Border-Gavaskar Trophy : డ్రానందమే

ABN , First Publish Date - 2023-03-14T04:56:01+05:30 IST

సిరీ్‌సలో తొలిసారి ఐదు రోజుల వరకు సాగిన నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితమూ రాలేదు. పూర్తిగా బ్యాటర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. ఇరు జట్ల బౌలర్లూ కలిసి 21 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.

Border-Gavaskar Trophy : డ్రానందమే

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌175/2 డిక్లేర్‌

హెడ్‌, లబుషేన్‌ అర్ధసెంచరీలు

2-1తో సిరీస్‌ నెగ్గిన టీమిండియా

చివరి రోజు కూడా మొతేరా పిచ్‌ బౌలర్లకు సహకరించలేదు. ఆసీ్‌సను తక్కువ స్కోరుకు కట్టడి చేద్దామనుకున్న భారత బౌలర్ల ఆశలు ఫలించలేదు. హెడ్‌, లబుషేన్‌ నిలకడగా ఆడి అర్ధసెంచరీలతో విసిగించారు. దాదాపు రెండున్నర సెషన్లపాటు బ్యాటింగ్‌ సాగించిన ఆసీస్‌ కోల్పోయింది రెండు వికెట్లే.. దీంతో డ్రా అనివార్యమైంది. అయితే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌ తమ ఆధిపత్యాన్ని కోల్పోకుండా వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోగలిగింది. అంతేకాదు.. స్వదేశంలో టీమిండియాకిది వరుసగా 16వ టెస్టు సిరీస్‌.

అహ్మదాబాద్‌: సిరీ్‌సలో తొలిసారి ఐదు రోజుల వరకు సాగిన నాలుగో టెస్టులో ఎలాంటి ఫలితమూ రాలేదు. పూర్తిగా బ్యాటర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌ చివరకు డ్రాగా ముగిసింది. ఇరు జట్ల బౌలర్లూ కలిసి 21 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. అయితే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని మాత్రం 2-1తో భారత్‌ నెగ్గింది. తొలి రెండు టెస్టులను భారత్‌.. మూడో టెస్టును ఆసీస్‌ గెలుచుకున్నాయి. సోమవారం చివరి రోజు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 175/2 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. మరో గంటకు పైగా సమయం ఉన్నప్పటికీ 79వ ఓవర్‌లో తొలి బంతి వేశాక ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ట్రావిస్‌ హెడ్‌ (90), లబుషేన్‌ (63 నాటౌట్‌) అర్ధసెంచరీలు సాధించారు. అశ్విన్‌, అక్షర్‌లకు చెరో వికెట్‌ దక్కింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా జడేజా, అశ్విన్‌ సంయుక్తంగా నిలిచారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేయగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు సాధించింది.

అలసటే మిగిలింది..: 3/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా.. 14 పరుగుల వద్దే ఓపెనర్‌ కునేమన్‌ (6)ను అశ్విన్‌ ఎల్బీ చేశాడు. కానీ మరో వికెట్‌ తీసేందుకు భారత బౌలర్లకు దాదాపు 50 ఓవర్లు వేచిచూడాల్సి వచ్చింది. ఫ్లాట్‌ వికెట్‌పై హెడ్‌, లబుషేన్‌ సునాయాసంగా బ్యాటింగ్‌ సాగించగా.. అటు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అత్యంత ఓపికను కనబరుస్తూ ఈ జోడీ క్రీజులో పాతుకుపోయి 73/1 స్కోరుతో లంచ్‌ విరామానికి వెళ్లింది. అనంతరం రెండో సెషన్‌లోనూ బౌలర్లు వీరిని ఇబ్బందిపెట్టలేకపోయారు. అయితే టీ బ్రేక్‌కు కాస్త ముందు సెంచరీకి కేవలం పది పరుగుల దూరంలో హెడ్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి సెషన్‌లో ఆట 14.1 ఓవర్లు మాత్రమే సాగగా కెప్టెన్ల అంగీకారం మేరకు అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఈ సెషన్‌ చివర్లో పుజార, గిల్‌ చేత కూడా కెప్టెన్‌ రోహిత్‌ సరదాగా ఓవర్లు వేయించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌

ఆసీ్‌సతో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ.. భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చోటు దక్కించుకుంది. టీమిండియాకు పోటీగా ఉన్న శ్రీలంక తొలి టెస్టులో కివీస్‌ చేతిలో ఓడడంతో అదృష్టం కలిసివచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టెస్టులో మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ భారత్‌కు వరమైంది. ఒకవేళ కివీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను శ్రీలంక క్లీన్‌స్వీ్‌ప చేస్తే భారత్‌కు నిరాశే ఎదురయ్యేది. ఇప్పుడు లంక తొలి మ్యాచ్‌లోనే ఓడడంతో మరో టెస్టు వరకు రోహిత్‌ సేన ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. ఇక భారత్‌పై మూడో టెస్టు విజయంతో ఆసీస్‌ జట్టు ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లింది. జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో ఇరు జట్ల మధ్య అంతిమ పోరు జరుగుతుంది. అలాగే భారత్‌కిది వరుసగా రెండో ఫైనల్‌ కావడం విశేషం. 2021లో జరిగిన తొలి చాంపియన్‌షి్‌పలో కివీస్‌ చేతిలో ఓడింది.

స్కోరుబోర్డు

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 480; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 571; ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌: కునేమన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 6; హెడ్‌ (బి) అక్షర్‌ 90; లబుషేన్‌ (నాటౌట్‌) 63; స్మిత్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 78.1 ఓవర్లలో 175/2. వికెట్ల పతనం: 1-14, 2-153; బౌలింగ్‌: అశ్విన్‌ 24-9-58-1; జడేజా 20-7-34-0; షమి 8-1-19-0; అక్షర్‌ 19-8-36-1; ఉమేశ్‌ 5-0-21-0; గిల్‌ 1.1-0-1-0; పుజార 1-0-1-0.

టెస్టుల్లో తక్కువ బంతుల్లో (2205)నే 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అక్షర్‌. బుమ్రాను అధిగమించాడు.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని వరుసగా నాలుగు సార్లు గెలిచిన జట్టుగా భారత్‌ (2017, 2018, 2020, 2023).

స్మిత్‌ ఆడిన 30 టెస్టు సిరీస్‌ల్లో అర్ధసెంచరీలు చేయకపోవడం ఇది రెండోసారి మాత్రమే.

సొంత గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలవడం వరుసగా 16వసారి.

Updated Date - 2023-03-14T04:56:01+05:30 IST