NRI: కేవలం పాతికేళ్లల్లోనే అమెరికాలో భారీ మార్పులు .. అసలు అక్కడ ఏం జరుగుతోంది..
ABN , First Publish Date - 2023-04-25T18:44:25+05:30 IST
అమెరికా సమాజంలో కొత్త మార్పులు..
అమెరికాలో మతానికున్న ప్రాధాన్యతపై జరిగిన తాజా సర్వేలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. గత నెలలో చికాగో యూనివర్సిటీలో సుమారు 1000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న 39 శాతం మంది మాత్రమే మతానికి తాము ప్రాముఖ్యతను ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. 1998లో మతానికి పెద్ద పీట వేసే వారి సంఖ్య ఏకంగా 62 శాతం. దీన్ని బట్టి ప్రజల్లో మౌలికమైన మార్పులు వస్తున్నట్టు భావించాలని పరిశీలకులు చెబుతున్నారు. ఇక 1992 నుంచి 2012 మధ్య కాలంలో తమకు మతం లేదని చెప్పేవారి సంఖ్య 3 శాతం కాగా 2021 నాటికి ఏకంగా ఏడు శాతానికి పెరిగింది. తాము ఎన్నడూ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదని తాజాగా 31 శాతం మంది చెప్పారు. 1998 వీరి వాటా కేవలం 17 శాతమే. అంతేకాదు.. ఏటా అమెరికాలో సగటున ఆరు నుంచి 10 వేల చర్చీలు మూతపడుతున్నాయి. వాటి స్థానంలో అపార్ట్మెంట్లు, పార్కులు వంటివి పుట్టుకొస్తున్నాయి.
అసలు మనిషి జీవితంలో మతం ప్రాధాన్యం ఎందుకు తగ్గింది? అంటే సామాజిక శాస్త్రవేత్తలు పలు కారణాలు చెబుతున్నారు. సెక్యులర్ భావాలను అలవర్చుకుంటున్న యువత క్రమంగా మతానికి దూరమవుతున్నారనేది ప్రధాన కారణమని కొందరి అభిప్రాయం. స్త్రీ, పురుషల సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ పెరిగే కొద్దీ మతం ప్రవచించే విలువలతో ఘర్షణ ఏర్పడుతోందట. మతానికున్న ప్రాధాన్యం తగ్గడానికి ఇదీ ఓ కారణమని నిపుణులు తేల్చారు. ఇక మతపరమైన సంస్థల్లో వెలుగు చూస్తున్న కుంభకోణాలు, ఆయా సంస్థలను నడిపిస్తున్న వ్యక్తుల్లో అనైతికతతో ప్రజలకు మతంఅనే వ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లుతోంది. ఇది చాలదన్నట్టు సంప్రదాయిక సమాజాల స్థానంలో ఆన్లైన్ కమ్యూనిటీలు, సెక్కులర్ బృందాలు పెరిగి మతంతో సమానంగా మనిషి మానసిక అవసరాలను తీరుస్తున్నాయట.