– తమకు చెందిన భూమి మరెవరి పేరునో మారిపోయిందని తెలిసింది. వారు లబోదిబోమంటూ నర్సిపట్టణం రెవెన్యూ డివిజన్‌కు పరిగెత్తారు. అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కొనాం రెవిన్యూ గ్రామం సర్వే నెంబర్ 275, 287లలో ఉన్న మొత్తం విస్తీర్ణమే 17.78 ఎకరాలు కాగా, ఆన్‌లైన్ 1బీ 32.51 ఎకరాలకు పట్టాలు చూపిస్తుంది.
చేతి రాత రికార్డు ఐతే అక్కడ కొట్టివేత/ మార్పు జరిగిందని గుర్తించవచ్చు కాని కంప్యూటర్ స్క్రీన్ మీద పాత ఎంట్రీని డిలీట్ చేస్తే అంతకుముందు ఏమి ఉన్నదీ ఆనవాలు ఉండదు. ముందుగా ప్రింట్ తీసి పెట్టుకుంటే తప్ప. సిస్టమ్ మెమొరీలో ఈ మార్పు ఉంటుంది. కానీ సాధారణ ప్రజలకు ఆ ‘హిస్టరీ’ అందుబాటులో వుండదు.
సీతానగరంకు చెందిన ఆటో డ్రైవర్ కొండబాబుకు 70 సెంట్లు భూమి వుంది. ప్రతి ఏడాది దానిపై వడ్డీ లేని వ్యవసాయక బ్యాంక్ రుణం వస్తున్నది. ‘‘ఇప్పుడు గత ఏడాది అంత రుణం రాదు నీకు’’ అన్నాడు బ్యాంక్ మేనేజర్. ఎందుకంటే బ్యాంక్ కంప్యూటర్ సిస్టమ్‌తో లింకు అయిన 1బీలో ఇప్పుడు కొండబాబు భూమి కేవలం 30 సెంట్లు మాత్రమే. కొండ భూమి ఎవరికీ అమ్మలేదు. ఆయన చేతిలో వున్న పాసు పుస్తకాలను మేనేజరుకు చూపించాడు. ‘‘ఆన్‌లైన్‌లో మార్చుకొని రా’’ అన్నాడు మేనేజర్. ఒక చట్టం ద్వారా రైతు చేతిలో పెట్టిన పీబీ, టీడీలకు ఇప్పుడు దమ్మిడీ విలువ లేదు. ఒక దశలో నోషనల్ ఖాతా నెంబర్లు, సర్వే సబ్ డివిజన్ నెంబర్లతో కొత్త ఖాతాలు ఇవ్వవచ్చని బుర్ర తక్కువ ఆదేశాలు ఇచ్చారు. దాంతో మన రాష్ట్రంలో ఆన్‌లైన్ 1బీ ఎంట్రీలు లక్షలలో పెరిగిపోయి, వ్యవసాయ భూమి ఆంజనేయుని వాలంలా పెరిగిపోవడం, మొత్తం రెవిన్యూ పాలనా వ్యవస్థ కుప్పకూలడం మొదలయ్యింది.
పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగి కూడా కాని కంప్యూటర్ ఆపరేటర్ ఏసీ గదిలో కూర్చుని భూమి రికార్డును మార్చేస్తే బాధితుడు ఏం చెయ్యాలి? ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం ఆర్‌డీఓ వద్ద అప్పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్, ఆ పిదప హైకోర్ట్ ముందు రెండవ రివిజన్. ఇలా ఒక్క మౌస్ క్లిక్‌తో మీ బతుకును అతలాకుతలం చేసేయవచ్చు.
జూలై 2, 2016న విశాఖపట్టణంలో ‘ఆన్‌లైన్ భూమి రికార్డులు- ప్రజల హక్కులు’ పేరుతో పబ్లిక్ హియరింగ్ జరిగింది. అందులో ముగ్గురు విశ్రాంత సీనియర్ ఐయ్యేఎస్ అధికారులు– శ్రీ ఇఎఎస్ శర్మ, చాయ రతన్, టి. గోపాల రావు పాల్గొని రోజంతా కేసులు విన్నారు. ప్రభుత్వానికి తమ సూచనలతో నివేదిక ఇచ్చారు. అందులో ఒకటి ఆన్‌లైన్ రికార్డుతో బాటు, ఆఫ్‌లైన్ చేతిరాత రికార్డ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. సమస్యకు పరిష్కారం ఏమిటి? 2015 నుంచి ఇప్పటివరకు ఆన్‌లైన్ భూమి రికార్డు వచ్చి పదేళ్లు కావస్తున్నది. అది ఎలా పని చేస్తున్నదీ, రైతులు దాని గురించి ఏమనుకుంటున్నదీ తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపిన దాఖలాల్లేవు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులలో 80శాతం భూమికి సంబంధించినవే ఉంటున్నాయని ఈ మధ్య రెవిన్యూ మంత్రి చెప్పారు. మరి అందులో ఈ ఆన్‌లైన్ భూమి రికార్డు వ్యవస్థ శకుని పాత్ర ఎంత ఉన్నదో ప్రభుత్వం తెలుసుకుంటున్నదా?
పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగి కూడా కాని కంప్యూటర్ ఆపరేటర్ ఏసీ గదిలో కూర్చుని భూమి రికార్డును మార్చేస్తే బాధితుడు ఏం చెయ్యాలి? ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం ఆర్‌డీఓ వద్ద అప్పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్, ఆ పిదప హైకోర్ట్ ముందు రెండవ రివిజన్. ఇలా ఒక్క మౌస్ క్లిక్‌తో బతుకును అతలాకుతలం చేసేయవచ్చు.
n పి.ఎస్. అజయ్‌కుమార్