Sharmila : సైతాన్ సైన్యానికి నేత జగన్
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:45 AM
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో పోల్చారు.
నాపై తప్పుడు ప్రచారం చేయించింది ఆయనే
విషనాగులతో పాటు అనకొండనూ పట్టాలి
అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి
11 సీట్లే ఎందుకొచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి
వైసీపీ ఎమ్మెల్యేలకు షర్మిల బహిరంగ లేఖ
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో పోల్చారు. ఈ సైతాన్ సైన్యానికి నాయకుడు జగన్మోహన్రెడ్డేనని అన్నారు. ‘సోషల్‌మీడియాలో అసభ్యంగా పోస్టులు చేసిన విషనాగులను పట్టుకుటున్నారు. వాటిని పెంచుతున్న అనకొండను కూడా పట్టుకోవాలి’ అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిల కుండబద్దలు గొట్టారు. మహిళలపైనా, అమ్మ, చెల్లెళ్లపైనా వికృతంగా పోస్టులు పెడుతుంటే ఆపలేదంటే.. వాటి వెనుక జగన్ ఉన్నట్టేకదా అని ప్రశ్నించారు. మంగళవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో షర్మిల మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత హాదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాననడం జగన్‌కు భావ్యమేనా?, నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?’ అని నిలదీశారు. అసెంబ్లీలో మైకు ఇవ్వని పరిస్థితి రావడానికి జగన్ స్వయంకృపరాధమని పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెడితే అసెంబ్లీకి వెళ్లరా? బడ్జెట్ పద్దులపై ప్రతిపక్షంకాక మరెవరు ప్రశ్నిస్తారు? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు?’ అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే దమ్మూ ధైర్యం లేకపోతే జగన్ సహా వైసీపీ సభ్యులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆమె బహిరంగ లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ కాదని.. కూటమి పార్టీల మరో మేనిఫెస్టోగా ఉందని విమర్శించారు. ‘కూటమి ప్రవేశపెట్టింది బడ్జెట్టో, మేనిఫెస్టోనో అర్థం కావడంలేదు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ప్రతి యేటా లక్షా ఇరవై వేల కోట్లు అవసరం. సూపర్ సిక్స్‌కు చంద్రబాబు బడ్జెట్లో పావువంతు కూడా కేటాయింపులు చేయలేదు. తల్లికి వందనం కింద ప్రతిబిడ్డకూ రూ.15000 ఇవ్వాలంటే బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాలి. మరి కేటాయింపులు లేవంటే సగం మంది పిల్లలకు నిధులు ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదని, అన్నదాత పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించాల్సి ఉందని షర్మిల అన్నారు.