Maha Shivratri 2023: కనీసం ఈ ఒక్క శివరాత్రి రోజైనా ఈ పొరపాట్లు చేయకండి..!

ABN , First Publish Date - 2023-02-18T11:11:01+05:30 IST

రకరకాల తీర్థాలు జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేశామని అనుకోకూడదు..

Maha Shivratri 2023: కనీసం ఈ ఒక్క శివరాత్రి రోజైనా ఈ పొరపాట్లు చేయకండి..!
MahaShivratri 2023

ఈ పర్వదినాన, మహాశివరాత్రిరోజున శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని, ఈరోజున శివపార్వతుల కళ్యాణమని అంటారు. దీనిని వివరిస్తూ చక్కని కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

ఒకసారి బ్రహ్మ, శ్రీమహావిష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే సంవాదం జరిగింది. ‘నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’ అని బ్రహ్మ... కాదు ‘నీవు నా నాభిలో పుట్టావు కనుక నేనే గొప్ప’ శ్రీమహావిష్ణువు వాదించుకున్నారట. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో వారికి బుద్ధి చెప్పాలని పరమేశ్వరుడు భావించాడు. పైన ఆకాశం, కింద పాతాళానికి వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మ, విష్ణువు భయపడిపోగా అప్పుడు ‘మీలో ఎవరు నా ఆది, అంతం తెలుసుకొని వస్తారో వారే గొప్ప’ అని శివుడి అదృశ్యవాణి వినిపించింది.

బ్రహ్మ హంస రూపం దాల్చి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళితే, శ్రీమహావిష్ణువు వరాహరూపంలో మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ కబయలుదేరాడు. వారిద్దరు ఎన్నో సంవత్సరాలు వెళ్లినా వారికి ఆ జ్యోతిర్లింగం ఆది అంతాలు కనబడలేదు. దీంతో అలసిపోయిన వారు తమ అజ్ఞానాన్ని మన్నించి శివుడిని వేడుకున్నారు. అప్పుడు శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘నేను గొప్ప.. నేనేగొప్ప అని వాదులాడుకుంటున్నారు.. మీకందరికీ నేనే మూలం.. మీలోని శక్తి కారణం నేనే. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణం, ఉపవాసం మొదలైన వాటితో నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తి పొందుతార’ని అనుగ్రహించి అదృశ్యమైనట్టు శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో పేర్కొనబడింది.

ఈ పొరపాట్లు చేయవద్దు..

ఈ శివరాత్రి రోజున జరిపే పూజాదికార్యక్రమాల్లో కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఈరోజున ఆవు పాలతో కానీ, స్వచ్ఛమైన నీటితో కానీ అభిషేకం చేయవచ్చు. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ, వెంట్రుకలు కానీ శివుడిపై పడకూడదు. మహాశివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు, కానీ నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శివరాత్రి పర్వదినాన మద్యం సేవించడం, ధూమపానం చేయడం కానీ చేయకూడదు, అది చేసిన పూజకు ఫలితాన్ని ఇవ్వదు. శివరాత్రి నాడు భార్యాభర్తల కలయిక కూడా పూజ ఫలితాన్ని అందించదు. నిష్టగా మనసు లగ్నం చేసి శివుని ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అయితే జాగరణం వల్ల మనకు అందే ఫలం ఎలా ఉంటుంది.

​తనను తాను గ్రహించడమే జాగరణం

‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ.. మనస్సు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు.. అది అనుభవంతోనే తెలుస్తుంది. శివరాత్రి రోజు నిద్ర పోకుండా అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అందరి స్వరూపమైన ఆత్మ పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర.

మాయనిద్ర తొలగిపోయే ఘడియ..

తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణం. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. ‘అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అంటే అనాది మాయానిద్ర తొలగి, అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ.

​జీవాత్మను పరమాత్మకు..

భక్తులు ఈ రోజు శివరాత్రి కాబట్టి జాగరణ చేయాలని సినిమాలు చూడటం, ఇతర పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు రోజు ఆహారం తీసుకోరాదని, రకరకాల తీర్థాలు జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేశామని అనుకోకూడదు. ఉప అంటే దగ్గర.. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం.

నాలుగు యామాల పూజ..

యామ పూజ, యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలు అంతర్గతాలు. ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. శివరాత్రి పర్వదినాన ఆయన భక్తి పారవశ్యంలో మునిగి తేలే భక్తులకు ఇదో పర్వదినం. శివనామం సర్వ మానవాళికీ శివైక్యం చెందెందుకు పరమ మార్గం.

Updated Date - 2023-02-18T11:35:54+05:30 IST