ఎస్సీ వర్గీకరణపై కమిషన్
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:55 AM
ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
కొత్త సెన్సస్ ప్రకారం అమలు చేస్తాం
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తర్వాత
మరోసారి చర్చించి తుది నిర్ణయం
జనాభా దామాషాన జిల్లా యూనిట్‌గా అమలు
ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే చెప్పాం
దళిత వర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ
హాస్టళ్లు, గురుకులాల్లో వసతులపై హామీ
ఎస్సీలను ఏ, బీ, సీ కేటగిరీలుగా మాత్రమే
వర్గీకరించాలని ఎమ్మెల్యేల వినతి
విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా దళితుల సమగ్రాభివృద్ధి సాధ్యం. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది. పీ4 విధానం ద్వారా ఎస్సీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పథకాలు అమలు చేయడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడతాం.
- చంద్రబాబు
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుపై కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరతామని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో 23 మంది దళిత ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. వర్గీకరణను అమలు చేయడం ద్వారా దళితుల్లోని ఉప కులాల వారందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా ప్రకారం జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేశామని, తర్వాత న్యాయ సమస్యలతో అది నిలిచిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ మొదటినుంచీ దళితులకు అండగా ఉందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని తెలిపారు. 2014 తర్వాత జీవో 25 ద్వారా దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేశామని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చిందని, దీనికి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జగన్ పాలనలో దళిత జాతి తీవ్ర అణచివేతకు, వివక్షకు గురైందని... గత ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలతో తమ వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని కోరారు. కాగా, సీఎంతో సమావేశానికి ముందు దళిత ఎమ్మెల్యేలు భేటీ అయి దళితుల సమస్యలపై చర్చించారు. మాల, మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ వాటిని కలసికట్టుగా సీఎంకు వివరించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు చేపడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, దీన్ని జిల్లాస్థాయిలో వర్తింపజేయాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా కాకుండా ఏ, బీ, సీగా (మాదిగ, ఇతర/ మాల, ఇతర/ రెల్లి, ఇతర)గా వర్గీకరించాలి.
ఎస్సీ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు 16 శాతం నుంచి 18 శాతానికి పెంచాలి.
వర్గీకరణ అమలుకు ఒక కమిటీని గానీ కమిషన్‌ను గానీ నియమించాలి. అధ్యయనం అనంతరం నిర్దిష్ట కాలపరిమితి లోపు నివేదిక ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలి. ఈలోగా గత ప్రభుత్వ నిర్వాకంతో దారుణంగా తయారైన ఎస్సీ హాస్టళ్లు, గురుకులలో సమస్యలపై దృష్టి పెట్టాలి అని ఎమ్మెల్యేలు సీఎంకు విన్నవించారు.
మూడు కేటగిరీలు చాలు: దళిత ఎమ్మెల్యేలు
ఎస్సీ వర్గీకరణలో డీ-కేటగిరీ వద్దని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు దళిత ఎమ్మెల్యేలు చెప్పారు. మాల, మాదిగ ఉప కులాలను బీ, సీ-కేటగిరీల్లో చేర్చాలని కోరినట్లు తెలిపారు. ఏ-కేటగిరీలో రెల్లి, బీ-కేటగిరీలో మాదిగ, అనుబంధ కులాలు, సీ-కేటగిరీలో మాల, అనుబంధ కులాలు ఉంటాయని, ఈ మూడూ చాలని చెప్పామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివరించారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ తరపున 20 ఏళ్లుగా పోరాటం చేశానని, తన కల ఇప్పటికి సాకారమైందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. దళితులందరికీ ఈ రోజు శుభదినమని, జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని వర్ల కుమార్‌రాజా పేర్కొన్నారు. దళితుల అభివృద్ధిపై చంద్రబాబు హామీ ఇచ్చారని మద్దిపాటి వెంకటరాజు తెలిపారు.
సీఎం హామీలు ఇవీ...
ఈ నెల 11న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తర్వాత వర్గీకరణ అమలు కోసం కమిషన్ ఏర్పాటు చేసే విషయంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
కొత్త సెన్సస్ ప్రకారం వర్గీకరణ అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిందే చేస్తాం.
పీ4 విధానం ద్వారా ఎస్సీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పథకాలు అమలు చేయడంతో పాటు ఎస్సీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడతాం.
గురుకులాలు, హాస్టళ్లలో ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు ప్రాథమిక వసతులు కల్పిస్తాం. వాటిలో ప్రాంతాల వారీగా డైట్ ఏర్పాటు చేసి, ఆ మేరకు నిధులు అందిస్తాం.