Share News

Etela Rajender:భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:25 PM

ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Etela Rajender:భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

హైదరాబాద్; ఓ ఆర్ఆర్ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. పేద రైతుల స్థలాలను గుంజుకుని రైతులను బిచ్చగాళ్లను చేస్తానంటే ఎవరు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లో ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు విస్తరణ సందర్భంగా భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్‌ ఆర్‌ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా స్థలాలు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా స్థలాలు, ఆర్థిక సహకారాన్ని అందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ చుట్టుపక్కల ఉన్న రైతులంతా పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య , మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ సందర్భంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రైతులను పట్టించుకోకుండా బిచ్చగాళ్లను చేస్తామంటేఎవరూ ఊరుకోరని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూ నిర్వాసితులకు తన వంతు న్యాయం చేస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

Updated Date - Oct 03 , 2024 | 03:25 PM