నాకు పూర్తి సంతృప్తి వ్యాపారమే

ABN , First Publish Date - 2023-06-25T23:11:51+05:30 IST

ఆయన వ్యాపారవేత్త. పెళ్లయ్యాక.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. హీరోగా నటించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యున్నత స్థాయిని అందుకున్నారు....

నాకు పూర్తి సంతృప్తి వ్యాపారమే

ఆయన వ్యాపారవేత్త. పెళ్లయ్యాక.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. హీరోగా నటించారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యున్నత స్థాయిని అందుకున్నారు. రాజకీయాల్లోకీ వెళ్లారు. ఆ సీనియర్‌ నటుడు.. మురళీ మోహన్‌. ఆయన తన ప్రస్థానంతో పాటు అనేక విషయాలను ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ లో పంచుకున్నారిలా...

ఆర్కే: ఎనభై మూడేళ్లు దాటాయి. మిమ్మల్ని చూస్తే చాలామందికి అసూయ. ఒకటి ఫిట్‌నెస్‌, రెండు జుట్టు. గ్లామర్‌ తగ్గలేదు. రహస్యం ఏంటీ.

మురళీ మోహన్‌: మా ఫ్యామిలీ జీన్స్‌ అంతే. అమ్మానాన్నలకు బీపీలు, షుగర్లేమీ లేవు. నాకూ అంతే. మా పేరెంట్స్‌ నేర్పిందల్లా ఒక్కటే.. పాజిటివ్‌ థింకింగ్‌. ఏదో సంపాదించాలి.. అందరికంటే ముందుండాలని అస్సలు అనుకోను. సరిగ్గా చెప్పాలంటే.. నేనో సగటు మనిషిని. నా టాలెంట్‌ను, నా పర్సనాలిటీ చూసుకున్నా.. అసాధారణ నటుడుని కాదు. అందగాన్ని కాదు. గాయకున్ని అంతకంటే కాదు. అలాగే పొలిటికల్‌గా పెద్ద నాలెడ్జి ఉన్నోన్ని కాను. పెద్ద స్పీకర్‌నూ కాదు.

ఆర్కే: వ్యాపారవేత్తగా మాత్రం సక్సెస్‌..

మురళీ మోహన్‌: ఇవాళ ఈ స్టేజీకి వచ్చానంటే.. కృషి, దీక్ష, పట్టుదల. ఎవరైనా సరే పనిని ప్రేమించి.. కష్టపడి చేయాలి. ఇవాళ మొదలెట్టాను. రేప్పొద్దునే రావాలంటే సక్సెస్‌ రాదు. అందుకని ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆపను. నష్టమొచ్చినా ఆపను. ఎక్స్‌పీరియన్స్‌ వస్తుంది.

ఆర్కే: ఎక్కడా చెప్పని విషయాలన్నీ చెప్పేసేయండి

మురళీ మోహన్‌:(నవ్వులు). నా జీవితం తెరచిన పుస్తకం.

ఆర్కే: అని మీరంటారు. మీరేమో కొన్ని పేజీలు మడతేశారని మేం చెబుతాం.

మురళీ మోహన్‌: అస్సలు మడతేయలేదు.

ఆర్కే:ఎవరితో పంచుకోకుండా దాచిపెట్టినవి ఏమైనా..

మురళీ మోహన్‌: నాకు తెలిసీ ఏవీ లేవు. లవ్‌ వ్యవహారాలు లేవు. అండర్‌ వ్యవహారం డీలింగ్స్‌ లెవ్వు. నీతి, నిజాయితీగా పని చేయటమే. ఈ రోజు వరకూ ఎక్కడా తప్పు చేయలేదు. గుండె మీద చేయేసి చెప్పగలను. ఎవరైనా ఇది తప్పు అని చెబితే ‘సారీ’ అని క్షమాపణ చెబుతా. తప్పు కాకపోతే క్లారిఫై చేస్తా. నాకు తెలీకుండా ఏమైనా తప్పు జరగవచ్చు.

ఆర్కే: ఏమీ లేదని చెబుతారు కానీ. దీపను అజ్ఞాతంగా ప్రేమించారట. మాయలో.. మోహంలో పడ్డారంట నిజమేనా..

మురళీ మోహన్‌: మీరన్న దాంట్లో చాలా అర్థం ఉందండి. దీపకు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన ఫేస్‌. చాలా సినిమాల్లో కలసి చేశాం. కానీ ఎప్పుడూ ఆ ఫీలింగ్‌ లేదు. ఎందుకని లేదంటే.. ఫిల్మ్‌ ఇండస్ర్టీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. లక్కీగా హీరోగా అవకాశం వచ్చింది. ఇంకో సినిమాకు ప్రయత్నించండి అన్నారు. బావుంటే కంటిన్యూ చేయండి. లేకపోతే మీ బిజినెస్‌ మీకు ఉంది కదా! అన్నారు. మా ఆవిడ కూడా అదే మాట అంది. నాకప్పుడు ఇద్దరు పిల్లలు. ఇండస్ర్టీకి వచ్చేప్పుడు.. లవ్‌ ఎఫైర్స్‌ ఉండకూడదు. వ్యభిచారం చేయకూడదు. గ్యాంబ్లింగ్‌, డ్రింకింగ్‌ చేయకూడదు అని ముందే నియమం పెట్టుకున్నా. ఎందుకంటే సినిమా ఇండస్ర్టీలో ఇవన్నీ ఈజీ. అట్రాక్ట్‌ చేస్తాయి. తెలీకుండా పడిపోతాం.

ఆర్కే: ఈ నియమాలు మీకు మీరే పెట్టుకున్నారా..

మురళీ మోహన్‌: ఎవరూ చెప్పలేదు. నాకు నేనే ఇలా నిబంధనలు పెట్టుకున్నా. ఇప్పటి దాకా పాటించా. చిన్నప్పటినుంచి నాగేశ్వర్రావు గారంటే విపరీతమైన అభిమానం. ప్రాణం. ఆయనతో పాటు సావిత్రిగారు ఉన్నారంటే మార్నింగ్‌ షోకే వెళ్లేవాన్ని. ఆయనతో మాట్లాడతానని నాకు తెలీదు. ఆయనతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అమెరికాలోని ఓ స్టేజి మీద.. ‘ఇండస్ర్టీలో శ్రీరామచంద్రుడు మా మురళీమోహన్‌’ అన్నారు.

ఆర్కే:ఇరికించారు. పోటీకి రాకుండా..

మురళీ మోహన్‌: (నవ్వులు) ఇది బావుందే. సర్టిఫికేట్‌ ఇచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

ఆర్కే: జయచిత్ర కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది..

మురళీ మోహన్‌- ఆమె తమిళంలో పెద్ద హీరోయిన్‌. మా తొలి చిత్రం ‘యవ్వనం కాటేసింది’. సినిమాలుండటంతో.. ఏ సెట్‌లో చూసినా కనిపించేవాళ్లం. అందుకే ఓ తమిళ పత్రిక ‘మా ఇద్దరికీ పెళ్లి’ అని ప్రచురించింది. నాకు తమిళం పెద్దగా రాదు. స్టూడియోలో ఉన్నా. ఓ హీరోయిన్‌ నా దగ్గరకు వచ్చి ‘జయచిత్రను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా?’ అని అడిగింది. ఏంటీ? అని అడిగితే. విషయం చెప్పింది. నాకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పాను. ఆ రోజు ఇంటికి వెళ్లాక.. మా ఆవిడను నేనే అడిగా. ‘జయచిత్రకు, మీకూ పెళ్లని పత్రికలో చూశాన’ంది. ఎందుకు అడగలేదు? అన్నాను. ‘నీ గురించి తెలుసు’ అన్నది. మా పాపనూ స్కూల్‌లో అడిగారంట. దీంతో కోపంగా ఆ పత్రిక మీద పరువునష్టం వేద్దామని వెళ్లాను. చివరికి నోటీసు ఇచ్చా. పత్రిక యజమాని వచ్చి సారీ చెప్పారు.

ఆర్కే: దాచుకోకుండా చెప్పండి....

మురళీ మోహన్‌: దాసరిగారి దర్శకత్వంలో శ్రీదేవి తొలిసారి హీరోయిన్‌గా ‘బంగారక్క’ చిత్రం చేస్తున్న సమయం. అందులో నేను హీరో. అప్పుడు నేను రైజ్‌లో ఉన్నా. బాబు బావున్నాడు. బుద్ధిమంతుడు. ఇలాంటి అబ్బాయికి నా కూతురు ఇస్తే బావుంటుందని వేరే వాళ్లతో అన్నదట. వాళ్లు వెంటనే ‘ఆయనకు పెళ్లయింద’ని చెప్పారట. అయినా ఆమె నమ్మలేదు. మా ఇంటికి వచ్చింది చూసిపోవడానికి. కొన్నాళ్ల తర్వాత ఆమే చెప్పారు.

ఆర్కే: సినిమా, వ్యాపారం ఏది కిక్‌..

మురళీ మోహన్‌- చదువు ఒంట పట్టలేదు. ఇంటర్మీడియేట్‌ చదివా. హీరో కృష్ణగారు, క్రాంతికుమార్‌గారు, రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్‌గారు.. మేమంతా ఇంటర్‌ క్లాస్‌మేట్స్‌. హీరో కృష్ణగారికి ‘దేవుడు’ అని నిక్‌నేమ్‌ పెట్టాం. ఎంతో అందంగా ఉండేవారు. మంచివారు. సినిమాల్లోకి వచ్చాక నిజంగా దేవుడు అయ్యారు. నా బిజినెస్‌ విషయానికొస్తే.. ఏదైనా స్టార్ట్‌ చేయాలంటే డబ్బులు లేవు. నాన్నగారు అదిలాబాద్‌ జిల్లాలో ఫారెస్ట్‌ కాంట్రాక్టర్‌. సెలవుల్లో ఆయన దగ్గరకు వెళ్లి పని చేసేవాన్ని. ఆయన ఫ్రీడమ్‌ ఫైటర్‌. కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రాణం మేం పెద్దవాళ్లం అయ్యేసరికి బిజినెస్‌ చేద్దామంటే.. డబ్బుల్లేవు. నేను పెద్దగా చదువులేదు. ఆ సమయంలో మా చిన్నాన్నకి కిసాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఏలూరులో ఉండేది. అది పెద్ద షాపు. ట్రాక్టరు, ఆయిల్‌ ఇంజన్లు, మోటార్లు అమ్మే షాపు. బెజవాడలో ఇంకో షాప్‌ పెట్టాలని నన్ను పిలిచారు. నెలకు వంద రూపాయల జీతం ఇస్తా.. లాభంలో పది హేను పైసల వాటా ఇస్తానన్నారు. బాగా కష్టపడ్డాను. పెళ్లయ్యాక.. ఒకరోజు మా చిన్నాన్న తన వాటా అమ్ముతానంటే.. మావిడ కట్నంగా వచ్చిన ఐదు ఎకరాల పొలం నాకిచ్చి అమ్మమన్నది. అలా ఆ కంపెనీలో యాభై శాతం వాటాదారున్ని అయ్యా. అమరావతి చుట్టు ఉండే ఊర్లకు మోటర్లు సప్లయ్‌ చేసేవాన్ని. ఇప్పటికీ ఆ మోటర్లు పని చేస్తున్నాయి. నిజంగా సినిమా గాడ్స్‌ గిఫ్ట్‌. యాక్టర్‌ అంటే కాఫీ ఇస్తారు. భోజనం పెడతారు. నిజానికి వ్యాపారవేత్త అయితే అంత గుర్తింపు ఉండదు. అలా ఒక సినిమా నటుడిగా ఆ గుర్తింపు ఎంజాయ్‌ చేశా. ఏదేమైనా నాకు పూర్తి సంతృప్తి వ్యాపారమే.

ఆర్కే: అసలు రియల్‌ ఎస్టేట్‌లోకి ఎందుకొచ్చారు..

మురళీ మోహన్‌: ఓసారి ఎర్నింగ్స్‌ ఏమి చేస్తారు? అని అడిగారు శోభన్‌బాబుగారు. నచ్చిన సినిమాలను జిల్లాల వారీగా కొనుక్కుంటున్నా. జయభేరి బ్యానర్‌ మీద సినిమాలు తీస్తున్నా. రెండు డిస్ర్టిబ్యూట్‌ కంపెనీల్లో షేర్‌హోల్డర్‌నయ్యాను అని చెప్పా. ఈ చివరి విషయంలో తప్పు చేస్తున్నారన్నారు. ఆ తర్వాత ఒక కంపెనీ ఆర్నెళ్లలో, మరో కంపెనీ ఏడాదిలో క్లోజ్‌ అయింది. అప్పులు నామీద వచ్చి పడ్డాయి. ఆ రోజుల్లో ఐదు లక్షలు ఇచ్చి సెటిల్‌ చేసుకున్నా. ఆ తర్వాత శోభన్‌ బాబుగారి దగ్గరకు వెళ్లా. మీ డబ్బు ఎక్కడ పెడతారు? అని అడిగాను. ‘ఈ ప్రపంచంలో భూమి నాలుగోవంతు ఉంది. జనాలు మంచుకొండల్లో, ఎడారుల్లో ఉండలేరు. జనాభా పెరుగుతోంది. స్థలం పెరగదు కదా! నా ప్రతిరూపాయి భూమి మీద పెడతాను’ అన్నారు. ఆయన చెప్పిన విధానం నచ్చింది. అప్పటినుంచి ఐదు వందలు, వెయ్యి గజాలు కొనటం ప్రారంభించా. మద్రాసునుంచి హైదరాబాద్‌ వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ చేద్దామనుకున్నా. మీలాంటి వాళ్లు చేయలేరని కొందరన్నారు. ప్రతి వారికి సొంతిల్లు కల. అందుకే ఈ వ్యాపారం చేస్తానన్నా. పదిరూపాయలు ఎక్కువయినా క్లియర్‌ ల్యాండ్స్‌ కొంటారని.. ల్యాండ్స్‌ కొని అమ్మాను. అది సక్సెస్‌. జయభేరి పేరుతో ఆరెకరాల్లో తొలి కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించా. అందులో అలా్ట్రమోడర్న్‌ ఎమినటీస్‌ పెట్టా. జనరేటర్‌ బ్యాకప్‌, సిలిండర్‌ లేకుండా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చి మీటర్‌ పెట్టేశా. మార్కెటింగ్‌ బాగానే అయ్యే సమయంలో అమెరికాలో ట్విన్‌ టవర్స్‌ కూలిన సంఘటన జరిగింది. వర్క్‌ ఆగిపోతే. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేశా. ప్రాజెక్టు చూసి ఎగబడి కొనేశారు.

ఆర్కే: సినిమాలు వదలిపెట్టారు..

మురళీ మోహన్‌: యాభై ఏళ్ల వయసులో.. హీరో పాత్రల నుంచి తప్పుకున్నా. గతంలో రాజకీయాల్లోకి రామారావుగారు రమ్మన్నారు. సెట్టయ్యాక వస్తానన్నా. సెటిలయ్యాక చంద్రబాబుగారు రమ్మంటే కాదనలేకపోయా. పదేళ్లు ఇరుక్కుపోయా.

ఆర్కే: సినిమా వాళ్లు దైవాంశ సంభూతులనుకుంటారు..

మురళీ మోహన్‌: ఒక స్టేజికి వచ్చాక కామన్‌మ్యాన్‌ కాదు.. సినిమా వాళ్లమనే ఫీలింగ్‌ ఉండేది. ఇపుడది నాకు లేదు.

బిజినెస్‌ చేసే సమయంలోనే నాటకాలు వేసేవాణ్ణి. ఆ సమయంలోనే క్రాంతికుమార్‌ తీసుకొచ్చి ఫొటోలు తీయించారు స్టూడియోలో. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారికి ఈ విషయం తెలిసింది. హీరో గిరిబాబు. విలన్‌ దొరకలేదు. నా ఫొటోలు చూసి రమ్మన్నారు ఆయన. నాటకాలు వేశావా? అన్నారు. హీరో పాత్ర వేస్తావా? అన్నారు. కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతంలో రేపటి నుంచే షూటింగ్‌ అన్నారు. అలా ఇంట్లో అంగీకరించటంతో సినిమాల్లోకి వచ్చా.

2.jpg

ఇక రాజకీయాల జోలికి వెళ్లను. రిటైర్‌ అవ్వనిది సినిమా యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా. దిల్‌రాజులా మంచి పాయింట్‌తో ‘బలగం’ లాంటి సినిమాలు చేయాలి. నటుడిగా ఏ పాత్రయినా చేస్తాను. నేనక్కడా కాంట్రవర్సీ మాట్లాడను. నెగటివ్‌ ఎందుకులే అనుకుంటా. ప్లాట్లు కొనుక్కోమని నాకు శోభన్‌బాబుగారు చెప్పారు. ‘మీ వీడియోలు చూసి.. ప్లాట్లు కొనుక్కున్నాం’ అంటూ చెబుతుంటారు కొందరు. సంతోషంగా అనిపిస్తుంది.

Updated Date - 2023-07-30T13:40:57+05:30 IST