Venkata Reddy: నిద్రమత్తు వీడి రోడ్లను బాగు చేయండి
ABN , Publish Date - Nov 07 , 2024 | 02:52 AM
రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తున్నారంటూ ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్లలో ‘మామునూరు’ పూర్తవ్వాలి
టిమ్స్ నిర్మాణంలోనూ అలసత్వమేనా ?
సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి అసహనం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తున్నారంటూ ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిద్రమత్తు వదిలి వెంటనే రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో ఆధునిక యంత్రాలతో రహదారుల మరమ్మతులు చేస్తోంటే.. అభివృద్ధి చెందిన తెలంగాణలో ఇంకా పాత పద్ధతుల్లో పనులు చేయించడమేంటని ప్రశ్నించారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు రూ.5వేల కోట్ల విలువైన రహదారుల మరమ్మతులు పూర్తవుతాయని తెలిసినా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్‌ను ప్రశ్నించారు. ఇంజనీర్లు ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రహదారుల ప్రతిపాదనలు తయారుచేసే కన్సల్టెంట్లుగా మారారని అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో చర్చించిన పీపీపీ మోడల్ రోడ్ల కోసం ప్రశ్నించగా 1787.06 కిలోమీటర్ల మేర 20 రోడ్లను గుర్తించామని అధికారులు చెప్పారు. ఇక, వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిపై 15 రోజులకొకసారి సమీక్ష ఉంటుందని చెప్పారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్థం చేయాలని ఆదేశించారు. కాగా, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో అలసత్వంపై మంత్రి కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2025 జూలై నాటికి ఆస్పత్రులు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. నిమ్స్ విస్తరణ భవన నిర్మాణ పనులు కూడా నత్తనడకన జరగడమేంటని ప్రశ్నించారు. అలాగే, భవన నిర్మాణంలో నాణ్యతపై మాట్లాడుతూ.. తన కుర్చీ కింద ఉన్న టైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలను చూపించి ఇదేమిటి అని అధికారులను నిలదీశారు. కాగా, ఒక్కో అధికారికి రెండు, మూడు అదనపు బాధ్యతలు ఉన్నాయని, పదోన్నతులు ఇస్తే పని భారం తగ్గుతుందని ఈఎన్సీ మదుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రిని అడిగారు. ఇందుకు మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ... హక్కుల కోసం మాట్లాడేటప్పుడు బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు.