Share News

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:36 AM

ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Chandrababu : రాష్ట్రానికి వీళ్లు అరిష్టం

ఈవీఎంలపై మాట్లాడటానికి సిగ్గుండాలి

2019లో రాష్ట్రంలో వైసీపీ ఎలా గెలిచింది?

వాళ్లూ ఈవీఎంల మాయతోనే గెలిచారా?

వరదల కారకులే చెత్త ప్రచారాలు చేస్తున్నారు

విశాఖ ప్లాంట్‌ కోసం ‘ఉక్కు’ ప్రయత్నాలు

కేంద్ర సాయం అందకపోతే ప్రైవేటుకు వెళ్లేదే

నిలబెట్టేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నా

20 వేల ఎకరాల ఉప్పు భూములు రాష్ట్రానికి

బీపీసీఎల్‌ రిఫైనరీ రాష్ట్రానికి వస్తోంది

అధికారులు లేకే సర్దుకుపోతున్నాం

కక్ష తీర్చుకోవడం నా పంథా కాదు

మరీ మితిమీరితే ఏం చేయాలో తెలుసు: బాబు

గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఒక అధికారిని ఇంటికి పంపాం. ముగ్గురు ఐపీఎస్‌లపై కేసులు పెట్టాం. గతంలో ఇంత కఠిన చర్యలు నేను ఎప్పుడూ తీసుకోలేదు. మా పార్టీ వారికి నా చర్యలపై కొంత ఎక్కువ ఆశలు ఉన్నాయి. అవి జరగకపోవడం వల్ల నిరాశ కలుగుతోంది. కానీ కక్ష తీర్చుకోవడం నా పంఽథా కాదు. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.

-చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటుపరం కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడవాలన్నది తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేంద్రం ఇటీవల సకాలంలో రూ. పదకొండు వందల కోట్లు ఇవ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈపాటికి అమ్మకానికి వెళ్లేదన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘నేను నిన్న(మంగళవారం) కూడా కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి మాట్లాడాను. ఉక్కు పరిశ్రమ సెంటిమెంట్‌ను చెప్పాను. దాని కాళ్లపై అది ఎలా నిలబడాలనేదానిపై చర్చించాం. కానీ దానికి స్పష్టమైన సమాధానం లభించలేదు. పాలనా వైఫల్యా లు, సరైన యాజమాన్య పద్ధతు లు అవలంబించకపోవడం దెబ్బ తీశాయి. గత ఐదేళ్లు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఇప్పుడు దానిని పునరుద్ధరించడానికి ఎంత డబ్బు కావాలి...ఏం చేయాలన్నదానిని చర్చిస్తున్నాం. రెండు కమిటీలు పరిశీలన చేస్తున్నాయి. ప్రాక్టికల్‌గా ఏది సాధ్యమో చూసుకోవాలి. మేం శక్తివంచన లేకుండా చేస్తున్నాం. నిపుణులు దీనిపై సలహాలు ఇవ్వాలి’ అన్నారు.

f.jpg


2019లో ఎలా గెలిచారు?

ఏపీ, హరియాణా ఎన్నికల్లో ఈవీఎంల మాయతో గెలిచారని కొందరు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల ను మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ‘‘2019లో వైసీపీ ఎలా గెలిచింది? వాళ్లూ ఈవీఎంల మాయతోనే గెలిచారా?’’ అని ప్రశ్నించా రు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు గతంలో ఎన్నడూ లేనంత బా గా జరిగాయని తెలిపారు. ప్రజలు ఆనందంతో ఉంటే(వైసీపీ నేతలను ఉద్దేశించి) వీళ్లు భరించలేకపోతున్నారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఉప్పు భూములు రాష్ట్రానికి అప్పగింత

20 వేల ఎకరాల ఉప్పు భూములు రాష్ట్రానికి అప్పగించడానికి కేంద్రం అంగీకరించింది. రిజిస్ట్రేషన్‌ చార్జీ ల్లో సగం రాయితీతో వీటిని అప్పగిస్తారు. దీనిపై ఒక టాస్క్‌ఫోర్స్‌ వేసి పనిచేస్తాం. రూ.60వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే బీపీసీఎల్‌ రిఫైనరీ రాష్ట్రానికి దక్కనుంది. బీపీసీఎల్‌ చైర్మన్‌ ఈ రోజు(బుధవారం) రాష్ట్రానికి వస్తున్నారు. మేం వాళ్లకు నాలుగు ప్రదేశాలు మూలపాడు,మచిలీపట్నం,రామాయపట్నం,కృష్ణపట్నం సూచించాం. వాటిలో ఎక్కడ పెట్టాలో వాళ్లు నిర్ణయించుకొంటారు. ఇది రాష్ట్రానికి వచ్చేలా చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్టబోయే 12 ఫోరెన్సిక్‌ యూనివర్సిటీల్లో ఒకదానిని అమరావతిలో పెట్టడానికి కేంద్రం అంగీకరించింది. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సాయంపైనా సానుకూలంగా స్పందించింది. ఒక్క మన రాష్ట్రంలోనే రూ.75 వేల కోట్ల పనులు మంజూరయ్యాయి.

కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవే

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడున్న జాతీయ రహదారిని 8 వరుసలతో కొత్త రహదారిని ప్రతిపాదించారు. బెంగళూరు-చెన్నై మధ్య ఇటువంటి రహదారిని నిర్మిస్తున్నారు. బుల్లెట్‌ రైలు కూడా ఇదే మార్గంలో వస్తుందని అనుకొంటున్నాను. దీనిని ఆధారం చేసుకొని తెలంగాణలో డ్రై పోర్ట్‌ కూడా వస్తుంది. వందే భారత్‌, నమో భారత్‌ వంటి కొత్త రైళ్లు వస్తాయి. ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది.

‘‘చాలినంత మంది అధికారులు లేక ఉన్నవారితోనే సర్దుకుపోతున్నాం. కొందరిపై ఆరోపణలు ఉన్నా తప్పడం లేదు. నూటికి డెబ్భై శాతం మంది అధికారులను వైసీపీ తన పాలనలో భ్రష్టు పట్టించింది. అంతమందిని పక్కన పెట్టి మిగిలిన ముప్ఫై శాతం మందితో పాలన నడిపించలేం. వాణిజ్య పన్నుల శాఖకు ఒక కమిషనర్‌ను కేటాయించడానికి అధికారుల లభ్యత లేదు. అప్పటికీ ఒకరికే రెండేసి బాధ్యతలు అప్పగిస్తున్నాం.

‘‘2019లో వైసీపీ ఎలా గెలిచింది? వాళ్లూ ఈవీఎంల మాయతోనే గెలిచారా? ఇటువంటి చెత్త మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి. రాష్ట్రానికి వీళ్లే అరిష్టం. విజయవాడ వరదల్లో మునగడానికి వీళ్లే కారణం. ప్రజలు కష్టాల్లో ఉన్నారని మేం ఉదారంగా సాయం చేస్తే అంత ఎందుకు ఖర్చయిందని ప్రశ్నలు వేస్తున్నారు. చివరి వీధిలో ఉన్నవాడికి కూడా సాయం అందించాలని అనుకొన్నప్పుడు ఐదు, పది శాతం దుబారా కావచ్చు. ఆ సమయంలో లెక్కలు వేసుకొంటూ కూర్చోలేం. వరదలు వస్తే (వైసీపీ నేతలను ఉద్దేశించి) వాళ్లు రారు. ఎవరికీ సాయం చేయరు. రాళ్లు విసరడానికి మాత్రం సిద్ధం’’

- ముఖ్యమంత్రి చంద్రబాబు

hkhkk.jpg


ఎక్కువ వేధింపులకు గురైంది నేనే..

‘‘పార్టీలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది నేనే. ఏభై మూడు రోజులు జైల్లో ఉన్నాను. అక్కడ నన్ను చంపాలని అనుకొన్నారని ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. నా ప్రతి కదలిక చూడటానికి జైలు గదిలో సీసీ కెమెరాలు పెట్టారు. కనీసం దోమతెర ఇవ్వలేదు. వేణ్ణీళ్లు కూడా ఇవ్వలేదు. వీటన్నింటికి నేను బదులు ఇవ్వాలి. కానీ కక్ష తీర్చుకోవడం నా పంఽథా కాదు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నవారి వ్యవహారం ప్రజల దృష్టికి తీసుకువెళతాం. ఎత్తుకెళ్లి జైల్లో పడేయడం వంటి చర్యలపై మాకు ఆసక్తి లేదు. వారి చర్యలు ఎలాంటివో ప్రజలకు తెలియచేస్తాం. వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు వివరిస్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు బాగా తెలుసు’’ అని చంద్రబాబు అన్నారు. నామినేటెడ్‌ పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

ధరలపై సమీక్షిస్తా..

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరుగుతుండటం తన దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకొంటామని చంద్రబాబు తెలిపారు. ‘‘వరదల వల్ల ఈ పరిస్ధితి వచ్చిందనుకొంటున్నాం. సమీక్ష నిర్వహిస్తాం’’ అన్నారు.

జమిలి ఎన్నికలు అవసరం: చంద్రబాబు

లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు కచ్చితంగా అవసరమని ’సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘ఏడాదికి నాలుగుసార్లు ఏవో ఎన్నికలు వస్తుండేసరికి ప్రభుత్వాలకు వాటి పనే సరిపోతోంది. ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలు అయిపోతే తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టి పనిచేయవచ్చు. నేను ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాను’’ అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన వల్లే హరియాణాలో బీజేపీకి ఘన విజయం సిద్ధించిందన్నారు. ‘‘హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ గెలవడం సామాన్యం కాదు. ఇదొక చరిత్రాత్మక విజయం. హిందీ బెల్ట్‌లో బీజేపీ బలహీనపడుతోందని, మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని ఇటీవల అనేక ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మోదీపైనా, బీజేపీపైనా నమ్మకం వ్యక్తం చేశారు. ప్రధానిగా ఆయన పనితీరు.. కేంద్రం లో ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఈ రోజు ఉద యం ప్రధానికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపాను. పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి మూడు శాతం ఓట్లు పెరిగాయి. సమయస్ఫూర్తితో తీర్పు ఇచ్చిన హరియాణా ప్రజలకు నా అభినందనలు. వారు ఇచ్చిన తీర్పు దేశంలో సుస్థిరతకు, అభివృద్ధి కొనసాగడానికి దోహదపడుతుంది. జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చినా, ఆ పార్టీ కంటే బీజేపీకి 2 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీని తర్వాత జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను కలిపి తీసుకువెళ్తే ప్రజలు మనతోనే ఉంటారని మరోసారి నిరూపితమైంది’’ అని అన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 04:40 AM