ఇక కేంద్రంపై యుద్ధమే.. అసెంబ్లీలో రేవంత్ ప్రకటన

బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్రాభివృద్ధికి కావల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ మోదీ ప్రభుత్వం ఆ హామీల అమలులో  నిర్లక్ష్యం వహించిందన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని, 18సార్లు కేంద్రమంత్రులను కలిసి నిధులు అడిగామని.. అయినా కేంద్రం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని మండిపడ్డారు.

తెలంగాణ నుంచి రూ.3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ఇచ్చేది మాత్రం కేవలం 1లక్షా 68వేల కోట్లేనని వివరించారు.

నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా.. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.

ఇదే సమయంలో సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రబడ్జెట్‌పై చర్చలో భాగంగా.. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

సభలో ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని, గాలివాటం మాటలు మాట్లాడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిమిషం వరకు ప్రయత్నం చేశామని ఉద్ఘాటించారు.