Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదు అందుకే అలజడులు సృష్టించే యత్నం
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:28 AM
బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించిన బీఆర్‌ఎస్ నేతలు.. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జహీరాబాద్, నవంబరు 14: బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించిన బీఆర్‌ఎస్ నేతలు.. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తున్న మంత్రి.. మార్గ మధ్యలో జహీరాబాద్‌లో ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వికారాబాద్‌లో అధికారులపై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడులను చూస్తుంటే.. వారు ఎంతకు తెగబడ్డారో అర్థం అవుతుందన్నారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలకులు తెలంగాణలో విధ్వంసం సృష్టించారని, అన్ని రంగాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగురోడ్డును లీజు పేరిట రూ.7వేల కోట్లకు అమ్ముకున్న చరిత్ర బీఆర్‌ఎ్‌సది అని ధ్వజమెత్తారు. దోపిడీలకు పాల్పడినందునే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ హయాంలో 12వేల కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా పేరుతో విద్యావ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.