Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:59 AM
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండాలి: సురేఖ
భక్తులందరికీ అన్నప్రసాదం అందించాలి: పొన్నం
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మరో వందేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై మంత్రి సురేఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయ ప్రాశస్త్యానికి, భక్తుల మనోభావాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అభివృద్థి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఒక ధర్మగుండం, ఇతరులకు ఒక ధర్మగుండం ఏర్పాటు చేసేలా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. భూసేకరణపై నివేదిక అందించాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కొత్తగా అన్నదాన సత్రం నిర్మించాలని, అవసరమైన ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.