ఓటేసిన వారిని కాటేసిన జగన్: చంద్రబాబు

నమ్మి ఓటేసిన వారిని సీఎం జగన్ కాటేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కురుపంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ..

ఐదేళ్ల వైసీపీ పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని  ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని ఉద్ఘాంటించారు.

కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలోని రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు.  పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తామన్నారు. రైతాంగానికి తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, అన్ని వర్గాల ఆకాంక్షల్ని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. 

జగన్‌ ఈ రాష్ట్రానికి పట్టిన ప్రమాదకరమైన వైరస్‌ అని.. సంక్షేమాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఓటు అనే వ్యాక్సిన్‌తో ఆ వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

జగన్‌ అరాచక పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి ప్రజలే బుద్ధి చెబుతారని బాబు స్పష్టం చేశారు.