CM Chandrababu : నాతో పోటీ పడండి!
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:16 AM
‘మంత్రులందరూ నాతో పోటీ పడాలి.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్చార్జి మంత్రులు, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం
మంత్రులు చురుగ్గా పనిచేయాలి: చంద్రబాబు
సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందించాలి
ప్రభుత్వం చేసే పనులనూ చెప్పుకోలేకపోతే ఎలా?
ఉచిత ఇసుక గురించీ చెప్పలేకపోతున్నారు
కేంద్రం చేసిన పనులపైనా ప్రచారం చేద్దాం
రెండు నెలల్లో అభివృద్ధిని పట్టాలెక్కించాలి
కేబినెట్ భేటీలో సీఎం పిలుపు
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘మంత్రులందరూ నాతో పోటీ పడాలి.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్చార్జి మంత్రులు, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం చేసుకోలేకపోతున్నారు’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉచిత ఇసుక విధానం ప్రకటించి 15 రోజులవుతున్నా.. ప్రజలకు ఆ విషయాలను సరిగా చెప్పలేకపోతున్నారని ఆక్షేపిం చినట్లు తెలిసింది. ఈ విధానం సక్రమంగా అమలయ్యే బాధ్యతను జిల్లా, ఇన్చార్జి మంత్రులు తీసుకోవాలన్నారు. పెన్షన్లు ఇచ్చామని, అన్న క్యాంటీన్లు అమల్లోకి తెచ్చామని, రైతులకు కల్పించిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విజయనగరం జిల్లాలో డయేరియాలాంటి సంఘటనలపై స్థానికంగా ఉన్న మంత్రులు వెంటనే స్పందించి ఉండాల్సిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తోందని.. రూ.100 కోట్లతో పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోందని, ఈ విషయాలపై కూడా ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు.
బోగస్ పెన్షన్లపై ఉపసంఘానికి నో
బోగస్ పెన్షన్ల రద్దు, పెన్షన్ మంజూరు విధి విధానాలపై 8 మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించింది. పెన్షన్లు రద్దు చేసేందుకు ప్రస్తుతమున్న ఆరంచెల విధానాన్ని కూడా ఎత్తివేయాలని తీర్మానించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన అర్హతల ఆధారం గా పెన్షన్లు మంజూరుచేయాలని, తప్పుడు విధానంలో అనర్హులెవరైనా పెన్షన్లు పొందినట్లు ఫిర్యాదులొస్తే గ్రామసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
రాష్ట్రావతరణ వేడుక ఎప్పుడు?
రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే అంశంపై కేబినెట్ భేటీలో కీలక చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు 1952 డిసెంబరు 15న ఆత్మార్పణ చేశారని, 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే.. ఉమ్మడి ఏపీ నవంబరు 1న ఆవిర్భవించిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీ జూన్ 2న విడిపోయిన తేదీపైనా చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను తెలుగుజాతి గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. జూన్ 2న ఏర్పడిన నవ్యాంధ్రను ఎలా గుర్తించాలనే అంశంపైనా చర్చ జరిగింది. గత టీడీపీ హయాంలో జూన్ 2 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు చేపట్టామని మంత్రులు ప్రస్తావించారు. ఉచిత ఇసుక అమలుపై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై అక్రమాలకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.