TGSRTC: ఆర్టీసీలో ఇక నగదురహిత ప్రయాణం..
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:42 AM
ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్‌లెస్) ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది.
త్వరలో అన్ని బస్సుల్లో ‘ఐటిమ్స్’ .. మహిళల ఉచిత ప్రయాణం కోసం స్మార్ట్ కార్డుల జారీ
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్‌లెస్) ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపో బస్సులతో పాటు బెంగుళూరు, తిరుపతి తదితర దూర ప్రాంత సర్వీసుల్లో నగదురహిత లావాదేవీల కోసం ఐటిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్) వినియోగిస్తోంది. ఈ రూట్లలో మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఐటిమ్స్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో వినియోగించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన రూ.10.97 కోట్లతో టీజీఎ్‌సఆర్టీసీ 13 వేల ఐటిమ్స్ సమకూర్చుకుంది. ప్రయాణికుల వద్ద నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, మొబైల్ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. కండక్టర్లు ఐటిమ్స్ వినియోగించి ‘ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఎఎ్‌ఫసీఎ్‌స)’తో టికెట్ జారీ చేస్తారు. ఐటిమ్స్‌తో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర డబ్బుల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య ప్రయాణికులు, కండక్టర్ల మధ్య గొడవలకు కారణమవుతోంది. మొదటి ట్రిప్పుల్లో ప్రయాణికులు టికెట్‌కు సరిపడ చిల్లర లేక పెద్దనోట్లు ఇస్తుండడంతో కండక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కొంతమంది ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదులు చేయడం, వారు కండక్టర్లను మందలించడం జరుగుతోంది. కండక్టర్లు లేకుండా నడిచే బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు ఇస్తుంటారు. ఐటిమ్స్‌తో వారి పని సులువు అవుతుంది. ఇక మహాలక్ష్మి పఽథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. వాటితో ఐటిమ్స్‌లో జీరో టికెట్ జారీ చేస్తారు. రాయితీ బస్ పాస్‌లు సైతం స్మార్ట్ కార్డులు, మొబైల్ బస్ పాస్‌లుగా మారనున్నాయి.
జూలైలో కానీ ఆగస్టు మొదటివారం నుంచి 9,100 బస్సుల్లో ఐటిమ్స్‌ను వినియోగంలోకి తీసుకురావచ్చని ఆర్టీసీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే ముంబై, బిహార్, అసోం, జబల్‌పూర్ తదితర ప్రాంతాల్లోని బస్సుల్లో ఐటిమ్స్‌తో నగదురహిత విధానం విజయవంతంగా అమలవుతోంది. టీజీఎ్‌సఆర్టీసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో అధ్యయనం చేసి, రూపొందించిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్‌తో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.