Kishan Reddy: బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:22 PM
రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణలు విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ అంటే ఏమిటో ఈ సర్కార్‌కు చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వల్ల రాజకీయాలు దిగాజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... రాజకీయాలంటే అసహ్యం కలిగేలా ఈ రెండు పార్టీల తీరు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ సమాజం దిగజారుడు రాజకీయాలను సహించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అలానే ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లకు సహకారం అందించిన వాళ్లు ఎవరంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి మాటలకు తాను స్పందించనన్నారు. లగచర్ల ఘటనపై తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను భారతీయులకు మాత్రమే గులామ్‌ను అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 1 నుంచి 5 వ తేదీ వరకు బీజేపీ అంటే ఏంటో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తామన్నారు. తెలంగాణలో మీ పని తీరుపై ప్రజలతోనే మాట్లాడుతామని చెప్పారు.
మరోవైపు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు గుప్పించింది. ఆ క్రమంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. కానీ వాటిని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తుంది. అందుకు నిరసనగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నిరసన తెలపాలని నిర్ణయించింది. అందులోభాగంగా పాదయాత్రల ద్వారా నిరసన తెలపాలని పార్టీ అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 1 నుంచి అన్ని నియోజకవర్గాల్లో నిరసన పాదయాత్రలు చేపట్టనున్నారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
బీజేపీ ఎంపీ డి.కె .అరుణ
లగచర్లలో రేవంత్ రెడ్డి కుటుంబ ప్రభుత్వం నడుస్తుందని బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ మండిపడ్డారు. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు వెళ్లి బెదిరించి వస్తాడన్నారు. మరోసారి రేవంత్ రెడ్డి నేరుగా బెదిరిస్తాడని చెప్పారు. పరిశ్రమకు భూములు ఇవ్వకుంటే.. జైళ్లలో ఉంటారంటూ రైతును భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు బిక్కుబిక్కు మంటూ ఉంటున్నారన్నారు. అయితే వారిందరికీ బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు.
For Telangana news And Telugu News