IPL MI vs SRH : ముంబై హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2023-04-19T03:15:38+05:30 IST

మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జోరు పెంచింది. బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్టు రాణించగా.. అటు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కుదురుకోనీయలేదు.

IPL MI vs SRH : ముంబై హ్యాట్రిక్‌

గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ షో

తిలక్‌ మెరుపులు

సన్‌రైజర్స్‌కు నిరాశ

కామెరూన్‌ గ్రీన్‌ (40 బంతుల్లో

64 నాటౌట్‌; 1/29)

హైదరాబాద్‌: మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జోరు పెంచింది. బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గట్టు రాణించగా.. అటు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కుదురుకోనీయలేదు. దీంతో మంగళవారం ఉప్పల్‌ మైదానంలో జరిగిన ఈ పోరులో రోహిత్‌ సేన 14 పరుగుల తేడాతో వరుసగా మూడో మ్యాచ్‌ గెలిచింది. అటు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఉన్న రైజర్స్‌ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. కామెరూన్‌ గ్రీన్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 నాటౌట్‌; 29/1) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (38), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37) రాణించారు. జాన్సెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (48), క్లాసెన్‌ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) రాణించారు. మెరిడిత్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, చావ్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గ్రీన్‌ నిలిచాడు.

దూకుడు తగ్గింది..

భారీ ఛేదనలో సన్‌రైజర్స్‌ ఆరంభం ఆశించిన రీతిలో సాగలేదు. తమ చివరి మ్యాచ్‌లో ప్రతీ బ్యాటర్‌ మెరుగ్గా రాణించినా ఈసారి తడబడ్డారు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో దెబ్బతింది. అయితే ఫామ్‌లో లేని ఓపెనర్‌ మయాంక్‌ మాత్రం నిలకడను ప్రదర్శించాడు. సెంచరీతో ఊపు మీదున్న ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌ (9)తో పాటు రాహుల్‌ త్రిపాఠి (7)లను పవర్‌ప్లేలోనే బెహ్రెన్‌డార్ఫ్‌ అవుట్‌ చేయడంతో రైజర్స్‌కు గట్టి షాక్‌ ఎదురైంది. అనంతరం మయాంక్‌-మార్‌క్రమ్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే తొమ్మిదో ఓవర్‌లో 6,4తో జోరు చూపిన కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (22)ను గ్రీన్‌ అదే ఓవర్‌లో అవుట్‌ చేయగా మూడో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే అభిషేక్‌ (2) నిష్క్రమించగా, క్లాసెన్‌ ఉన్నకాసేపు వణికించాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో వరుసగా 4,6,6,4 బాది చివరి బంతికి అవుటయ్యాడు. ఈ ఓవర్‌లో తను 21 పరుగులు అందించాడు. ఓపిగ్గా ఆడుతున్న మయాంక్‌ తర్వాతి ఓవర్‌లోనే వెనుదిరగడంతో మ్యాచ్‌ పూర్తిగా ముంబై వైపు మొగ్గు చూపింది. చివర్లో కాస్త వేగం చూపిన జాన్సెన్‌ (13), సుందర్‌ (10) త్వరగానే అవుటయ్యారు. ఆఖరి ఓవర్‌లో రైజర్స్‌ విజయానికి 20 రన్స్‌ అవసరపడగా.. సమద్‌ (9) రనౌట్‌తో పాటు ఐదో బంతికి భువనేశ్వర్‌ (2)ను అవుట్‌ చేసిన అర్జున్‌ టెండూల్కర్‌ కెరీర్‌లో తొలి వికెట్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

గ్రీన్‌ ధమాకా

టాస్‌ ఓడిన ముంబై బ్యాటింగ్‌కు దిగగా టాపార్డర్‌ బ్యాటర్స్‌ మెరుగ్గానే రాణించారు. ముఖ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్‌ గ్రీన్‌ ఆరంభంలో నిదానంగానే ఆడినా.. డెత్‌ ఓవర్లలో కుమ్మేశాడు. అలాగే లోకల్‌ బాయ్‌ తిలక్‌ వర్మ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌ రోహిత్‌ మూడో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లోనూ మరో రెండు ఫోర్లతో మెరిసినా నటరాజన్‌ అతడిని అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హిట్టింగ్‌ చేస్తాడన్న ఉద్దేశంతో గ్రీన్‌ను ముందుగానే పంపినా ఆరంభంలో భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో 53 పరుగులు చేసిన ముంబై ఆ తర్వాత మరింత నెమ్మదించింది. స్పిన్నర్లు సుందర్‌, మార్కండే కట్టుదిట్టం చేశారు. పదో ఓవర్‌లో ఇషాన్‌ రెండు ఫోర్లు సాధించి ఊపు తెచ్చే ప్రయత్నం చేసినా.. తర్వాతి ఓవర్‌లోనే గట్టి ఝలక్‌ తగిలింది. పేసర్‌ మార్కో జాన్సన్‌ చెలరేగి ఇషాన్‌తో పాటు సూర్యకుమార్‌ (7)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ రెండు క్యాచ్‌లను మార్‌క్రమ్‌ అద్భుతంగా పట్టేశాడు. నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు తిలక్‌ వర్మ ఊపు తెచ్చాడు. 15వ ఓవర్‌లో తను రెండు వరుస సిక్సర్లు బాదగా.. గ్రీన్‌ రెండు ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో 16వ ఓవర్‌లో తిలక్‌ 4,6తో మురిపించాడు. కానీ భువీ బంతికి స్వీపర్‌ కవర్‌లో మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు 28 బంతుల్లోనే 56 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఇక తన నిష్క్రమణ తర్వాత ఒక్కసారిగా గ్రీన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 18వ ఓవర్‌లో వరుసగా 4,4,4,6తో నటరాజన్‌ను బాదేసి 20 రన్స్‌ రాబట్టాడు. అటు ఐపీఎల్‌లో తన తొలి ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. అయితే 19వ ఓవర్‌లో భువనేశ్వర్‌ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేసినా.. చివరి ఓవర్‌లో నటరాజన్‌ రెండు ఫోర్లతో 14 రన్స్‌ సమర్పించుకోగా, జట్టు స్కోరు దాదాపు 200కి చేరింది.

ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా రోహిత్‌. కోహ్లీ (6,844),

ధవన్‌ (6,477), వార్నర్‌ (6,109) ముందున్నారు.

స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 28, ఇషాన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 38, గ్రీన్‌ (నాటౌట్‌) 64, సూర్యకుమార్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 7, తిలక్‌ వర్మ (సి) మయాంక్‌ (బి) భువనేశ్వర్‌ 37, డేవిడ్‌ (రనౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 192/5; వికెట్ల పతనం: 1-41, 2-87, 3-95, 4-151, 5-192; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-31-1, జాన్సెన్‌ 4-0-43-2, వాషింగ్టన్‌ 4-0-33-0, నటరాజన్‌ 4-0-50-1, మార్కండే 4-0-35-0.

హైదరాబాద్‌: బ్రూక్‌ (సి) సూర్య (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 9, మయాంక్‌ (సి) డేవిడ్‌ (బి) మెరెడిత్‌ 48, త్రిపాఠి (సి) ఇషాన్‌ (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 7, మార్‌క్రమ్‌ (సి) షోకీన్‌ (బి) గ్రీన్‌ 22, అభిషేక్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 1, క్లాసెన్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 36, సమద్‌ (రనౌట్‌) 9, జాన్సెన్‌ (సి) డేవిడ్‌ (బి) మెరెడిత్‌ 13, వాషింగ్టన్‌ (రనౌట్‌) 10, భువనేశ్వర్‌ (సి) రోహిత్‌ (బి) అర్జున్‌ 2, మార్కండే (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 19.5 ఓవర్లలో 178 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-25, 3-71, 4-72, 5-127, 6-132, 7-149, 8-165, 9-174, 10-178; బౌలింగ్‌: అర్జున్‌ టెండూల్కర్‌ 2.5-0-18-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-0-37-2, మెరెడిత్‌ 4-0-33-2, షోకీన్‌ 1-0-12-0, పీయూష్‌ 4-0-43-2, గ్రీన్‌ 4-0-29-1.

Updated Date - 2023-04-19T03:15:38+05:30 IST