ఏఐ సహకారంతో 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:43 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కొండపై విశాఖ శారదా పీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిశ్చయించినట్లు మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్టు పేరు మార్పు
టూరిజం కోటా టికెట్లు కూడా రద్దు
నెయ్యి నాణ్యత పరీక్షకు 90 లక్షలతో కొత్త ల్యాబ్
దేవస్థానంలో అన్యమతస్థులకు వీఆర్‌ఎస్
లేదంటే ఇతర శాఖలకు బదిలీ
కొత్త పాలకమండలి కీలక నిర్ణయాలు
తిరుమల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కొండపై విశాఖ శారదా పీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని నిశ్చయించినట్లు మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. కొత్త మండలి తొలి సమావేశం సోమవారం కొండపై ఉన్న అన్నమయ్య భవనంలో జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని ఈవో శ్యామలరావుతో కలిసి నాయుడు ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై అపోహలు, అనుమానాలు ఉన్న క్రమంలో దాని పేరు మారుస్తామన్నారు. ట్రస్టుకు వచ్చే సొమ్ము టీటీడీ ప్రధాన ఖాతాలోనే జమయ్యేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి జరిగే బోర్డు సమావేశంలో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా చూడాలి. ఇందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వారికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని.. లేదా ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీలో గానీ, రెవెన్యూ విభాగాలకు గానీ బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకమీదట కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం. ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతాం. కొండపై భవన నిర్మాణంలో శారదాపీఠం నూటికి నూరుపాళ్లు నిబంధనలు అతిక్రమించింది. నిపుణల కమిటీ కూడా నిర్ధారించింది. ఈ క్రమంలో లీజును పూర్తిగా రద్దు చేసి స్థలాన్ని స్వాధీనపరచుకోవాలని బోర్డు తీర్మానించింది. ప్రతిరోజు టూరిజం కోటా కింద కేటాయిస్తున్న 4 వేల టికెట్ల కోటాను రద్దు చేయాలని నిర్ణయించాం’ అని వెల్లడించారు. రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసే శ్రీవాణి టికెట్ల కోటాను వంద నుంచి 200కు పెంచుతూ తీర్మానించామన్నారు.
మరికొన్ని నిర్ణయాలు..
ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని ప్రభుత్వ బ్యాంకుల్లోనే జమచేయాలి.
అన్నప్రసాదం మెనూలో ఇంకో పదార్థం.
శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి నాణ్యత ఇంకా పెంచాలి. దీనికోసం నిపుణుల కమిటీ. నెయ్యి నాణ్యతను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు తిరుమలలో రూ.90 లక్షలతో నూతన ల్యాబ్ ఏర్పాటు.