Share News

Arvind Kejriwal: కొత్త ఇంటికి మారనున్న కేజ్రీవాల్

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:03 PM

2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టే ముందు ఘజియాబాద్‌లోని కౌశంబి ప్రాంతంలో నివసించే వారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సెంట్రల్ ఢిల్లీలోని తిలక్ లేన్‌కు మకాం మార్చారు. ఇక 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.

Arvind Kejriwal: కొత్త ఇంటికి మారనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ, అక్టోబర్ 02: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీర్ అరవింద్ కేజ్రీవాల్.. కొత్త ఇంటికి మారనున్నారు. అందుకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 4వ తేదీన కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి కొత్త నివాసంలో అడుగు పెట్టనున్నారు. అందుకోసం ముఖ్యమంత్రి అధికారిక బంగ్లాను అదే రోజు.. కేజ్రీవాల్ ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోనే నివసించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.


ఇక 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టే ముందు ఘజియాబాద్‌లోని కౌశంబి ప్రాంతంలో నివసించే వారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సెంట్రల్ ఢిల్లీలోని తిలక్ లేన్‌కు మకాం మార్చారు. ఇక 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఉత్తర ఢిల్లీలో సివిల్ లేన్ ప్రాంతంలోని హౌస్ నెంబర్ 6కి కేజ్రీవాల్ మారారు. నాటి నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అదే ఇంట్లో నివసిస్తున్నారు.


ఈ ఏడాది మార్చి 21వ తేదీన మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తనను సీఎంగా ఢిల్లీ ప్రజలు గెలిపించి.. తన నిజాయితీని నిరూపిస్తారని ఆయన స్పష్టం చేశారు.


అప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనన్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా శాసన సభ పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం.. అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి అధికారిక బంగ్లాను ఖాళీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


మరోవైపు ఈ అధికారిక బంగ్లాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెళ్తారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే.. ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టినా.. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న కూర్చిలో ఆమె కూర్చోవం లేదు. దాంతో అతిషి ఇల్లు మారతారా? లేదా? అన్న అంశంపై సందేహం వ్యక్తమవుతుంది. అదికాక.. వచ్చే ఏడాది పిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

For National News And Telugu News..

Updated Date - Oct 02 , 2024 | 05:27 PM