Share News

ABN Big Debate with Chandrababu : జయం మాదే!

ABN , Publish Date - May 09 , 2024 | 04:29 AM

నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్‌ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.

ABN Big Debate with Chandrababu : జయం మాదే!

జగన్‌ గెలిచే చాన్స్‌ 0.0001% కూడా లేదు

రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తా

అది నా బ్రాండ్‌, నా ట్రాక్‌ రికార్డ్‌

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు

జగన్‌ వ్యక్తిత్వం భయానకం!

2019లో చెప్పినా ఎవరూ నమ్మలేదు

సీరియల్‌ కిల్లర్‌ మనుషులను చంపితే..

జగన్‌ వ్యవస్థలను చంపేశాడు

హిట్లర్‌, తాలిబన్ల సరసన నిలిచే వ్యక్తి

రాష్ట్రంలో భయానక వాతావరణం

వేధింపులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి

అభివృద్ధి, సంక్షేమం సమతుల్యత.. ఇదే మా మోడల్‌

రాజకీయ రౌడీల తాట తీస్తా

జైలులోనే నన్ను చంపాలనుకున్నారు ఏదేమైనా కానీ అనే ధైర్యంతో ఉన్నా

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ‘బిగ్‌ డిబేట్‌’లో చంద్రబాబు

వంద శాతం అధికారంలోకి వస్తున్నాం

ఇలా అనుకుంటే..

అప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నది నా కోరిక. ఇప్పుడు అమరావతిని, పోలవరాన్ని, పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తే వాటి ఫలితాలు వస్తాయని అనుకున్నాం. దాన్ని వాళ్లు (ప్రజలు) అర్థం చేసుకోలేకపోయారా? నేను సరిగా చెప్పలేకపోయానా? తెలుగు వారిని ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలనేది నా అభిలాష. పేదరికంలేని తెలుగు సమాజాన్ని నిర్మించాలి. నా జీవితంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకూ దీనికోసమే కృషి చేస్తాను.

అప్పుడు చెబితే నమ్మలేదు

జగన్‌ సైకో అని 2019 ఎన్నికల సమయంలోనే నేను చెప్పాను. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు నరసింహారావు జగన్‌ మనస్తత్వం మీద చాలా వ్యాసాలు రాశారు. అప్పుడు ప్రజలు విశ్వసించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సైకో అంటున్నారు.

-చంద్రబాబు

నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్‌ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు. రాత్రిళ్లు జాగారం చేసిన రోజులు ఉన్నాయి. ఎవరినో ఒకరిని అరెస్టు చేశారని వార్త రావడం.. వారిని కాపాడుకోవడం.. వాళ్లను చంపకుండా, హింసించ కుండా చూసుకోవడం! ఇలా నిద్రలేని రాత్రులు గడిపాను.

‘‘నా రాజకీయ జీవితంలో ఎంతో పట్టుదలగా పని చేశా. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతకుమించిన పట్టుదలతో కృషి చేస్తా’’ అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహార శైలి తదితర అంశాలపై స్పందించారు.


పాలనలో ఒకొక్కరిది ఒక్కో మోడల్‌! ఆయన (జగన్‌) కంటికి కనిపించని అభివృద్ధి చేశానని చెబుతున్నారు. సంక్షేమమైతే అంతూపొంతూ లేనంతగా చేశామని గెలుపుపై పూటకో లెక్క చెబుతున్నారు. జగన్‌ మళ్లీ గెలుస్తారని మీకూ ఎక్కడైనా అనిపిస్తోందా?

0.00001శాతం కూడా లేదు. ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్నారు. అందుకు ఒక ఉదాహరణ.. ఎంప్లాయిస్‌. ఎవరూ నోరు విప్పే పరిస్థితి కూడా లేదు. మాట్లాడితే బతకనివ్వడంలేదు. కొంతమందిని వేధించి, వేధించి చివరకు చంపేసిన సందర్భాలున్నాయి. కొంతమంది ఇంకేం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి సందర్భాల్లోనూ ఎన్జీవోలు (ఉద్యోగులు) నోరు విప్పి మాట్లాడలేనంతగా భయపెట్టారు.

ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. ఎన్జీవోలు ఆయన టేబుల్‌పైకి ఎక్కి పూలకుండీతో కొట్టబోయారు. బిజూ పట్నాయక్‌ చొక్కా కూడా చింపేశారు కదా? ఎన్జీవోలకు ప్రభుత్వాలు భయపడేవి కదా?

అవును. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా భయపడేవారు. కానీ... ఇప్పుడు రివర్స్‌! జీతాలు తగ్గించి రివర్స్‌ పీఆర్సీ వేస్తారేమోనని ఎన్జీవోలే భయపడుతున్నారు.

అంతకుమించిన ‘సైకో’

నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక సీరియల్‌ కిల్లర్‌ ఒంటరిగా ఉండే మహిళలను బండరాళ్లతో చంపేవాడు. ఇలా 35 మందిని చంపేశాడు. ప్రజల్లో భయం పెరిగిపోయింది. పోలీసులు అతడిని తిరుపతిలో పట్టుకున్నారు. జీవితంలో జరిగిన ఏదో సంఘటనతో వాడు అలా మారాడు. పారిపోయే ప్రయత్నంలో పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. అలాంటి మనస్తత్వం ఉన్న సీరియల్‌ కిల్లర్‌లనూ చూశాను. కానీ... ఇది అంతకు మించి! అతను వ్యక్తి! ఇతను(జగన్‌) వ్యవస్థ! సర్వనాశనం చేశాడు.

ప్రేమించేది ‘ఇగో’ను మాత్రమే

కేసీఆర్‌ పదేళ్లు ఉన్నాడు. ఇంత కక్షపూరితంగా వ్యవహరించలేదు. జగన్‌ అలా కాదు! ఆయన థియరీ ఏంటంటే.. భార్యను ప్రేమించడు. తల్లిని ప్రేమించడు. పిల్లలను ప్రేమించడు.. చివరికి తోబుట్టువులను కూడా ప్రేమించడు. ఆయన ఇగోనే ప్రేమిస్తాడు. అలాంటి వాళ్లను ఏమి చేయాలి!

- చంద్రబాబు


జైలులో చంపాలని చూశారు..

జైల్లో అడుగుపెట్టిన క్షణం మీకు ఏమి అనిపించింది?

నా 45 ఏళ్ల ప్రజా జీవితంలో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ప్రతీ ఫైల్‌ను చదివిన తర్వాతే ముందుకెళ్లాం. అది నా స్వభావం. కానీ... జగన్‌లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఆరోజు నేను నంద్యాలలో ఉన్నాను. రాత్రి అవుతోంది. పోలీసులు వచ్చి అరెస్టు అని చెప్పారు. ఎందుకని అడిగితే సమాధానం లేదు. చెప్పలేదు. ముందు అరెస్టు వారెంట్‌ ఇస్తాం..ఆ తర్వాత నోటిసులిస్తాం అన్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లా. జైల్లో నాకు మంచం లేకుండా, కమోడ్‌ లేకుండా చేయాలని, సీసీ కెమెరాలు పెట్టి చూసి ఆనంద పడాలని, నేను బాధపడుతుంటే చూసి ఆనందపడాలనేలా వ్యవహరించారు. పైనుంచి అధికారులు మానిటర్‌ చేయడం, జైలు నుంచి ఆరాలు తీయడం... ఇదంతా వారి రాక్షసానందం. విషపు ఆలోచనల నుంచే ఇవన్నీ పుడతాయి. ఇందులో భాగంగా నన్ను ఎలిమినేట్‌ (చంపాలని) చేయాలని కూడా చూశారు. పరిస్థితి కళ్ల ముందు దారుణంగా కనిపిస్తోంది.. ఏది జరిగితే అది జరుగుతుందనుకుని నేనూ ధైర్యంగా ఉన్నా. చివరికి... దోమల నియంత్రణకు కూడా మస్కిటో కాయిల్స్‌ ఇవ్వాలని అడగాల్సి వచ్చింది. వేడి నీళ్లు అడిగితే చల్లనీళ్లు ఇచ్చారు. కుర్చీ కూడా ఇవ్వలేదు. అన్నింటికీ ఫైట్‌ చేయాల్సి వచ్చింది. ఆ స్థాయిలో జైలులో పరిస్థితులను నియంత్రించారు. ఏమిటీ అన్యాయం అనిపించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్లు. బ్యారక్‌లో నేను ఒక్కడినే! తోడు ఎవరూ లేరు. సెక్యూరిటీ ఉంది. వారు ఎక్కడా అమర్యాదగా వ్యవహరించలేదు. భయంతోనో, అభిమానంతోనే దూరంగానే ఉండేవారు. వారి మీద కూడా ఒత్తిడే! నేను వేసుకునే మందులు కూడా ఇవ్వకూడదని జైలు అధికారుల మీద ఒత్తిడి. నా హెల్త్‌ రిపోర్టును కూడా తారు మారు చేశారు. నా కన్నుకు ఆపరేషన్‌ అయింది. రెండో కన్నుకు ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు.. ఆ నివేదికను సాయంత్రానికి మార్చేశారు. ఆపరేషన్‌ ఎప్పుడైనా చేసుకోవచ్చని అంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? వాళ్ల ఉద్దేశం ఏమిటో తెలియదు. పరిస్థితులైతే దారుణంగా ఉన్నాయి. విష ప్రయోగం చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఒక్కక్షణం భయం వేసేది. అయునా మనోధైర్యం కోల్పోకుండా ఉన్నా.

జైలుకు వెళ్లడం వల్ల మీలో వచ్చిన మార్పు ఏంటి?

చేయని తప్పునకు జైలుకు వెళ్లా. 53 రోజులు జైల్లో ఉన్నా. ఏ నాయకుడి కోసం పోరాడని విధంగా ప్రజలు నా కోసం పోరాడారు. ఇంతటి అభిమానం, ఆదరణ ఏ నాయకుడికీ దొరకదు. అదే సమయంలో... ఇలాంటి అన్యాయం రాజకీయాల్లో ఇంకొకరికి జరక్కూడదు. ఉన్మాద, దౌర్జన్య, నేరపూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయాలి.

అకారణంగా జైలుకు వెళ్లిన వారు ఉన్నారు. రఘురామరాజులా దెబ్బలు తిన్న వారు ఉన్నారు. వీరంతా రేపు శాంతిస్తారా?

చాలామంది బాధితులు ఉన్నారు. రౌడీ ముఠాలను కంట్రోల్‌ చేశా. మతకలహాలను అణచివేశా. తీవ్రవాద సమస్య మీద పోరాడాం. ఎవరి ఆటలూ సాగనివ్వలేదు. సమాజంలో శాంతి కోసమే నా ప్రయత్నం. ఇప్పుడు రాజకీయ రౌడీయిజం ప్రబలింది. రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వారిని ఏం చేస్తానో జూన్‌ 4 తర్వాత మీరే చూస్తారు. తాట తీస్తా!


వంద శాతం అధికారంలోకి వస్తున్నాం: చంద్రబాబు

(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి)

ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు తథ్యమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు నిరాశా నిస్పృహల్లో ఉన్నారని... జగన్‌ మళ్లీ గెలిచే అవకాశాలు 0.00001 శాతం కూడా లేవని తేల్చి చెప్పారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణమే తమ బాధ్యత అని తెలిపారు. ‘ఇప్పుడు కాకుంటే మళ్లీ చేసుకోలేం. నా రాజకీయ జీవితంలో ఎంతో పట్టుదలగా పని చేశా. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతకుమించిన పట్టుదలతో కృషి చేస్తా. ఇది నా బ్రాండ్‌, నా ట్రాక్‌ రికార్డ్‌’ అని ఉద్ఘాటించారు. బుధవారం చంద్రబాబు ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ నిర్విహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహార శైలి, జైలులో తనకు ఎదురైన అనుభవాలు తదితర అంశాలపై స్పందించారు. ఇవీ ఆ వివరాలు...

ఆర్కే: ఎండల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నారు కదా!

చంద్రబాబు: యుద్ధంలో ఉన్నాం.

  • యుద్ధ ఫలితం ఎలా ఉండబోతోంది?

వెరీ క్లియర్‌! మేం గెలుస్తున్నాం. కమ్‌ బ్యాక్‌!

  • ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానన్న ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటున్నారా?

నూటికి నూరు శాతం. అందులో డౌటే లేదు.

  • అంత నమ్మకం రావడానికి కారణమేంటి.?

45 ఏళ్ల రాజకీయంలో ఉన్నాను. చాలామంది ముఖ్యమంత్రులను, చాలా రాజకీయ పార్టీలను చూశాను. రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసిన వ్యక్తిని ఎప్పుడూ జీవితంలో చూడలేదు. అసలు ఊహించలేదు. ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడైనా ఊహించారా... మీరు చెప్పండి!

  • నా దృష్టిలో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే ఒక వింత. సరే జనం కోరుకున్నారు, సీఎం అయ్యాడు. అది రియాలిటీ!

జనం కోరుకోలేదు. ఒక ఫిలాసఫీని ఆయన పర్సనాలిటీతో అడాప్ట్‌ చేశారు. ఆ ఫిలాసఫీ ఏంటంటే అబద్ధాలు చెబుతూ.. వాటినే నిజమని నమ్మించడం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసింది లేదు కానీ... కేవలం వారి ఐడియాలజీని, ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్‌ చేయడానికే పేపర్‌ పెట్టారు. ఎవరొస్తే వారి మీద దాడి చేయడం, వాళ్లు చెప్పింది నిజమని నమ్మించడం, మోసం చేయడం తప్ప వేరేమీ లేదు. హిట్లర్‌, బిన్‌లాడెన్‌, తాలిబన్స్‌, నార్త్‌కొరియా వాళ్లు చేసినట్టు చేశారు.

  • జగన్‌ను వాళ్ల సరసన చేర్చారా.?

ఏం మిగిలిందిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో. అసలు తెలుగువారికి ఏం తక్కువ ఉంది చెప్పండి. 25ఏళ్లకు ముందు నేను సీఎం అయినప్పుడు, ఒక సిస్టమాటిక్‌గా నాలెడ్జ్‌ ఎకానమీని డ్రైవ్‌ చేయాలని సంకల్పించాం. దాని ఫలితాలను ఇప్పుడు హైదరాబాద్‌ రూపంలో చూస్తు న్నాం. ఐటీ ప్రొఫెషనల్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాంటి తెలుగు జాతి ఏపీలో మోసపోయింది. ఇబ్బంది పడుతోంది.

  • తాము ఇబ్బంది పడుతున్నట్లుగా జనం గుర్తించారా?

గుర్తించకపోతే జరిగేది రెండే! యువత మొత్తం ఏపీలో బతకలేక బయటకువెళ్లిపోవాలి. ఎలాంటి అవకాశాలు లేని వాళ్లు బానిసలుగా బతకాలి.

  • అంటే.. బటన్‌ల మీద ఆధారపడాలంటారా? కొద్ది రోజులకు ఆ బటన్‌లూ ఉండవేమో! బటన్‌ నొక్కడానికి ఆదాయం ఉండాలి కదా.?

బటన్‌ల మీద అని కాదు. ఒక్కసారి స్థూలంగా పరిస్థితులను విశ్లేషణ చేసుకోవాలి. అబద్ధాలు, అసత్యాలతో వెళ్లదీస్తున్నారు. ఎవరైనా అడ్డంపడితే.. వేధిస్తున్నారు. చివరకు తట్టుకోలేక వాళ్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి.

  • యుద్ధ రంగంలో శత్రువుపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం కూడా అవసరం.

2019కి ముందు జగన్‌ విషయంలో ఆ పని చేయలేకపోయారు.

జీవితంలో కొన్ని ఊహకందని సంఘటనలు ఎదురవుతుంటాయి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి వ్యక్తి ఒకడు పుడతాడు, వస్తాడని ఊహించారా!? అయితే మనం కూడా ఏమారాం. మేము సరే.. మీరు జర్నలిజంలో ఉన్నారు కదా మీరు చెప్పండి. ఎందుకు వాళ్ల తండ్రి.. ఇతన్ని బెంగుళూరు పంపించేశారు. జగన్‌ వ్యక్తిత్వాన్ని అంచాన వేయలేకపోవడం వైఫల్యమే.

  • రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు.. ఇక్కడ ఉండొద్దు, బెంగుళూరుకే పరిమితం కావాలని జగన్‌కు చెప్పినట్లు సీఎం రోశయ్యే వెల్లడించారు.

తండ్రీ కొడుకుల మధ్య ఏదో ఉందనుకున్నాం కానీ... ఇలాంటి వ్యక్తిత్వమని ఊహించలేదు. ఇది ఎవరి ఊహకూ అందనిది.

  • మీతో పాటు, మమ్మల్ని కూడా తోడేళ్లను చేసేశారుగా?

మిమ్మల్నే కాదు, ఎన్నికల కమిషనర్‌ను కూడా అలాగే చేశారు. తనకు భద్రత కావాలని కోరే స్థాయిలో ఎన్నికల కమిషన్‌ను ఇబ్బంది పెట్టారు. మనిషి స్వభావం ఎలా ఉందో దీని ద్వారా అర్థమవుతోంది కదా!

  • ఏపీ సర్వనాశనం అయిందంటున్నారు.

ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బాగుపడుతుందా?

ఏపీ నాశనం కాలేదు, చేశారు. ఏపీకి అన్ని వనరులూ ఉన్నాయి. నదులు, నీళ్లు, టెక్స్‌టైల్‌, భూములు, పోర్టులు ఉన్నాయి. అన్నీ ఉన్నా ఇప్పుడు సమస్యలు వచ్చాయి. అందుకే జనసేన, బీజేపీ, మేము కలిశాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, నిర్మిస్తాం. దానిపై మేం విశ్వాసంగా ఉన్నాం. చేసి తీరుతాం.

  • ‘మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్‌

కల్యాణ్‌ విశ్వాసం’ కలిశాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మొన్న ప్రధాని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఏమైనా హామీ ఇచ్చారా?

ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, దాదాగిరి పెరిగింది, రాష్ట్రం నష్టపోయింది.. పోలవరం, అమరావతి, పరిశ్రమలను అన్నింటినీ సర్వనాశనం చేశారని మోదీ, అమిత్‌షా ఇద్దరూ చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారులో రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టంగా చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేసి ఏపీని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేను ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు వాజపేయి సహకరించారు. ఇప్పుడు మోడీ కూడా పాలసీల్లో సహకరిస్తున్నారు. సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం, సాధికారత... మా ఇద్దరి ఐడియాలజీ ఒకటే. వందశాతం తెలుగుదేశం (కూటమి) గెలుస్తుంది. స్వీప్‌ చేస్తున్నామని, ఎన్డీయే గెలుస్తుందని వారికీ తెలుసు.


దేశానికి గుర్తింపు

దేశంలో ఇప్పుడు మూడు దశల్లో ఎన్నికలు అయిపోయాయి. ఆ స్థానాల్లో బీజేపీకి అవసరమైన మేర సొంతంగా మెజార్టీ రాదని బయట అంచనాలున్నాయి?

ఎవరు, ఏదైనా మాట్లాడొచ్చు. ఏమైనా ఉండొచ్చు. దేశంలో మాత్రం ప్రత్యామ్నాయం లేదు. మోదీ మీద నమ్మకముంది. ఆయన పని చేసిన విధానం కూడా దేశం ముందుకు వెళ్లే విధంగా ఉంది. పదేళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో భారతదేశానికి గుర్తింపు వచ్చింది. స్థిరమైన, సుస్థిరమైన అభివృద్ధి జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం లీడర్‌షిప్‌ వాక్యూమ్‌ ఉంది. ఇలాంటి సమయంలో మోదీ ఒక లీడర్‌గా వచ్చి.. దేశాన్ని ప్రమోట్‌ చేశాడు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు (నెటవర్క్‌) ఏర్పరచుకోవాలని నేను చాలామంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులకు చెప్పాను. దాని వలన దేశానికి మంచి గుర్తింపు, పేరు వస్తుందని చెప్పేవాడిని. నేను ఒక రాష్ట్ర సీఎంగా వెళ్లి మాట్లాడితేనే ఆయా దేశాలు స్పందిస్తున్నాయి. అలాంటిది దేశం తరఫున మీరు చేస్తే ఇంకా రెస్పాన్స్‌ వస్తుందని చెప్పాను. కానీ, అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు... మనం ఎందులోనూ తక్కువ కాదని మోదీ నిరూపించారు.

కేంద్రంలో భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం అనివార్యమైతే.. మీరు పాత రోజుల్లో లాగా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందా?

పాత రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 42 స్థానాలు ఉండేవి. టీడీపీ ఎప్పుడూ కేంద్రంలో అధికారం కోరుకోలేదు. అప్పుడు యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీయే, అంతకంటే ముందు నేషనల్‌ ఫ్రంట్‌ (ఎన్‌ఎ్‌ఫ) ఉండేవి. ఎన్టీఆర్‌ అధికారం కోసం ఆలోచించలేదు. తెలుగు కమ్యూనిటీ ముఖ్యమనే వ్యవహరించారు. 2014లో కూడా నేను పదవులు అడగలేదు. మాకు పదవులు, అధికారం ముఖ్యంకాదు. రాష్ట్ర అభివృద్ధి, తెలుగు కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ ముఖ్యం!

కేంద్రంలో మీ ప్రాధాన్యం పెరిగినా వ్యక్తిగతంగా వచ్చేది ఉండవకపోవచ్చు. కానీ, రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. అదే జగన్‌... 25సీట్లు గెలిపిస్తే మోదీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అంటారు.

ఆయన చేసేది రాష్ట్రం కోసం కాదు! తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే ఇదంతా. నేను ఆ డ్రామాలు చేయను. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు అనే స్వభావం ఆయనది. ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని చెప్పిన ఆయనే... ‘ఇప్పుడు నన్ను పీకేస్తున్నారు’ అంటున్నాడు. దానికి మనం ఏం చెప్తాం! పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలలాగా మొత్తం ఎమ్మెల్యే స్థానాలు ఆయనే లాగేసుకోవాలని చూశాడు!

రేపు ప్రభుత్వం వస్తే... ఎన్డీయేతో ప్రయాణం ఎలా ఉండబోతుంది?

ఇంతకుముందు కూడా బీజేపీతో కలిసి పని చేశాం కదా? ఒక ఐడియాలజీ పెట్టుకుని, అందరం కలిసి ఎక్కడికక్కడ ఆలోచించి మందుకు వెళతాం. కామన్‌ గుడ్‌ కోసం అందరం కలిసి పని చేస్తాం. జాతీయ స్థాయిలో ఎన్డీయే ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీ ఉంది. ఎప్పుడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించి, ముందుకు వెళతాం. సంక్లిష్టతలను చేధించుకుని వెళతాం.

పొత్తు ప్రకటన తర్వాత చిలకలూరిపేట వచ్చినప్పటికీ, ఇప్పటికీ మోదీలో బాగా తేడా కనిపించింది. మీతో కూడా చాలా కలివిడిగా, జోవియల్‌గా ఉన్నట్టు కనిపించింది. మరి మీరేం మాట్లాడుకున్నారో చెబితే వింటాం (నవ్వుతూ)?

కొన్ని కొన్ని మీకు చెప్పకూడదు (నవ్వుతూ)! నేనంటే ఆయనకు (మోదీ) అభిమానం, ఆయనంటే నాకు గౌరవం అనేది ఎప్పుడూ ఉన్నాయి. ఒక విషయం మీద ఇద్దరం దూరమయ్యాం. నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. అయినా దాచేదేముంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న ఆందోళన కలిగింది. అదే సమయంలో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ కూడా కొంత దెబ్బ తిన్నదని తొందరపడ్డాం. కానీ, ఏపీకి విభజనకంటే జగన్‌ వల్లే ఎక్కువ నష్టం జరిగింది. దానిని సరిదిద్దడమే మా లక్ష్యం. అందుకే మేం ముగ్గురం కలిశాం. కచ్చితంగా చేస్తాం.


అప్పుల పాలైన రాష్ట్రం..

‘‘జైలుకు వెళ్లిన సమయంలో ఓ అధికారి మారు వేషంలో నా వద్దకు వచ్చారు. వణికి పోతున్నాడు. ఏంటయ్యా అంటే.. ‘సార్‌, సంతకం చేయకపోతే నన్ను చంపేస్తారు సార్‌. అన్యాయం చేస్తున్నారు సర్‌’ అన్నాడు. ధైర్యంగా ఉండు అంటే, ‘చంపేస్తారు సార్‌.. ఏమి చెబితే అది చేయాల్సిందే సార్‌’ అన్నాడు. ఇంకో సంఘటనలో... ఒక అధికారిని ఆయన కుమార్తె పెళ్లి సమయంలోనే అరెస్టు చేసేందుకు వెళ్లారు. ‘రాజీ పడతావా.. జైలుకు వెళతావా’ అని ఒత్తిడి చేశారు.’’

లోకేశ్‌ రెడ్‌ బుక్‌ పట్టుకుని తిరుగుతున్నాడు.

ఇప్పుడు దానిపై కూడా కేసు పెట్టారు...

తప్పు చేసినవాడిని వదిలిపెట్టడం కరెక్ట్‌ కాదు. తప్పులను రుజువు చేసి, మళ్లీ జీవితంలో ఆ పని చేయకుండా శిక్షించాల్సిందే!

లోకేశ్‌ మంత్రి పదవి తీసుకోనని అంటున్నాడు. పార్టీ బాధ్యతలకే పరిమితమవుతానంటున్నాడు. మీది అదే లైనా ?

ఎవరు ఏం చేయాలనేది రైట్‌ టైమ్‌లో నిర్ణయించుకుంటాం. ఎవరికి ఏది అప్పజెప్పాలో తర్వాత నిర్ణయిస్తాం. ప్రతి ఒక్కరికీ వాళ్ల సొంత నిర్ణయాలుంటాయి. ఒక లీడర్‌గా ఎవరిని ఎలా వినియోగించుకోవాలో అది చేస్తా. ప్రజలు, రాష్ట్రం కోసం ఎవరి సేవలు ఎలా అవసరమో తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాం.

మీ కుటుంబంలో భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు కదా! మీరు మరిచిపోయినా.. లోకేశ్‌ ఎలా మరిచిపోతారు?

అది ఒక సంక్షోభం, జగన్‌ చాలా సమస్యలు తీసుకొచ్చాడు. ఆమె 40 ఏళ్లుగా తనపని తాను చేసుకునేది. ఇప్పుడు పట్టుదల వచ్చింది. ఏదో ఒకటి చేయాలనే కసి పెరిగింది.

‘నీ అమ్మ మొగుడు’ అనే కొడాలి నాని వాడే భాషను మీరెందుకు వాడుతున్నారు, మీకెలా సూట్‌ అవుతుంది?

ఒక దుర్మార్గుడిపై పోరాటం చేయాల్సి వస్తోంది. వాళ్ల తీరు చూసి, ఆవేదనతో మాట్లాడాల్సి వస్తోంది. నాకు జరిగినన్ని అవమానాలు ఈ దేశంలో ఎవరికైనా జరిగాయా?

న్యాయం మావైపు ఉంది, అందరూ తమకు మద్దతు పలకాలని వైఎస్‌ సునీత, వైఎస్‌ షర్మిల అడుగుతున్నారు. మీరేమంటారు?

వివేకా కేసులో న్యాయం కోసం అందరికంటే ఎక్కువ ఫైట్‌ చేసింది మేమే. అయితే, కుటుంబ కలహాలు, అంతఃపుర రాజకీయాలు... రాష్ట్ర రాజకీయాలు కావటానికి వీలులేదు. జగన్మోహన్‌ రెడ్డి, షర్మిల మధ్య వివాదానికి కారణం వ్యక్తిగత విషయాలే! ఎన్టీఆర్‌ ఇచ్చిన చట్టప్రకారం ఆయన షర్మిలకు ఆస్తి ఇవ్వాలి. వివేకాను రాజకీయం కోసం హత్య చేయించారు. వాళ్ల పోరాటానికి రాజకీయంగా సహకరించాలని అనుకోవటం కరెక్టు కాదు. నైతికంగా మాత్రం సంఘీభావం తెలియజేయగలం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లెక్కలోకి తీసుకోకుండా హామీలు ఇస్తున్నారు. అమలు ఎలా సాధ్యం?

నేను సీఎం అయ్యాక తీసుకున్న నిర్ణయాల వల్ల సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కానీ... ఇప్పుడు సంపద సృష్టిని మరిచి, సంక్షేమం ఒక్కటే చూడటం సమస్యగా మారింది. రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తాం. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాలి. ఒక మోడల్‌ను జాగ్రత్తగా క్రియేట్‌ చేయాలి. అదే సమయంలో ప్రజల్ని ఎంపవర్‌ చేయకపోతే మనల్ని ఇష్టపడరు. ఈ రెండూ బ్యాలెన్స్‌ చేయాలి. నాకున్న అనుభవం, ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే అప్పులను బ్యాలెన్స్‌ చేసుకుంటాం. రాష్ట్రంలో ముందుగా సంపదను సృష్టించాలి. మేనేజ్‌మెంట్‌ సరిగా ఉండాలి. ప్రొడక్టివిటీ కూడా ఉండాలి.

50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామంటున్నారు? ఇప్పుడు 50 ఉన్న వారిని వృద్ధులుగా పరిగణించడం లేదుగా!

చేనేత కార్మికులు, మత్స్యకారుల్లో 50 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొంతమంది సామాజికంగా, ఆర్థికంగా జీవితాంతం బాగా వెనకబడిపోయారు. వారికీ అవకాశమివ్వాలి. లేదంటే... ఎప్పటికీ వెనుకబడే ఉంటారు. అందుకు అనుగుణంగానే ఒక పాలసీని తీసుకొస్తాం.

తెలంగాణలో సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా బాగానే చేశారు. అయినా జిల్లాల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే... హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం బాగుందని ఓటేశారు?

హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎవ్వరూ నాశనం చేయ్యలేదు. ఏపీలో జగన్‌ ప్రజావేదికను కూల్చినట్టు... ఇక్కడ వైఎస్‌ అధికారంలోకి రాగానే ౅టట

అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడిన తర్వాత ప్రజలు ఇంకేమీ ఆశించరు. గ్యారెంటీలను, సూపర్‌ సిక్స్‌లతో సంబంధంలేకుండానే ఓటు వేస్తారు కదా!

ఏ రాజకీయ పార్టీకైనా పాజిటివ్‌, యాంటీఅనే రెండు కోణాలుంటాయి. ఆశ, భయం కూడా ఉంటాయి. ఇప్పుడు జగన్‌ మీద ప్రజలకు ఆశలు సన్నగిల్లాయి. పాత మేనిఫెస్టోనే మళ్లీ ముందు పెట్టాడు. అంటే... జగన్‌ ఏమీ చేయలేకపోతున్నాడన్న అవగాహన ప్రజల్లో ఏర్పడింది. మాకు ఇప్పుడు ఒక హోప్‌ వచ్చింది. చేస్తామన్న నమ్మకం ఉంది. మా హామీల పట్ల ప్రజల్లో ఉన్న ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ తెలిసిపోయింది.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా?

ఒకరి పట్టాదార్‌ పాస్‌బుక్‌పై జగన్‌ ఫొటో ఎందుకు? రాజముద్రను, రాష్ట్ర అధికార చిహ్నాన్నిప్రజలు ఆమోదిస్తారు. కానీ... ఆయన ఫొటో వేయడమేమిటి? ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, బరితెగించి ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్నాడు. ల్యాండ్‌ టైటిలింగ్‌ ఆఫీసర్‌గా ఎవరినో ప్రైవేటు వ్యక్తిని నామినేట్‌ చేస్తారు. ఆయన ద్వారా భూమిని రెగ్యులరైజ్‌ చేస్తారట. రేపు ఏదైనా భూ సమస్య వస్తే ఎవరు బాధ్యులు?

పతనమైన ఈ రాష్ట్రాన్ని మీరు మళ్లీ అభివృద్ధి బాటలో నిలబెడతారనే ప్రజల నమ్మకాన్ని నిజం చేయగలరా?

ఇప్పుడు నేను చేయలేకపోతే ఇంకెవరూ చేయలేరు. ఎందుకంటే, అది నా బ్రాండ్‌. అది నా ట్రాక్‌ రికార్డు. నా జీవితంలో ఇప్పటి వరకు చేసిన దానికంటే పట్టుదలగా... పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటాను.

Updated Date - May 09 , 2024 | 06:18 AM