Share News

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:19 AM

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

ఇసుక దందాను సహించొద్దు

‘‘రాజకీయ ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే వదిలిపెట్టబోను. వ్యక్తిగత అంశాలను పార్టీ కక్షల రూపంలో తీర్చుకుంటామంటే కుదరదు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ప్రజలకు మన పట్ల ఉన్న విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా కష్టమైన పని. కానీ, దానిని పొగొట్టుకోవడానికి రెండు నిమిషాలు చాలు. మనపై ఇప్పుడు రెండు ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. టీడీపీ కోసం జెండాలు మోసి, త్యాగాలు చేసిన కార్యకర్తలను కాపాడుకోవాలి. నమ్మి మనకు అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈ దిశగా మన ప్రయాణం ఉండాలి’’

- సీఎం చంద్రబాబు

అండగా నేనుంటా.. కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

ఐదేళ్లూ విధ్వంసమే.. తిరిగి గాడిలోకి ఏపీ.. నేను 1995 సీఎంనే

ఈసారి కచ్చితంగా రాజకీయ పాలనే చేస్తా

మొన్న జరిగింది ఎన్నికలు కాదు.. అది రాక్షసులతో మనం చేసిన యుద్ధం

మన పనైపోయిందన్నవారి పనే ఐపోయింది.. టీడీపీ ఓ రాజకీయ వర్సిటీ

ఏ ముఖ్యనేతకైనా మూలాలు ఇక్కడే.. ఇసుక, మద్యంలో ఎవరూ తలదూర్చొద్దు

సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వ కార్డును చంద్రబాబు అందుకున్నారు. సభ్యత్వ నమోదు కరపత్రాన్ని విడుదల చేశారు. వైసీపీ నేతల దాడిలో ప్రాణాలు కోల్పోయిన, దాడులకు గురైన, ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలతో ఆయన జూమ్‌కాల్‌ ద్వారా మాట్లాడారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘అనేక సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, టీడీపీని నిలబెట్టాం. గత ఐదేళ్లలో చాలామంది టీడీపీ పనైపోయిందన్నారు. కానీ ఆ మాట అన్నవారి పనైపోయింది. టీడీపీని భావితరాల వారికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మొన్నటి ఎన్నికల్లో మన శక్తి ఏంటో చూపించాం. సామాజిక సమీకరణాలతో ముందుకెళ్లి అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చాం. మొన్న జరిగింది ఎన్నికలు కాదు.. రాక్షసుడితో యుద్ధం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు (జగన్‌) వస్తారని ఊహించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా... 2024 ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయమే. వేధింపులు, కేసులు, అరెస్టులు, దాడులతో నాటి పాలకులు ఇబ్బందులు పెట్టినా, ఏ కార్యకర్తా వెనక్కి తగ్గలేదు. ఎవరూ జెండా వదల్లేదు. చాలామంది ప్రాణాలు, ఆస్తులు సైతం కోల్పోయారు’’

hl.jpg

ఎవరు దందా చేసినా తిరగబడండి..

‘‘నాలుగోసారి సీఎం అయిన నేను ఇంతటి అస్తవ్యస్త పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. విధ్వంసం నుంచి బయటపడేసి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే సమయం పడుతుంది. గత పాలకుల విచ్చలవిడి తప్పులతో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం. నాసిరకం, సొంత బ్రాండ్లతో మద్యం సరఫరా చేసి నాడు ప్రజల ప్రాణాలతో అడుకున్నారు. అందుకే నూతన మద్యం పాలసీ తెచ్చాం. మనం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని తెచ్చి.. సీనరేజ్‌, లోడింగ్‌ చార్జీలను రద్దు చేశాం. వైసీపీ నేతలు రూ.30కే ఇసుక తోడుతామని టెండర్లు వేశారని, ఇసుక పాలసీపై తప్పుడు సంకేతాలు పంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇసుక విషయంలో ఎవరు దందా చేసినా తిరుగుబాటు చేయండి. ఇందులో మనవాళ్లు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. మద్యం ఎమ్మార్పీ రేట్ల కంటే ఎవరు ఎక్కువ అమ్మినా చర్యలు తీసుకుంటాం’’


సమపాళ్లలో అభివృద్ధి-సంక్షేమం...

‘‘జాబ్‌ ఫస్ట్‌ విధానం కోసం ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చాం. అధికారంలోకి రాగానే రూ.4 వేలు పెన్షన్‌ అమలు చేశాం. దీపావళి నుంచి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. చెత్తపన్ను రద్దు చేశాం. స్వర్ణకార కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. అర్చకులకు జీతాలు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచాం. దేవాలయాల కమిటీల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు కొత్తగా స్థానం కల్పించాం. డిసెంబర్‌ నెల నుంచి పూర్తి స్థాయిలో రాజధాని పనులు ప్రారంభమవుతాయి. రెండేళ్లలో పోలవరం మొదటి దశ పూర్తి చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండిస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుకు సమస్యలను పరిష్కరించి భూమి కేటాయించాం. అమరావతికి కొత్త రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వబోతున్నాం. ప్రజల కోసం మనం కష్టపడుతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. నా చుట్టూ కాకుండా నేతలు....ప్రజలు, కార్యకర్తల చుట్టూ తిరగాలి. పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు ఉంటుంది’’

ఈసారి రాజకీయ పాలనే..

‘‘నేను 1995 సీఎంనేగానీ, 2024 సీఎంను కాదు. ఈసారి కచ్చితంగా రాజకీయ పాలనే చేస్తా. కేడర్‌ నుంచి వస్తున్న విమర్శలను అర్థం చేసుకోగలను’’ సామాన్యులకు చేరువగా అధికారాన్ని తెచ్చాం

‘‘ఈ రోజు పవిత్రమైన దినం. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రూపాయి సభ్యత్వం ఉండేది. కార్యకర్తల మనోభావాలను గౌరవించే పార్టీ మనది. టీడీపీని స్థాపించకముందు కొన్ని కుటుంబాలకే అధికారం పరిమితమై ఉండేది. మనం వచ్చాక సామాన్యులకు చేరువగా అధికారాన్ని తెచ్చాం. చదువుకున్న యువతకు రాజకీయ అవకాశాలు కల్పించాం. బలహీనవర్గాలను ప్రోత్సహించాం. టీడీపీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది నేతలు తయారయ్యారు. రెండు రాష్ట్రాల్లో ఏ ముఖ్య నాయకుడిని చూసినా వారి మూలాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొదటిసారి కార్యకర్తల కోసం బీమా విధానాన్ని తీసుకొచ్చాం. రూ.100 కట్టి సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా అందించబోతున్నాం. ప్రమాదాలు, రాజకీయ కక్షల్లో భాగంగా మరణించిన కార్యకర్తల కుటుంబాల్లోని పిల్లలను చదివిస్తున్నాం. కార్యకర్తల కోసం రూ. కోట్లు వెచ్చిస్తున్నాం’’

- చంద్రబాబు

Updated Date - Oct 27 , 2024 | 10:43 AM