Arvind Kejriwal: ఆ పని చేస్తే బీజేపీకి ప్రచారం చేస్తా.. మోదీకి కేజ్రీవాల్ సవాల్
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:05 PM
బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల్లో విఫలమైందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. డబుల్ ఇంజన్ మోడల్‌ను 'డబుల్ లూట్, డబుల్ కరప్షన్'గా అభివర్ణించారు.
న్యూఢిల్లీ: 'జనతా కీ అదాలత్' కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి సవాల్ విసిరారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీకి ప్రచారం చేస్తానని అన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల్లో విఫలమైందన్నారు. డబుల్ ఇంజన్ మోడల్‌ను 'డబుల్ లూట్, డబుల్ కరప్షన్'గా అభివర్ణించారు. హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఉద్వాసన ఖాయమని జోస్యం చెప్పారు.
Rahul Gandhi: 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి: రాహుల్
''ప్రధానికి ఇక్కడ్నించే సవాలు విసురుతున్నాను. 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉచిత విద్యుత్ అందించాలి. అదే జరిగితే బీజేపీకి స్వయంగా నేను ప్రచారం చేస్తాను'' అని కేజ్రీవాల్ అన్నారు. త్వరలోనే హర్యానా, జమ్మూకశ్మీర్‌లోనూ బీజేపీ కుప్పకూలడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సైతం జోస్యం చెప్పాయని తెలిపారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని ఆరోపిస్తూ, బస్ మార్షల్స్‌ను, డాటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడం, ఢిల్లీలోని హోం గార్డుల వేతనాలు నిలిపివేయడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, ఎల్జీ పాలన ఉందని ఆరోపించారు. కాగా, దీనికి ముందు సెప్టెంబర్ 22న జంతర్‌మంతర్ వద్ద 'జనతా కీ ఆదాలత్'ను కేజ్రీవాల్ నిర్వహించారు.