Share News

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:39 AM

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌తో సీఎం చంద్రబాబు అన్నారు.

Chandra Babu : నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చాం!

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి

యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి

జాతీయ అధ్యక్షుడిగా, సీఎంగా అండగా ఉంటా

సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతు

కూడగట్టుకోవాలి.. వచ్చే నెల నుంచి సభ్యత్వ డ్రైవ్‌

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు చంద్రబాబు సూచనలు

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతి పెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌తో సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారమిక్కడ ఉండవల్లి నివాసంలో పల్లా ఆయన్ను కలిశారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నమ్మకంతో అతి పెద్ద బాధ్యత అప్పగించామని, సమర్థంగా నిర్వహించాలన్నారు.

ప్రతి ఒక్కరికీ తగు గౌరవం ఇవ్వాలని, ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు. జాతీయ అధ్యక్షుడిగా పార్టీపరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వపరంగా అండగా ఉంటానన్నారు. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని కోరారు. సీనియర్ల సూచనలు.. జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వం డ్రైవ్‌ కూడా పునఃప్రారంభించాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను వీలైనంత త్వరగా నామినేటెడ్‌ పదవుల్లో నియమించి గౌరవించాలని.. ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.


నాకంటే మీపైనే ఎక్కువ బాధ్యత ఉంది: లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా మంత్రి లోకేశ్‌ను పల్లా కలిశారు. తన కంటే పెద్ద బాధ్యత చంద్రబాబు మీపై ఉంచారని ఈ సందర్భంగా లోకేశ్‌ అన్నారు. ప్రతి క్షణం కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరికీ తోడుగా నిలవాలన్నారు. ‘కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్ధుగా ఉన్నారు. వారందరినీ సమాయత్తం చేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. పార్టీ కార్యాలయంలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం.

ప్రతి మంత్రీ నెలలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఏం కావాలన్నా అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉంది’ అని చెప్పారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టపడతానని, సీనియర్ల సలహాలతో పార్టీలోకి యువరక్తం ఎక్కించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పల్లా తెలిపారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 18 , 2024 | 05:39 AM