Chandrababu Target : జగన్‌ చీకటి చట్టం!

ABN , First Publish Date - 2023-01-04T04:29:03+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణం! విపక్షనేత చంద్రబాబు సభలకు ప్రతిచోటా అంచనాలకు మించి జనం తరలి వస్తున్న సందర్భం! ఒకవైపు ఈ నెల 27 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్‌! మరోవైపు.. ‘వారాహి’తో రాష్ట్ర పర్యటనలకు రంగం సిద్ధం చేసుకున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఇలాంటి సమయంలో.. జగన్‌ సర్కారు ఓ చీకటి చట్టం తీసుకొచ్చింది.

 Chandrababu Target : జగన్‌ చీకటి చట్టం!

చంద్రబాబే టార్గెట్‌.. విపక్షాల కట్టడే లక్ష్యంగా జీవో నం.1 జారీ

జగన్‌ నూతన సంవత్సర కానుక

30 పోలీసు యాక్ట్‌కు పదును

సభలు ఎందుకో, ఎంతసేపో చెప్పాలి

రూట్‌ మ్యాప్‌, హాజరు సంఖ్యా చెప్పాలి

అరుదైన సందర్భాల్లోనే అనుమతులు

ఉత్తర్వుల్లో హోం శాఖ స్పష్టీకరణ

నాడు పాదయాత్రకు జగన్‌ పర్మిషన్‌ తీసుకున్నారా?.. రిటైర్డ్‌ అధికారుల ప్రశ్న

నాడు... స్వాతంత్య్ర సమరయోధులను, ఉద్యమాలను అణచి వేయడానికి ‘బ్రిటిష్‌ రాజ్‌!’

నేడు... ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యబద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవడానికి ‘జగన్‌ రాజ్‌’!

విచిత్రమేమిటంటే... నాటి బ్రిటి్‌షపాలకులకంటే నేటి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే మరింత అరాచకంగా, అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ‘1861 పోలీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 30 ప్రకారం నేతల ప్రదర్శనలు, కార్యక్రమాలపై నిషేధం’ విధించడం ఇలాంటిదే!

రాష్ట్రంలో రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణం! విపక్షనేత చంద్రబాబు సభలకు ప్రతిచోటా అంచనాలకు మించి జనం తరలి వస్తున్న సందర్భం! ఒకవైపు ఈ నెల 27 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్‌! మరోవైపు.. ‘వారాహి’తో రాష్ట్ర పర్యటనలకు రంగం సిద్ధం చేసుకున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఇలాంటి సమయంలో.. జగన్‌ సర్కారు ఓ చీకటి చట్టం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి అడుగు బయటపెడితే ఎక్కడికక్కడ జనాన్ని బారికేడ్లతో అడ్డుకుంటున్న పోలీసులకు.. ఇకపై విపక్ష నేతలూ జనంలో తిరక్కుండా అడ్డుకునే అస్త్రాన్ని అందించింది. అదే.. జీవో నంబర్‌ 1. దీని ప్రకారం హైవేల నుంచి పంచాయతీ రహదారుల వరకు ఎక్కడా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదు! ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు వీటికి అనుమతిస్తారు. ఆ ‘ప్రత్యేక పరిస్థితులు’ అధికార పార్టీకే అనుకూలమని వేరే చెప్పక్కర్లేదు. అలా చీకటి జీవో రాగానే ఇలా చంద్రబాబు కుప్పం పర్యటనకు బ్రేకులు వేయడం.. రాజమహేంద్రిలో సీఎం జగన్‌, విజయనగరంలో వైసీపీ ‘షో’ నిరాటంకంగా జరగడమే దీనికి నిదర్శనం!

జరిగిన రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ర్యాలీలు, సభల్లో తొక్కిసలాటలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నందున పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరూ ర్యాలీలు చేపట్టరాదని పేర్కొంది. సభలు, ర్యాలీలు నిర్వహించే పార్టీలు రోడ్డుకు దూరంగా ప్రైవేటు స్థలాలు ఎంపిక చేసుకోవాలని సూచించింది. తాజా జీవో ప్రకారం.. ర్యాలీలు, సభలకు నిర్వాహకులు ముందుగానే లిఖితపూర్వకంగా పోలీసుల అనుమతి కోరాలి. సభ ఎందుకు నిర్వహిస్తున్నారు.. దాని వెనకున్న ఉద్దేశం ఏంటి.. ఏ సమయం నుంచి ఎంత వరకూ నిర్వహిస్తారు.. కచ్చితమైన రూట్‌ మ్యాప్‌, హాజరయ్యే వారి సంఖ్య, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తెలిపింది. ఇబ్బంది లేదని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లకు అనిపిస్తే అనుమతి వస్తుందని.. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అనుమతి లభిస్తుందని పేర్కొంది. అయితే ఆ అరుదైన సందర్భాలంటే ఏమిటో జీవోలో వివరించలేదు. కాగా.. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రకు పోలీసుల అనుమతి తీసుకోలేదని.. ఇప్పుడు అధికారం రాగానే జగన్‌ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ రిటైర్డ్‌ అధికారులు అంటున్నారు. అనుమతిస్తాం.. లిఖితపూర్వకంగా వైసీపీ తరఫున దరఖాస్తు చేయాలని అప్పటి పోలీసు అధికారులు కోరినా.. అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని జగన్‌ తెగేసి చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఇంకోవైపు.. తమది పారదర్శక పాలన అంటూ సీఎం పదే పదే చెబుతున్న మాటలకు భిన్నంగా జీవో మంగళవారం సాయంత్రానికి కూడా ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-01-04T04:35:24+05:30 IST