Pinneli: పిన్నెల్లికి బెయిల్.. పాస్‌పోర్టును స్వాధీనం చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:43 AM
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.
వారానికోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలి
కోరినప్పుడు విచారణకు హాజరవ్వాలి: ఏపీ హైకోర్టు
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు వారానికి ఓసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎ్‌సహెచ్‌వో) ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్‌పోర్టును సంబంధిత మేజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఎక్కడ నివాసం ఉంటున్నదీ, మొబైల్ నెంబర్ వివరాలను దర్యాప్తు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. బెయిల్ షరతులు ఉల్లంఘించినప్పుడు, అలాంటి పరిస్థితులు తలెత్తిన్నప్పుడు బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు పోలీసులు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు. అయితే, ఎస్‌హెచ్‌వో విచారణకు హాజరుకావాలనప్పుడు పిటిషనర్ తన న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థించగా.. దీనికి ప్రత్యేక పిటిషన్ వేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
ఇదీ కేసు..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మే 13న మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ల ధ్వంసం, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడితోపాటు మే 14న కారంపూడిలో సీఐపై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో ఇప్పటికే పిన్నెల్ని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, షరతులతో కూడిన బెయిల్ లభించింది.