Share News

YSRCP: వైసీపీకి భారీ షాక్.. నాని రాజీనామా

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:50 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి...

YSRCP: వైసీపీకి భారీ షాక్.. నాని రాజీనామా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరిపోతున్నారు. ఇంకొందరు రాజీనామా చేసి కండువా కప్పుకోవడానికి మంచి రోజు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మాజీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి బాంబ్ పేల్చారు.


Alla-Nani-1.jpg

ఎందుకు.. ఏమైంది..!?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా్లో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి కూడా ఆళ్ల రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాని పంపారు. అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నాని అసంతృప్తిగా ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై నాని గానీ.. ఆయన ప్రధాన అనుచరులు, ద్వితియ శ్రేణి నేతలు ఎక్కడా స్పందించం లేదు. రాజీనామాను వైసీపీ హైకమాండ్ అంగీకరిస్తుందా లేకుంటే తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి వైఎస్ జగన్ బుజ్జగిస్తారా..? అనేది తెలియట్లేదు.


Alla-Kali-Srinivas.jpg

వైఎస్ కుటుంబానికి..!

ఆళ్ల నాని.. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడు. వైఎస్ జగన్ రెడ్డికి కూడా అత్యంత నమ్మకస్తుడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆయన విజయం సాధించారు. వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరఫున తొలిసారి పోటీచేసిన నాని.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో 2017లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసిన నాని.. 4,072 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు వైసీపీ కూడా 151 సీట్లతో అధికారంలోకి రావడంతో మంత్రి వర్గంలో ఆళ్లకు చోటు దక్కింది. డిప్యూటీ సీఎంతో పాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో నాని ఘోర పరాజయం పాలయ్యారు. మొదట్లో కాస్తో కూస్తో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గత కొన్ని రోజులుగా పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఏకంగా వైసీపీకే రాజీనామా చేసేశారు. నాని తదుపరి కార్యాచరణ ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు.

Updated Date - Aug 09 , 2024 | 02:38 PM