TwitterX: ట్విటర్ పిట్ట గొంతు పిసికేసిన మస్క్.. 2012 నుంచి ఉన్న ట్విటర్ లోగో ఔట్..!

ABN , First Publish Date - 2023-07-24T16:10:12+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్‌ హోల్డింగ్స్‌ కార్పొరేషన్‌ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్‌ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్‌’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్‌ యాప్‌’గా వ్యవహరిస్తున్నారు. ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.

TwitterX: ట్విటర్ పిట్ట గొంతు పిసికేసిన మస్క్.. 2012 నుంచి ఉన్న ట్విటర్ లోగో ఔట్..!

ట్విటర్‌ను (Twitter) కొన్నప్పటి నుంచీ దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఈలన్‌ మస్క్‌ (Elon Musk).. తాజాగా దాని లోగో అయిన పిట్టను తీసేసి ‘ఎక్స్‌’ (TwitterX) అనే అక్షరాన్ని లోగోగా పెట్టేశారు. త్వరలోనే ట్విటర్‌ బ్రాండ్‌‌కు, అన్ని పక్షులకూ వీడ్కోలు పలుకుతామని.. మంచి ‘ఎక్స్‌’ లోగోను రూపొందించగలిగితే దాన్ని ఆదివారం రాత్రికి పోస్ట్‌ చేసి సోమవారం నుంచి ప్రపంచమంతటా లైవ్‌లోకి తెస్తామని వెల్లడించారు. మస్క్ చెప్పినట్టే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్‌ హోల్డింగ్స్‌ కార్పొరేషన్‌ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్‌ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్‌’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్‌ యాప్‌’గా వ్యవహరిస్తున్నారు.

Elon-musk.jpg

ఇక ట్విటర్‌ లోగో మార్పునకు సంబంధించిన ట్వీట్‌ చేసిన గంట తర్వాత.. ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌ రంగును నీలం నుంచి బ్లాక్‌కు (నలుపు)మార్చే ఆలోచనలో ఉన్నట్టు మస్క్‌ మరో ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించి ఆయన నిర్వహించిన పోల్‌కు గంట వ్యవధిలో 2.24 లక్షల మంది స్పందించారు. వారిలో 76.3శాతం మంది రంగు మార్పుపై సానుకూలంగా స్పందించారు. దీంతో.. ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.


ఇక ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా అభివృద్ధి చేసిన త్రెడ్స్‌ (దీని లోగో దారం) జోరు తగ్గింది. ఆ యాప్‌ను తెచ్చిన కొద్దిరోజుల్లోనే కోటిమందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో ట్విటర్‌కు అది గట్టి పోటీ ఇస్తుందనుకున్నారు. ‘ట్విటర్‌ కిల్లర్‌’ అని దానికి పేరు కూడా పెట్టేశారు. కానీ.. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో దాన్ని అనుసంధానం చేయడంతో.. త్రెడ్స్‌ను డిలీట్‌ చేస్తే ఇన్‌స్టా ఖాతా కూడా డిలీట్‌ అయిపోతోంది. ట్విటర్‌ వినియోగదారులు అనామకంగా తమ ఖాతాను వాడుకునే వీలుంది. ఈ నేపథ్యంలో.. త్రెడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2022 నవంబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ట్విటర్ యూజర్లు ఈ యాప్‌ను అప్‌డేట్ చేసిన మరుక్షణం లోగో, ట్విటర్ ప్లాట్‌ఫామ్ కలర్ మారడం గమనార్హం.

Updated Date - 2023-07-24T16:11:26+05:30 IST